ఆరేళ్లుగా వీడని మిస్టరీ.. తనను మిస్సవుతున్నా!
మెల్బోర్న్: ఆరేళ్ల క్రితం దారుణ పరిస్థితుల్లో శవమై తేలిన నర్సు హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఆస్ట్రేలియా పోలీసులు శుక్రవారం వెల్లడించారు. నిందితుల సమాచారం అందించిన వారికి 5 లక్షల డాలర్ల రివార్డు ఇస్తామని ప్రకటించామని, త్వరలోనే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివరాలు.. ఇండో- ఫిజియన్ మహిళ మోనికా చెట్టి(39) 2014 జనవరిలో హత్యకు గురయ్యారు. ఆమె ముఖం, శరీరంపై యాసిడ్‌తో దాడి చేసిన గుర్తు తెలియని దుండగులు సిడ్నీకి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో గల వెస్ట్ హోస్టన్ వద్ద పొదల్లో పడేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న మోనికను ఆస్పత్రిలో చేర్పించగా నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన న్యూసౌత్‌వేల్స్ పోలీసులు ఆనాటి నుంచి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇంతవరకు నిందితుల జాడ తెలియరాలేదు. ఇక ఈ కేసును ప్రతిష్టాత్మకంగా భావించిన స్థానిక ప్రభుత్వం మోనిక హంతకుల ఆచూకీ చెప్పిన వారికి 5 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు బహుమానంగా ప్రకటించింది. ఈ విషయం గురించి పోలీసు శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ... ఈ కేసులో ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని తెలిపారు. రానున్న రెండు వారాల్లో పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తు ప్రారంభిస్తామని వెల్లడించారు.(చదవండి: గుండె ఆగిపోయింది.. కానీ 45 నిమిషాలకు మళ్లీ..)
ఇక పోలీసు, అత్యసర సేవా విభాగ మంత్రి డేవిడ్ ఎలియట్ స్పందిస్తూ.. ఆరేళ్ల క్రితం నాటి మెనిక అనుమానాస్పద మృతి కేసు తమను షాక్‌కు గురిచేసిందని, అత్యంత దారుణంగా ఆమెపై దారుణానికి పాల్పడిన హంతకుల గురించి తెలుసుకోవాలని ప్రజలతో పాటు తాము కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. రివార్డు ప్రకటన వల్ల విచారణాధికారులకు కొంతమేర సమాచారం దొరికే అవకాశం ఉందన్నారు. హంతకుల జాడ తెలిస్తేనే మోనిక కుటుంబం మనసులో మెదలుతున్న ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుందని చెప్పుకొచ్చారు.
తనను ఎంతగానో మిస్సవుతున్నా: డేనియల్
ఇక అత్యంత భయంకరమైన, దారుణ పరిస్థితుల్లో మోనిక మృత్యువాత పడ్డారని , ఆమెకు తప్పకుండా న్యాయం చేసి తీరతామని లివర్‌పూల్ సిటీ పోలీస్ ఏరియా కమాండర్ ఆడం వైట్ పేర్కొన్నారు. నేరస్తులు తగిన మూల్యం చెల్లించక తప్పదని, ఏదో ఒకరోజు తాము వారి తలుపు తడతామని, అందుకు సిద్దంగా ఉండాలంటూ హెచ్చరించారు. మోనిక కుమారుడు డేనియల్ చెట్టి ఆమెను గుర్తుచేసుకుని ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన తల్లి మృతికి గల కారణాల కోసం ఆరేళ్లుగా అన్వేషిస్తున్నామని, అయినా ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదని పేర్కొన్నాడు. ప్రత్యేక సందర్భాల్లో తల్లి తన పక్కన లేకపోవడం తనను వేదనకు గురిచేస్తోందని, తననెంతో మిస్సవుతున్నా అంటూ ఉద్వేగానికి గురయ్యాడు. ఈ మేరకు న్యూసౌత్ వేల్స్ పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు.