Natural medicine
-
టాబ్లెట్స్ వేసుకున్నా తలనొప్పి తగ్గడం లేదా? అయితే ఇలా చేయండి
తలనొప్పి..ఈరోజుల్లో ప్రతి ఒక్కరిని సాధరణంగా వేధించే సమస్య ఇది. ఒత్తిడి సహా అనేక కారణాల వల్ల తలనొప్పి రావొచ్చు. కొన్నిసార్లు గంటల సమయం నుంచి రోజుల వరకు తలనొప్పి వేధిస్తుంటుంది. తల పగిలిపోయినట్లు అనిపించే ఈ బాధ నుంచి బయటపడేందుకు చాలామంది నొప్పి నివారణ బామ్‌లు, పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకుంటుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సులభంగా, ఇంటి చిట్కాలతోనే తలనొప్పి నుంచి సత్వర ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం. నీటిని తగినంత తీసుకోకపోయినా తలనొప్పి వస్తుంటుంది. కాబట్టి రోజుకు 8-10 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవాలి. ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది. గోరు వెచ్చని ఆవుపాలు సైతం తలనొప్పి నివారణిగా పనిచేస్తుందట. బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు జీడిపప్పు, బాదం వంటి డైఫ్రూట్స్‌ను గుప్పెడు తింటే తలనొప్పి తగ్గుతుందట. మెగ్నీషియం లోపంతో కూడా తలనొప్పి వేధిస్తుంది. అందుకని మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. మంచినీటిలో ధనియాలు, చక్కెర కలిపి తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గంధం చెక్కను అరగదీసి నుదిటిపై రాయడం ద్వారా కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. నిత్యం క్రమం తప్పకుండా 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. దీంతో పాటు వేళకు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలని కలిగి ఉంటుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు అల్లం టీని తాగడం వల్ల ఇన్స్టెంట్ రిలీఫ్ లభిస్తుంది. -
మూలికా వైద్యం..కేరాఫ్ గంధసిరి
అంతరించిపోతున్న సనాతన వనమూలికా వైద్యానికి ఓ గ్రామం నెలవుగా మారింది. మొండి రోగాలను సైతం ఈ వైద్యం మాయం చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులను సైతం ఆకర్షిస్తూ వారి ప్రశంసలందుకుంటోంది. లక్షలాది మంది సాధారణ ప్రజల జబ్బులు సైతం తగ్గిస్తూ ఈ మూలికా వైద్యం అపర సంజీవనిగా నిలుస్తోంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని గంధసిరి గ్రామం ఇందుకు వేదికగా మారింది. వనమూలికా వైద్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన, ఈ గ్రామానికి చెందిన పస్తం సహదేవరాజ్ తాను వైద్య సేవలందిస్తూనే, తన తెగకు చెందిన 150 మందికి ఇందులో శిక్షణ ఇచ్చారు. ఈ వైద్యం తనతోనే అంతరించి పోకుండా తన పిల్లలకు సైతం నేర్పించారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం తాతల కాలం నాటి విద్య.. శబరికోయ తెగకు చెందిన కొన్ని కుటుంబాలు ఏళ్ల క్రితం భద్రాచలం ప్రాంతం నుంచి గంధసిరి గ్రామానికి వలస వచ్చాయి. తమ తాతలు, తండ్రులు నేర్పిన మూలికా వైద్యాన్ని వంట బట్టించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైద్యం చేయడం ప్రారంభించాయి. ఈ కుటుంబాలకు చెందిన సహదేవరాజ్ 1979లో మొదలుపెట్టిన మూలికా వైద్యం దేశ విదేశాలకు విస్తరించింది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు తొలిసారిగా 1996లో లండన్ వెళ్లారు. అక్కడ బ్రిటన్ రాణిని కూడా కలిశారు. ఈ క్రమంలోనే నేపాల్, స్విట్జర్లాండ్, ఆ్రస్టేలియా, మలేసియా, ఇండోనేసియా తదితర దేశాల్లోనూ వైద్య సేవలందించారు. మరోవైపు అమెరికా, కెనడా నుంచి కూడా పలువురు ఇక్కడకు వచ్చి మూలికా వైద్యం చేయించుకున్నారు. పక్షవాతం, ఆస్తమా, సోరియాసిస్, కీళ్లవాతం తదితర దీర్ఘకాల రోగాల నుంచి ఉపశమనం పొందుతున్నారు. అడవుల్లో సేకరించి అనువుగా మార్చి.. ఈ వైద్య విధానంలో 364 రకాల మూలికలను ఉపయోగిస్తామని సహదేవరాజ్ చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, ఛత్తీస్‌గఢ్‌లోని కుంట, బస్తర్, శ్రీశైలం, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని అడవుల్లో వనమూలికలను సేకరించి గంధసిరి, కోయంబత్తూరులోని సహదేవరాజ్ ఆశ్రమాల్లో వైద్యానికి అనువుగా తయారుచేస్తారు. గ్రామానికి చెందిన 150 మంది ఆయన పర్యవేక్షణలో శిక్షణ పొంది అడవుల నుంచి మూలికలు తీసుకురావడంలో సహకరిస్తున్నారు. ఎలిజబెత్ రాణి ప్రశంసలు.. గంధసిరి మూలికా వైద్యం సామాన్యులతో పాటు ప్రముఖుల