రైతు విజయం.. కరోనా కల్లోలం!
కాల గతిలో మరో ఏడాది గడిచిపోతోంది. మరో రెండ్రోజుల్లో నూతన సంవత్సరం కాలుమోపుతోంది. గతేడాది ఆరంభమైన కరోనా సంక్షోభం ఇంకా మానవాళిని వీడలేదు. ఈ ఏడాది చివరకు కొత్త వేరియంట్ కలకలం ఆరంభమైంది. 2021లో దేశీయ యవనికపై పలు ఘటనలు జరిగాయి. స్థూలంగా చెప్పుకుంటే 2021 రైతు ఆందోళనతో మొదలై సాగు చట్టాల ఉపసంహరణతో ముగిసిందనుకోవచ్చు. కరోనా, రైతు సంఘటనలతో పాటు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు, పెగసస్ కలవరం, డ్రగ్స్ కేసు, సరిహద్దుల్లో కదలికలు, సీడీఎస్ మృతి వంటి పలు ఇతర ఘటనలు దేశంలో సంచలనానికి కారణమయ్యాయి.
కోవిడ్ విధ్వంసం
జనవరిలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగానికి భారత్ అనుమతించింది. అదేనెల దేశీయంగా భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మార్చిలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఆరంభమైంది. ఏప్రిల్‌లో దేశీయంగా కరోనా మరణాలు 2లక్షలు దాటాయి. దేశంలో ఆక్సిజన్, ఆస్పత్రుల్లో పడకల కొరత ఆందోళనకరస్థాయికి చేరాయి. ఈనెల్లో సుమారు 69 లక్షల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మేలో సెకండ్ వేవ్ తారస్థాయికి చేరింది. కొత్త కేసులు 90 లక్షలు దాటగా, 1.2 లక్షల మరణాలు నమోదయ్యాయి. కోర్టులు కల్పించుకొనే స్థాయికి ఆక్సిజన్ కొరత చేరింది. అక్టోబర్‌లో 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల రికార్డును భారత్ సాధించింది. డిసెంబర్ 29నాటికి దేశీయంగా 143.75 కోట్ల టీకా డోసులు ప్రజలకు అందించారు. డిసెంబర్లో భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఆరంభమైంది.
మమత హ్యాట్రిక్
మే నెల్లో దేశంలో ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సంచలన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీఎంసీకి 213 సీట్లు, బీజేపీకి 77 సీట్లు దక్కగా వామపక్షాలు, కాంగ్రెస్‌కు ఒక్కసీటు కూడా రాలేదు. టీఎంసీ అధినేత మమత నందిగ్రామ్‌లో సువేందు అధికారి చేతిలో ఓడిపోవడం సంచలనం సృష్టించింది. అనంతరం ఆమె భవానీ పూర్ నుంచి పోటీ చేసి ఎంఎల్ఏగా గెలుపొందారు.
అస్సాంలో రెండోమారు ఎన్డీఏ కూటమి 75 సీట్లతో అధికారంలోకి రాగా, బీజేపీకి చెందిన హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. కేరళలో పాలకపక్షం వరుసగా రెండోమారు విజయం సాధించదన్న ఆనవాయితీని లెఫ్ట్ కూటమి తిరగరాసింది. 99 సీట్లతో లెఫ్ట్ కూటమి వరుసగా రెండోమారు విజయం సాధించగా, సీపీఎంకు చెందిన పినరయ్ విజయన్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. తమిళనాడులో డీఎంకేను 159 సీట్లతో విజయం వైపు నడిపిన సారధి స్టాలిన్, 68 సంవత్సరాల వయసులో తొలిసారి సీఎంగా పదవీ స్వీకారం చేశారు. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి 19 సీట్లను గెలిచి రంగస్వామి సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ముఖ్యమంత్రుల మార్పులు
జూలైలో ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామి ఎన్నికయ్యారు. కర్ణాటకలో బీజేపీ యడియూరప్పను మార్చి బసవరాజ బొమ్మైని సీఎం చేసింది. సెప్టెంబర్‌లో గుజరాత్ సీఎం పదవి నుంచి విజయ్ రూపానీ, పంజాబ్ సీఎం పీఠం నుంచి అమరీందర్‌సింగ్ వైదొలిగారు. పంజాబ్ సీఎంగా చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ, గుజరాత్ సీఎం గా భూపేంద్ర పటేల్ బాధ్యతలు చేపట్టారు.
మిస్ యూనివర్స్
డిసెంబర్లో హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్‌గా ఎన్నికైంది. 1994(సుస్మితా సేన్), 2000(లారా దత్తా) తర్వాత విశ్వ సుందరిగా ఎంపికైన మూడో భారతీయ యువతి సంధు.
వ్యవసాయదారుల విజయం
గతేడాది ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ దినోత్సవాన రైతుల సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ ముట్టడించారు. జనవరి 12న రైతు చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వీటిపై అధ్యయనానికి ఒక కమిటీని నియమించింది. నవంబర్ 19న రైతు చట్టాలపై ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పారు. మూడు సాగు చట్టాలను ఉపసంహరిస్తామని ప్రకటించారు. అదే నెల 29న సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అనంతరం ఈ ఉపసంహరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారు. దీంతో ఏడాదికి పైగా సాగిన ఆందోళనను తాత్కాలికంగా నిలిపివేసి స్వస్థలాలకు వెళ్తున్నామని రైతులు ప్రకటించారు.
లఖింపూర్ ఖేరీ ప్రకంపనలు
అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో రైతుల ర్యాలీపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనం నడపడంతో నలుగురు రైతులు మరణించారు. అనంతరం జరిగిన హింసలో మరో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన దేశంలో తీవ్ర కలకలం సృష్టించింది.
ఆర్యన్ అరెస్టు
అక్టోబర్‌లో బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ సహా 8 మందిని నార్కొటిక్స్ బ్యూరో డ్రగ్స్ కేసులో అరెస్టు చేసింది. 22 రోజుల కస్టడీ అనంతరం ఆర్యన్‌కు బాంబే హైకోర్టు బెయిలిచ్చింది.
బిపిన్ మృతి
డిసెంబర్లో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్‌రావత్, ఆయన భార్య మధులిక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ప్రమాదంలో బతికి బయటపడ్డ వరుణ్ సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందారు.