Nee Jathaga Nenundali
-
సినిమా రివ్యూ: నీజతగా...నేనుండాలి
ప్లస్ పాయింట్స్: కథ, కథనం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్: హీరోయిన్ డైలాగ్స్, డబ్బింగ్ కథ, స్క్రీన్ ప్లే: షగుఫ్తా రఫీఖ్ సంగీతం: మిథున్, జీత్ గంగూలీ, అంకిత్ తివారీ నిర్మాత: బండ్ల గణేష్ దర్శకత్వం: జయ రవీంద్ర బాలీవుడ్లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై..భారీ ఘన విజయాన్ని ఆషికీ-2 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్, మద్యానికి బానిసై.. విఫలమైన ఓ గాయకుడి కథను నేపథ్యంగా తీసుకుని మ్యూజికల్, లవ్‌స్టోరిగా రూపొందిన ఆషికీ-2 చిత్రాన్ని ప్రాంతాలు భాషలకతీతంగా ప్రేక్షకులు బ్రహ్మరంధం పట్టారు. అదే చిత్రాన్ని తాజాగా ‘నీజతగా...నేనుండాలి’ టైటిల్‌తో రూపొందించి ఆగస్టు 22 తేదిన విడుదల చేశారు. హిందీలో ఆకట్టుకన్న విధంగానే ‘నీజతగా నేనుండాలి’ ప్రేక్షకులను ఆలరించిందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కథలోకి వెళ్లాల్సిందే. కొద్దికాలంలోనే పాపులారిటీని సొంతం చేసుకున్న ఆర్జే, గాయకుడు రాఘవ జయరాం. డ్రగ్స్, మద్యానికి బానిసైన రాఘవ క్రమంగా తన పాపులారిటీని క్రమంగా కోల్పోతాడు. ఈ నేపథ్యంలో గాయత్రి నందన అనే బార్ సింగర్‌ను చూసి ఆమెలోని టాలెంట్‌ను ఇష్టపడుతాడు. గాయత్రిని గొప్ప సింగర్ చేయాలని నిర్ణయించుకుంటాడు. గాయత్రిపై ఇష్టం ప్రేమగా మారుతుంది. గాయత్రిని గొప్ప సింగర్‌ని చేశాడా? సింగర్‌గా రాఘవ మళ్లీ పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నాడా?గాయత్రి, రాఘవల ప్రేమ సుఖాంత మవుతుందా అనే ప్రశ్నలకు సమాధానమే నీజతగా నేనుండాలి. రాఘవగా సచిన్, గాయత్రిగా నజ్రియాలు నటించారు. తమ శక్తి సామర్ధ్యాల మేరకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేశారు. పాధ్యాన్యత ఉన్న పాత్రల్లో నటించిన రావు రమేశ్, శశాంక్‌లు వారి పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు. సగటు సంగీత అభిమానులను హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించికున్న ఆషికీ-2 మ్యూజిక్ ఒరిజినల్ ట్రాక్స్ మళ్లీ వినాలనే రేంజ్లో ఉన్నాయి. నేపథ్యగీతాలకు చంద్రబోస్ అందించిన సాహిత్యం బాగుంది. విశ్లేషణ: దేశవ్యాప్తంగా ఆషికీ-2 చిత్రానికి యువతతోపాటు అన్నివర్గాల నుంచి లభించిన ఆదరణ ఈ మధ్యకాలంలో ఏచిత్రానికి లభించలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారంటే అంచనాలు, కంపారిజన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎంత వద్దనుకున్నా.. ఆషికీ-2 చిత్ర ప్రభావం వెంటాడుతునే ఉంటుంది. ఆషికీ-2 చిత్రం ప్రభావం ఆ రేంజ్లో ఉంటుంది. ‘నీజతగా నేనుండాలి’ చిత్ర విషయానికి వస్తే.. ఆ రేంజ్లో ఫీల్ కలిగించలేకపోయిందని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రంలో ఇంటెన్సిటిని, ఫీల్‌ను కొనసాగించడానికి జట్టు తమ శాయశక్తులా ప్రయత్నించారు. నటీనటుల యాక్టింగ్‌ను.. డైలాగ్స్, డబ్బింగ్ ఎక్కువగా డామినేట్ చేశాయి. హీరో, హీరోయిన్ల ఎంపిక విషయంలో మరికొంత జాగ్రత్త వహించి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఆషికీ-2 చిత్రాన్ని చూడని తెలుగు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. కొన్ని సీన్లలో ఎమోషన్స్‌ను తెరపైన చూపించడంలో సంగీతం, దర్శకుడు జయ రవీంద్ర ప్రతిభ ప్రధానపాత్ర పోషించింది. ఆషికీ-2 చూడని ప్రేక్షకులకు ‘నీజతగా నేనుండాలి’ ఓ ఫీల్‌ను కలిగిస్తుంది కాని.. అద్బుతమైన ఫీలింగ్‌ను మాత్రం కాదు.. -
‘ఆషికి-2’ కంటే బాగా వచ్చింది
హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఆషికి 2’ తెలుగులో ‘నీ జతగా నేనుండాలి’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. సచిన్ జోషి, నజియా జంటగా శివబాబు బండ్ల సమర్పణలో బండ్ల గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్‌లో చేశారు. ఈ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ హిందీలోకన్నా తెలుగులో బాగా వచ్చిందని గణేశ్ అన్నారు. పాటలు ఘనవిజయం సాధించడానికి స్వరాలతో పాటు సాహిత్యం కారణమని, మంచి ఫీల్ ఉన్న చిత్రమనీ సచిన్ తెలిపారు. ఈ సినిమా తనకు ప్రత్యేకమని నజియా అన్నారు. -
నీ జతగా నేనుండాలీ మూవీ ప్లాటీనమ్ డిస్క్ వేడుక
-
‘ఆషికి-2’ చేయడానికి ముందు భయపడ్డాను
గత ఏడాది హిందీలో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ‘ఆషికి 2’ ఒకటి. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నీ జతగా నేనుండాలి’ పేరుతో సచిన్ జోషి, నాజియా జంటగా జయరవీంద్ర దర్శకత్వంలో బండ్ల గణేశ్ పునర్నిర్మించారు. నేడు సచిన్ జోషి పుట్టినరోజు. ఈ సందర్భంగా తన మనోభావాలు పంచుకుంటూ -‘‘మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ తర్వాత హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టాను. కొంత విరామం తర్వాత తెలుగులో చేసే సినిమా అద్భుతంగా ఉండాలని, ‘ఆషికి-2’ వంటి క్యూట్ లవ్‌స్టోరీ అయితే బాగుంటుందని ఈ రీమేక్‌లో నటించాలనుకున్నాను. ఇందులో హీరో ఎప్పుడూ తాగుతూ ఉంటాడు. ముందు ఈ పాత్ర చేయడానికి కొంచెం భయపడ్డాను. తెలుగుకి అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేశాం. ముఖ్యంగా క్లయిమాక్స్ ఊహించని మలుపుతో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటికే పాటలు పెద్దలు హిట్టయ్యాయి. ఇదొక విభిన్న ప్రేమకథా చిత్రం’’ అని చెప్పారు. ‘ఆషికి-2’ తమిళ రీమేక్‌లో నటించాలనుకుంటున్నాననీ, తెలుగులో ఓ హారర్, ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో నటించనున్నానని సచిన్ తెలిపారు. అలాగే, థింక్ టాంక్ అనే సంస్థను ప్రారంభించి, లఘు చిత్రాలతో పాటు అన్ని రకాల సినిమాలు తీయాలని ఉందని వెల్లడించారు. -
'నీ జతగా నేనుండాలి' ఆడియో ఆవిష్కరణ
-
అద్భుతమైన ప్రేమకథ
బాలీవుడ్ హిట్ ‘ఆషికి 2’ ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘నీ జతగా నేనుండాలి’. సచిన్, నజియా జంటగా నటిస్తున్నారు. కె.జయరవీంద్ర దర్శకుడు. బండ్ల గణేశ్ నిర్మాత. జీత్ గంగూలి, అంకిత్ తివారి, మిథున్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దిల్ రాజు ఆడియో సీడీని ఆవిష్కరించగా, శిరీష్, లక్ష్మణ్ ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వీరితో పాటు అతిథులుగా విచ్చేసిన పరుచూరి వెంకటేశ్వరరావు, బీవీఎస్ఎన్ ప్రసాద్, బీవీఎస్ రవి సినిమా విజయం సాధించాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. ఈ కథ మీదున్న ప్రేమతో సచిన్ ఈ సినిమా చేస్తున్నారని, బండ్ల గణేశ్ సంస్థలో పనిచేయడం ఆనందంగా ఉందని దర్శకుడు చెప్పారు. ‘‘ ‘ఆషికి 2’ రైట్స్ తీసుకున్న తర్వాత ఎవరైతే కరెక్ట్ అని ఆలోచిస్తున్న సమయంలో టక్కున సచిన్ గుర్తొచ్చారు. తెలుగులో తను నటించి చాలా కాలమైంది. పదేళ్లుగా నాకు మంచి మిత్రుడు తను. హిందీలో విజయం సాధించినట్లే, తెలుగులో కూడా ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంటుంది. జూలై మూడో వారంలో సినిమాని విడుదల చేస్తాం’’ అని బండ్ల గణేశ్ తెలిపారు. దర్శకుడు జయ రవీంద్ర అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఖర్చుకు వెనుకాడకుండా గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, ఇది అద్భుతమైన ప్రేమకథ అని సచిన్ చెప్పారు. ఇంకా చిత్రబృందం మాట్లాడారు. -
హిందీ చిత్రాన్ని మించేలా...
హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఆషికీ 2’ తెలుగులో ‘నీ జతగా నేనుండాలి’ పేరుతో రీమేక్ అవుతోన్న విషయం తెలిసిందే. శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె. జయ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సచిన్, నజియా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ - ‘‘హిందీ ‘ఆషికీ 2’కి ఏ మాత్రం తీసిపోకుండా ఈ చిత్రం చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాని మించేలా ఈ సినిమా ఉండేట్లు దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ‘ఎవడు’లోని ‘నీ జతగా నేనుండాలి...’ పాటే ఈ సినిమాకి టైటిల్‌గా పెట్టాం. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ కాబట్టి, ఈ టైటిలే బాగుంటుంది. నాలుగు రోజుల్లో హైదరాబాద్‌లో షెడ్యూల్ పూర్తి చేసి, 16న పోలండ్ వెళ్లి అక్కడ ఓ పాట, ఫైట్ చిత్రీకరించడంతో సినిమా పూర్తవుతుంది’’ అని చెప్పారు. సచిన్, నజియా సహజమైన నటన కనబరుస్తున్నారని, హిందీ సినిమాని మించే స్థాయిలో ఉండాలనే పట్టుదలతో చేస్తున్నామని దర్శకుడు తెలిపారు. సచిన్ మాట్లాడుతూ - ‘‘మాతృక కన్నా ఈ సినిమా బాగా వస్తోంది. సంగీత ప్రధానంగా సాగే ఈ చిత్రానికి జీత్ గంగూలి, మిథున్, అంకిత్ మంచి పాటలు స్వరపరిచారు’’ అన్నారు. తెలుగులో తనకిది తొలి చిత్రమని నజియా తెలిపారు. -
ప్రేమ కథకు.. పాటే టైటిల్
మౌనమేలనోయి, ఒరేయ్ పండు చిత్ర కథానాయకుడు సచిన్ హీరోగా బండ్ల గణేశ్ నిర్మిస్తున్న చిత్రానికి ‘నీ జతగా నేనుండాలి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఆషికి-2’ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కె.రవీంద్ర దర్శకుడు. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ సినిమా కోసం చాలా టైటిల్స్ అనుకున్నాం. చివరకు రామ్‌చరణ్ ‘ఎవడు’లోని ‘నీ జతగా నేనుండాలి..’ పాట పల్లవిలోని మొదటి పదాన్ని మా సినిమా టైటిల్‌గా ఖరారు చేశాం. ఈ కథకు ఆ పేరు సరిగ్గా సరిపోతుంది. ఈ నెల 14 నుంచి పోలెండ్‌లో పది రోజుల పాటు జరిగే చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది’’ అని తెలిపారు. ఈ సంగీత భరిత ప్రేమకథను మనసులకు హత్తుకునే రీతిలో దర్శకుడు తెరకెక్కిస్తున్నారని, హిందీలో లాగే ఇక్కడా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని సచిన్ నమ్మకం వెలిబుచ్చారు. ‘‘నా కెంతో ఇష్టమైన ‘ఆషికీ-2’ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించే అవకాశం రావడం నా అదృష్టం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అంకిత్ తివారి, మాటలు: మధుసూదన్, కెమెరా: ఎ.వసంత్, సమర్పణ: శివబాబు బండ్ల.