మన్ననలు కూడా పొందింది. మాజీ ప్రధానులు ఇందిరాగాం«దీ, రాజీవ్‌గాం«దీ, చంద్రశేఖర్, మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్, ఉమ్మడి ఏపీలోని పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఈ వైద్యం తీసుకున్నారు. ఇక నాటి బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 కూడా సహదేవ్రాజ్ ములికా వైద్యాన్ని ప్రశంసించారు. దీంతో ఆయన ఆ్రస్టేలియాలో బ్రాంచ్ ఏర్పాటు చేయగా మరిన్ని దేశాల్లో ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. మన దేశం, రాష్ట్రానికి చెందిన ప్రముఖులు కూడా ఆయన వద్ద వైద్యం పొందుతున్నారు. గంధసిరిలో ఈ నెల 6న వైద్య వనమూలిక ట్రస్ట్ ప్రారంభించేందుకు సహదేవ్రాజ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన తెగకు చెందిన ఇంకొందరికి ఈ ట్రస్ట్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ధన్వంతరి స్ఫూర్తిగా.. మా ముత్తాతలు, తాతలు, తండ్రులు చేసిన వైద్యాన్నే మేమూ చేస్తున్నాం. కుటుంబంలో ఎవరికి జబ్బుచేసినా అదే కుటుంబంలోని మరొకరు కాపాడటంతోనే ఈ మూలికా వైద్యం పుట్టింది. మాకు ధన్వంతరి భగవాన్ స్ఫూర్తి. దేశ, విదేశాలకు వెళ్లి ప్రముఖులకు చికిత్స చేశాం. ఈ విధానం అంతరించిపోకుకుండా దీన్ని మా పిల్లలకూ నేరి్పంచాం. మూలికా వైద్యంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. నెలరోజుల్లో సైనస్ తగ్గింది.. నాకు సైనస్, మోకాళ్ల నొప్పులు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండేవి. ఇవి తగ్గడానికి గతంలో వేల రూపాయలు ఖర్చు చేశా. ఫలితం లేకపోవడంతో గురూజీ సహదేవరాజ్ వనమూలిక వైద్యం గురించి తెలుసుకుని గత నెల గంధసిరికి వచ్చా. నాతోపాటు నా కుమారుడికి సైనస్, భార్యకు బీపీ, థైరాయిడ్‌కు సంబంధించి కూడా వనమూలికలు తీసుకున్నా. నాకు నెలరోజుల్లో సైనస్ తగ్గింది. వారికి కూడా ఉపశమనం కలిగింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మూలికా వైద్యం చాలా బాగుంది. – పసునూరు జయపాల్‌రెడ్డి, ప్రసన్నాంజనేయస్వామి టెంపుల్ చైర్మన్, చంపాపేట, హైదరాబాద్ -
ఇక ఎక్కడైనా ఔషధ తయారీ!
లండన్: అత్యవసర సమయాల్లో రోగికి అవసరమైన ఔషధం దొరకకపోతే ఎదురయ్యే పరిస్థితి వర్ణనాతీతం. పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఔషధాలు వెంటనే దొరికే అవకాశం ఉన్నా.. కుగ్రామాలు, కొండ ప్రాంతాల్లో అత్యవసరంగా కావాల్సిన ఔషధాలు దొరికే పరిస్థితి లేదు. అయితే ఈ పరిస్థితులు త్వరలో తొలగిపోయే అవకాశాలున్నాయి. ఎక్కడి నుంచైనా ఔషధాలను కంప్యూటర్ సాయంతో తయారుచేసే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘కెంప్యూటర్’గా పిలిచే ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ సాయంతో ప్రపంచంలోని ఏ మూల నుంచైనా సులభంగా, అత్యంత నమ్మదగిన సహజ సిద్ధమైన ఔషధాలను తయారు చేసుకోవచ్చని బ్రిటన్‌లోని గ్లాస్గౌ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. ఈ పద్ధతి అందుబాటులోకి వస్తే ఫార్మా రంగంపై కొన్ని కంపెనీల ఆధిపత్యం తగ్గిపోనుందని వారు పేర్కొన్నారు. ఈ కెంప్యూటర్ద్వారా రసాయన సమ్మేళనాల కోడ్‌ను అభివృద్ధి చేసి ఇతరులకు షేర్ చేయవచ్చు. ఈ రసాయన సమ్మేళన కోడ్‌ను అమలు చేసే విధానాన్ని కెంపేలర్ అంటారు. ఈ కెంపేలరే ఔషధాలను రూపొందించే విధానాన్ని వివరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు సైతం వారు అభివృద్ధి చేసిన రసాయన సమ్మేళనాలనూ డిజిటల్ రూపంలోకి మార్చుకోవచ్చు. -
స్థూలకాయానికి సహజసిద్ధ ఔషధం
కొచ్చి: స్థూలకాయం, డిస్లీపిడీమియా (రక్తంలో లిపిడ్ల సంఖ్య పెరగడం) వ్యాధులకు శాస్త్రవేత్తలు సముద్ర కలుపు మొక్కల నుంచి సహజ సిద్ధ విరుగుడును కనుగొన్నారు. కాడల్మిన్ టీఎంఏసీఈ (కాడల్మిన్ టీఎం యాంటీపర్కొలెస్టరొలేమిక్ ఎక్స్ట్రాక్ట్)గా పిలిచే ఇది వంద శాతం సహజసిద్ధ సముద్ర బయోయాక్టివ్ పదార్థాల నుంచి తయారైన ఏకైక ఔషధమని కొచ్చిలోని కేంద్ర మెరైన్ ఫిషరీస్ పరిశోధన సంస్థ వెల్లడించింది. సంస్థ ఏర్పడి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా శనివారం ఈ ఔషధాన్ని విడుదల చేస్తారు. భారత సముద్ర తీరాల్లో విరివిగా లభించే, ఔషధ గుణాలున్న కలుపు మొక్కల నుంచి దీన్ని తయారుచేశారు. దీన్ని 400 ఎంజీ మాత్రల్లో తెస్తామని, ఎలాంటి దుష్ప్రభావాలు లేవని పరీక్షల్లో తేలిందని శాస్త్రవ్తేలు చెప్పారు.