పాన్‌తో ఆధార్ అనుసంధానికి కొత్త లింక్
న్యూఢిల్లీ: పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ అనుసంధానం కోసం ఆదాయపన్ను శాఖ కొత్త వెసులుబాటును (ఇ-ఫెసిలిటీ) గురువారం ప్రారంభించింది. సంస్థ వెబ్ సైట్ లో https://incometaxindiaefiling.gov.in/ పేరుతో కొత్త లింక్‌ను లాంచ్ చేసింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి పాన్ నెంబరు తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ సదుపాయాన్ని ప్రారంభించింది. పాన్ తో ఆధార్ అనుసంధాన ప్రక్రియను మరింత సులభం చేస్తూ ఆదాయ పన్నుశాఖ ఇ-ఫైలింగ్ వెబ్ సైట్ లో ఈ కొత్త లింక్‌ను పొందు పర్చింది. ఒక వ్యక్తి యొక్క రెండు ప్రత్యేక గుర్తింపులను (పాన్, ఆధార్ ) అనుసంధానించటానికి హోం పేజ్‌లో దీన్ని సృష్టించింది. అయితే పాన్, ఆధార్ లలో నమోదు చేసిన వివరాలు ఒకేలా ఉండాలని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది.
యుఐడిఎఐ (ఇండిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుండి వెరిఫికేషన్ తర్వాత, ఈ లింక్ ధృవీకరిస్తుందని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. ఐటీ ఈ ఫైలింగ్ వెబ్సైట్లో లాగిన్ అవసరం లేకుండానే ఎవరైనా ఈ లింక్ ద్వారా ఆధార్, పాన్ నంబర్లను అనుసంధానించుకోవచ్చని తెలిపింది. అలాగే పాన్, ఆధార్ కార్డులలో డేట్ ఆఫ్‌బర్త్, జెండర్ తదితర వివరాలు సరిపోలాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ(వన్‌టైం పాస్వర్డ్) లేదా ఈ మెయిల్ పంపుతామని చెప్పింది. ఆర్థిక చట్టం 2017 ప్రకారం ఐటీఆర్ దాఖలుకు ఆధార్ తప్పనిసరి. అలాగే పాన్ దరఖాస్తుకు ఆధార్ నెంబర్ తప్పనిసరి అనే నిబంధన 2017 జూలై నుంచి అమలుకానుంది.