
పిల్లల్ని కంట్రోల్ చేసే యాప్
వాషింగ్టన్: చదువులను సైతం పక్కన పెట్టి నేటి యువతలో అత్యధిక శాతం మంది స్నేహితులు, పార్టీలు.. అంటూ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. దీనికి చెక్ పెట్టి విద్యార్థులను దారిలో పెట్టే తొలి స్మార్ట్‌ఫోన్ యాప్‌ను వాషింగ్టన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి చేయాల్సిందల్లా, చదువు, నిద్ర, వ్యాయామం, పార్టీలు, స్నేహితులతో కాలక్షేపం.. వంటి వాటికి మీరు రోజుకి ఎంత సమయం కేటాయించారో దానిలో నిష్పక్షపాతంగా అప్‌లోడ్ చేయడమే. విద్యార్థులు అందించే సమాచారం ఆధారంగా వారి ప్రవర్తనను అంచనా వేయడమే కాక, గ్రేడులు కూడా అందిస్తుంది. విద్యార్థులు ఏ విషయంలోనైనా గీత దాటుతుంటే తగిన సూచనలు కూడా జారీ చేస్తుంది.
ఈ స్మార్ట్ జీపీఏ యాప్ ఆటోమెటిక్ సెన్సింగ్ డేటాను ఉపయోగించుకుని పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనంలో భాగంగా 30 మంది డిగ్రీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల స్మార్ట్ ఫోన్లకు ఈ యాప్‌ను అమర్చి 10 వారాల పాటు దీని పనితీరును గమనించారు. యాప్ సమర్థంగాపనిచేస్తోందని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. దీనివల్ల విద్యార్థుల్లో ఏవైనా మానసిక లోపాలుంటే గుర్తించడానికి వీలుంటుందని అన్నారు. ప్రవర్తన, నిద్ర, స్కూల్ హాజరు.. వంటి వాటిలో ఎటువంటి మార్పులు వచ్చినా హెచ్చరికలు జారీ చేస్తుందని పేర్కొన్నారు. అయితే సరైన సమాచారం అందించడం మాత్రం తప్పనిసరి అని చెప్పారు.