ఇతడు రంగుల్ని ‘వింటాడు’!
తల మీద కెమెరా యాంటెన్నాను బిగించుకుని, రంగు రంగుల టైని పరిశీలిస్తున్న ఇతడు లండన్‌కు చెందిన మ్యుజీషియన్, ఆర్టిస్టు నీల్ హార్బిసన్. రంగుల టైని తదేకంగా చూస్తున్నా.. వాస్తవానికి ఆ రంగులు ఇతడికి కనిపించవు. యాక్రోమెటాప్సియా అనే కలర్ బ్లైండ్నెస్ సంబంధ సమస్య కారణంగా ఇతడి జీవితం బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది.
నలుపు, తెలుపు తప్ప ఇతర రంగులేవీ కనిపించవు. అయితే కంటికి కనిపించకున్నా ఆయా రంగుల్ని ఈ ఐబోర్గ్ కెమెరా యాంటెన్నాతో వినగలగడం ఇతని ప్రత్యేకత! ఎలా వింటాడంటే... యాంటెన్నాకు ముందువైపు కెమెరా రంగుల ఫ్రీక్వెన్సీని పసిగడుతుంది. ఆ సమాచారానికి అనుగుణంగా యాంటెన్నా వెనకవైపున వైబ్రేషన్లు పుట్టిస్తుంది. వైబ్రేషన్లు పుర్రె ఎముకల ద్వారా మెదడును చేరతాయి. వైబ్రేషన్ స్థాయిలను బట్టి కళ్ల ముందున్న రంగులను ఇత డు తెలుసుకుంటాడు. హార్బిసన్కు 21 ఏళ్ల వయసులో పదేళ్ల క్రితమే ఈ ఐడియా వచ్చింది. మరో వ్యక్తి సాయంతో దీనిని తయారుచేసి అప్పటి నుంచి వాడుతున్నాడు.
అయితే యాంటెన్నాను మరింత అభివృద్ధిపర్చి పుర్రె లోపల అమర్చుకునే వైఫై కనెక్టర్ చిప్‌ను తయారుచేసిన హార్బిసన్ ఇప్పుడు దానిని తలలో అమర్చుకునేందుకు సిద్ధమవుతున్నాడు. వైఫై చిప్‌తో రంగుల్ని మరింత బాగా వినగలుగుతానని, మొబైల్ ఫోన్ల నుంచి వైఫై చిప్‌కు ఫొటోలను పంపి వాటిని చూడకుండానే వింటానని అంటున్నాడు.