New mobile application
-
అభిమానుల కోసం కొత్త ‘స్పోర్ట్స్ యాప్’
సాక్షి, హైదరాబాద్: అరవై పదాల్లో ఆసక్తికర క్రీడా సమాచారం... ఇదే లక్ష్యంతో కొత్త మొబైల్ అప్లికేషన్ మార్కెట్లోకి వచ్చింది. ‘వాట్స్ ఇన్ ద గేమ్’ పేరుతో రూపొందించిన ఈ యాప్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్ సహ భాగస్వామి. సాయిప్రణీత్‌తో పాటు అనిల్ కుమార్ మామిడాల, ఈజేబీ ప్రమీల కలిసి ఈ యాప్‌ను తీసుకొచ్చారు. ఇతర స్పోర్ట్స్ యాప్‌లతో పోలిస్తే ‘వాట్స్ ఇన్ ద గేమ్’ అన్ని రకాల క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని, షెడ్యూల్ మొదలు ఫలితాల వరకు సమాచారం అరవై పదాల్లోనే అందుబాటులో ఉంటుదని రూపకర్తలు వెల్లడించారు. ప్రొఫెషనల్‌గా బ్యాడ్మింటన్ క్రీడాకారుడినే అయినా... ఇతర క్రీడలపై తనకున్న ఆసక్తి, ఒక క్రీడాభిమానిగా అన్ని రకాల సమాచారం తెలుసుకోవాలని కుతూహలం కారణంగా ఇలాంటి యాప్ ఉంటే బాగుంటుందని భావించానని, అందుకే తాను భాగం అయ్యాయని సాయిప్రణీత్ వ్యాఖ్యానించాడు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షా కేంద్రాల వివరాలకు ప్రత్యేక యాప్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 4 నుంచి 18 వరకు పరీక్షలు జరుగనుండగా, విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాల వివరాలు తెలుసుకునేందుకు వీలుగా బోర్డు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘టీఎస్‌బీఐఈ ఎం–సర్వీసెస్’యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని, దానిద్వారా పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. ఒకట్రెండు రోజుల ముందే కేంద్రానికి వెళ్లి, తామున్న ప్రాంతం నుంచి ఎంత సమయంలో అక్కడికి చేరుకుంటామో యాప్ ద్వారా తెలుసుకునే వీలుంటుందని విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, వీటికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,339 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు 8.45 కల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 9 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక్కో చీఫ్ సూపరింటెండెంట్ అధికారిని నియమించామని తెలిపారు. మొత్తం 9,65,839 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా, 25,550 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణలో పాల్గొననున్నారని తెలిపారు. మొత్తం విద్యార్థుల్లో 4,80,516 మంది మొదటి సంవత్సరం, 4,85,323 మంది విద్యార్థులు రెండో సంవత్సరం పరీక్షకు హాజరుకానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇంటర్ బోర్డు వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. -
పిల్లల్ని కంట్రోల్ చేసే యాప్
వాషింగ్టన్: చదువులను సైతం పక్కన పెట్టి నేటి యువతలో అత్యధిక శాతం మంది స్నేహితులు, పార్టీలు.. అంటూ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. దీనికి చెక్ పెట్టి విద్యార్థులను దారిలో పెట్టే తొలి స్మార్ట్‌ఫోన్ యాప్‌ను వాషింగ్టన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి చేయాల్సిందల్లా, చదువు, నిద్ర, వ్యాయామం, పార్టీలు, స్నేహితులతో కాలక్షేపం.. వంటి వాటికి మీరు రోజుకి ఎంత సమయం కేటాయించారో దానిలో నిష్పక్షపాతంగా అప్లోడ్ చేయడమే. విద్యార్థులు అందించే సమాచారం ఆధారంగా వారి ప్రవర్తనను అంచనా వేయడమే కాక, గ్రేడులు కూడా అందిస్తుంది. విద్యార్థులు ఏ విషయంలోనైనా గీత దాటుతుంటే తగిన సూచనలు కూడా జారీ చేస్తుంది. ఈ స్మార్ట్ జీపీఏ యాప్ ఆటోమెటిక్ సెన్సింగ్ డేటాను ఉపయోగించుకుని పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనంలో భాగంగా 30 మంది డిగ్రీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల స్మార్ట్ ఫోన్లకు ఈ యాప్‌ను అమర్చి 10 వారాల పాటు దీని పనితీరును గమనించారు. యాప్ సమర్థంగాపనిచేస్తోందని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. దీనివల్ల విద్యార్థుల్లో ఏవైనా మానసిక లోపాలుంటే గుర్తించడానికి వీలుంటుందని అన్నారు. ప్రవర్తన, నిద్ర, స్కూల్ హాజరు.. వంటి వాటిలో ఎటువంటి మార్పులు వచ్చినా హెచ్చరికలు జారీ చేస్తుందని పేర్కొన్నారు. అయితే సరైన సమాచారం అందించడం మాత్రం తప్పనిసరి అని చెప్పారు. -
మహిళలకు అండగా కొత్త మొబైల్ యాప్
-
మందుబాబుల కోసం ‘సీసా’ మొబైల్ అప్లికేషన్!
కేరళ: స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అవసరం ఏదైనా ఇట్టే తీర్చేసే మొబైల్ అప్లికేషన్(ఆప్)లు ఇప్పటికే ఎన్నో ఉన్నాయి. అయితే మందుబాబుల కోసం రూపొందించిన ‘కుప్పి’ అనే ఓ కొత్త మొబైల్ అప్లికేషన్ ఇప్పుడు కేరళలో సందడి చేస్తోంది. కుప్పి అంటే మళయాళంలో సీసా అని అర్థం. మళయాళంలో సమాచారం ఇచ్చే ఈ ఆప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసుకుంటే చాలు.. కేరళలో వైన్‌షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయి? దగ్గరలోని షాపుల్లో ఏయే బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి? వంటి వివరాలను మందుబాబులు తెలుసుకోవచ్చు. ధరల పట్టిక కూడా ఎప్పటికప్పుడు ఈ అప్లికేషన్లో చూసుకోవచ్చు. అంతేకాదండోయ్.. మద్యపానానికి సంబంధించిన నీతివచనాలను కూడా ఈ అప్లికేషన్ మందుబాబులకు చెబుతుందట. ఈ ఆప్ సరదా కోసమేనని తాగుబోతులను ప్రోత్సహించేందుకు మాత్రం కాదని దీనిని రూపొందించిన ‘లియో సాఫ్ట్వేర్స్’ చెబుతున్నా.. ఇప్పటికే ఐదు లక్షల మంది దీనిని డౌన్లోడ్ చేసుకున్నారట. అన్నట్టూ.. దేశంలో ఆల్కహాల్ వినియోగంలో కేరళ రాష్ట్రమే నెంబర్ వన్ అట. కేరళలో ఒక్కో వ్యక్తి సగటున ఏడాదికి 8 లీటర్లకు పైగా ఆల్కహాల్ సేవిస్తారని, ఇది జాతీయ సగటుకు రెట్టింపు అని అంచనా.