
మందుబాబుల కోసం ‘సీసా’ మొబైల్ అప్లికేషన్!
కేరళ: స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అవసరం ఏదైనా ఇట్టే తీర్చేసే మొబైల్ అప్లికేషన్(ఆప్)లు ఇప్పటికే ఎన్నో ఉన్నాయి. అయితే మందుబాబుల కోసం రూపొందించిన ‘కుప్పి’ అనే ఓ కొత్త మొబైల్ అప్లికేషన్ ఇప్పుడు కేరళలో సందడి చేస్తోంది. కుప్పి అంటే మళయాళంలో సీసా అని అర్థం. మళయాళంలో సమాచారం ఇచ్చే ఈ ఆప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు.. కేరళలో వైన్‌షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయి? దగ్గరలోని షాపుల్లో ఏయే బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి? వంటి వివరాలను మందుబాబులు తెలుసుకోవచ్చు.
ధరల పట్టిక కూడా ఎప్పటికప్పుడు ఈ అప్లికేషన్‌లో చూసుకోవచ్చు. అంతేకాదండోయ్.. మద్యపానానికి సంబంధించిన నీతివచనాలను కూడా ఈ అప్లికేషన్ మందుబాబులకు చెబుతుందట. ఈ ఆప్ సరదా కోసమేనని తాగుబోతులను ప్రోత్సహించేందుకు మాత్రం కాదని దీనిని రూపొందించిన ‘లియో సాఫ్ట్‌వేర్స్’ చెబుతున్నా.. ఇప్పటికే ఐదు లక్షల మంది దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారట. అన్నట్టూ.. దేశంలో ఆల్కహాల్ వినియోగంలో కేరళ రాష్ట్రమే నెంబర్ వన్ అట. కేరళలో ఒక్కో వ్యక్తి సగటున ఏడాదికి 8 లీటర్లకు పైగా ఆల్కహాల్ సేవిస్తారని, ఇది జాతీయ సగటుకు రెట్టింపు అని అంచనా.