Niharika Singh
-
సారీ, నేను ఓడిపోయాను..!
కోటా: పరీక్షల ఒత్తిడికి మరో నిండు ప్రాణం బలైంది. రాజస్తాన్‌లోని కోటాలో జేఈఈకి ప్రిపేర్ అవుతున్న నిహారిక సింగ్(18) అనే విద్యార్థిని ఉరేసుకుని తనువు చాలించింది. ‘‘మమ్మీ, పాపా! నేను జేఈఈ సాధించలేను. నేను ఓడిపోయాను. నేను మంచి కూతుర్ని కాను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. సారీ, నాకిక వేరే దారి లేదు’’ అని పేర్కొన్న సూసైడ్ నోట్ ఆమె గదిలో పోలీసులకు లభించింది. స్థానిక శివ విహార్ కాలనీలో కుటుంబంతో ఉంటున్న నిహారిక ఈ నెల 30, 31వ తేదీల్లో జేఈఈ పరీక్ష రాయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. చదువుల్లో ఒత్తిడిని తట్టుకుని, పరీక్ష రాయ లేకనే ఉరివేసుకున్నట్లు సూసైట్ నోట్‌ను బట్టి అర్థమవుతోందని వారన్నారు. ఉదయం 10 గంటలైనా నిహారిక బయటికి రాకపోవడంతో అమ్మమ్మ గది తలుపు తట్టింది. ఎంతకూ లోపలి నుంచి స్పందన లేకపోవడంతో కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా, వెంటిలేటర్‌కు వేసుకున్న ఉరికి వేలాడుతూ నిహారిక విగతజీవిగా కనిపించింది. ఈ పరిణామంతో వారు హతాశులయ్యారు. చదువులో ముందుండే నిహారిక జేఈఈ పరీక్షపై ఒత్తిడికి గురవుతోందని ఆమె కుటుంబసభ్యుడొకరు చెప్పారు. జేఈఈతోపాటు ఎక్కువ స్కోరు కోసం 12వ తరగతి పరీక్షను సైతం ఆమె రాయాల్సి ఉందన్నారు. నిహారిక తండ్రి స్థానిక బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఝలావర్ జిల్లా అకౌడాఖుర్ద్కు చెందిన ఈ కుటుంబం మూడేళ్లుగా కోటాలో ఉంటోంది. కోటాలో వారం వ్యవధిలో చోటుచేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యల్లో ఇది రెండోదని పోలీసులు పేర్కొన్నారు. నీట్‌కు ప్రిపేరవుతున్న యూపీకి చెందిన మహ్మద్ జయిద్ జనవరి 13న హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు. కోటాలో గత ఏడాది 26 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. -
నవాజుద్దీన్ తీరుకి షాకయ్యా
నవాజుద్దిన్ సిద్ధిఖీ.. ప్రస్తుతం బాలీవుడ్లో వెర్సటైల్ యాక్టర్. నవాజుద్దిన్ సినిమా ఓకే చేశాడంటే ఆ సినిమాలో ఎదో స్పెషాలిటీ ఉన్నట్టే అనే పేరు తెచ్చుకున్నారు. ఇటీవలే రచయిత ‘మంటో’ పాత్ర పోషించి చప్పట్లు కొట్టించుకున్నారు. తాజాగా ఈ నటుడిపై వేధింపుల ఆరోపణలు చేశారు మాజీ మిస్ ఇండియా నిహారికా సింగ్. ఆల్రెడీ నవాజుద్దిన్ సిద్ధిఖీ తన ఆటోబయోగ్రఫీ ‘యాన్ ఆర్డినరీ లైఫ్’ లో నిహారికా సింగ్‌తో ఉన్న సంబంధం గురించి రాసుకొచ్చారు. ఇంకా మరో ఇద్దరు ముగ్గురి గురించి కూడా ఈ పుస్తకంలో ఆయన ప్రస్తావించారు. దాంతో మా అనుమతి లేకుండా పుస్తకంలో మా గురించి రాశారని సంబంధిత వ్యక్తులు పేర్కొనడంతో అప్పటికే స్టాల్స్‌కి వెళ్లిన ఆ పుస్తకాలను పబ్లిష్ చేసిన సంస్థ వెనక్కి తెప్పించింది. ఇప్పుడు జరుగుతున్న ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా తన కథను చెప్పుకొచ్చారు నిహారికా సింగ్. చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొన్న అనుభవాలను విశ్లేషిస్తూ రాసుకొచ్చారు. అందులోని సారాంశం ఏంటంటే.. ‘‘బాలీవుడ్లో నటిగా ఎదుగుదాం అనుకున్న రోజుల్లో ‘మిస్ లవ్లీ’ అనే సినిమా అవకాశం వచ్చింది. నవాజుద్దిన్ అనే నటుణ్ణి అప్పుడే ఫస్ట్ టైమ్ కలిశాను. తను గొప్ప నటుడు అనుకోలేదు. తను నటించిన షార్ట్ ఫిల్మ్ సీడీ నాకు ఇచ్చాడు. అప్పటి నుంచి ఆయన మీద ఒకలాంటి గౌరవం ఏర్పడింది. మరుసటిరోజు నన్ను భోజనానికి ఆహ్వానించాడు. ఫిల్మీ ప్రపంచంలో ఆయనతో మాట్లాడుతుంటే చాలా నిజమైన వ్యక్తిగా తోచాడు. కొన్ని రోజుల తర్వాత షూటింగ్ నిమిత్తం మా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చానని ఆయన మెసేజ్ చేయడంతో మా ఇంటికి ఆహ్వానించాను. ఇంటికి రావడంతోనే నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. నేను షాకయ్యా. తనని వెనక్కి తోసేయాలనుకున్నా కూడా అది విఫల ప్రయత్నమే అయింది. ‘పరేశ్ రావల్, మనోజ్ బాజ్పాయిలా మిస్ ఇండియానో, హీరోయిన్నో పెళ్లి చేసుకోవాలనుంది’ అన్నాడు నవాజుద్దిన్. అప్పటికి తను ఇన్సెక్యూర్డ్గా ఉండేవాడు. తన లుక్స్, స్కిన్ కలర్, ఇంగ్లీష్ చూసి ఇండస్ట్రీ ఏమంటుందో అని బాధపడేవాడు. అందులో నుంచి బయటకు రావడానికి నేను కొంత సాయం చేశాను. మెల్లిగా అతను చెబుతున్నవన్నీ అబద్ధాలని తెలియడం మొదలైంది. కేవలం నాతోనే కాదు చాలా మంది స్త్రీలతో రిలేషన్షిప్లో ఉన్నాడనీ, ఒక అమ్మాయిని వివాహం కూడా చేసుకున్నాడని తెలుసుకున్నాను. కట్నం కోసం వేధిస్తున్నాడని వాళ్లు విడిపోయారు. నేను అతన్ని నిజాయతీగా ఉండమన్నాను. అలా ఉండేంతవరకూ నిన్ను కలవనని కూడా చెప్పాను. ఆ తర్వాత మేం నటించిన ‘మిస్ లవ్లీ’ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపిక అయింది. మళ్లీ మూడేళ్లకు అప్పుడే కలుసుకున్నాం. తను ప్రవర్తించిన తీరుకు పశ్చాత్తాపపడ్డాడు. ఆ తర్వాత ‘అన్వర్ కా అజాబ్ కిస్సా’ అనే చిత్రంలో నాకో పాత్ర రికమెండ్ చేశాడు. ఆ సమయంలో మళ్లీ నాతో కనెక్ట్ అవ్వాలని ప్రయత్నించాడు. తనతో ఉండమని బతిమాలాడు. కానీ ఫ్రెండ్‌లా అయితే ఉంటానని చెప్పాను. ఆ సినిమా రిలీజ్ కాలేదు. నేనంత గొప్ప నటి కాదని అందరితో చెప్పడం మొదలెట్టాడు. నా అవకాశాలు తగ్గాయి. మమ్మల్ని సంప్రదించకుండానే తన పుస్తకంలో తనకు నచ్చినట్టుగా మా గురించి రాసుకొచ్చాడు’’ అని పేర్కొన్నారు నిహారికా సింగ్. -
'మిస్ లవ్లీకి సెన్సార్ బోర్డు 157 కట్స్'
అంతర్జాతీయంగా ప్రశంసలందుకున్న 'మిస్ లవ్లీ' చిత్రానికి సెన్సార్ బోర్డు 157 కట్స్ ను సూచించిందని ఆ చిత్ర దర్శకుడు ఆశీమ్ అహ్లూవాలియా తెలిపారు. భారత దేశంలో మిస్ లవ్లీ చిత్రాన్ని ప్రదర్శించాలంటే 157 సీన్లను తొలగించాల్సిందేనని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు ఈ చిత్రం ఏ సర్టిఫికెట్ తో విడుదలకు సిద్ధమవుతోంది. నవాజుద్దీన్ సిద్దిఖీ, నిహారికా సింగ్ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రం 2012 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అన్ సర్టెన్ రిగార్డ్ సెక్షన్ లో గట్టిపోటి ఇచ్చింది. భారతీయ సెన్సార్ బోర్డును ఒప్పించడానికి, ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏడాది కాలం పట్టింది అని అహ్లువాలియా తెలిపారు. సెన్సార్ బోర్డు నాలుగుసార్లు సమీక్షించిన తర్వాత వచ్చే సంవత్సరం జనవరి 17 తేదిన విడుదల చేసేందుకు సిద్దమయ్యాం అని అన్నారు. '157 కట్స్ అంటే సినిమాను చంపేయడమే, ఇక చిత్రాన్ని విడుదల చేయాల్సిన అవసరం లేదు' అని సోమవారం జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. సెన్సార్ బోర్బును ఒప్పించడం చాలా కష్టమైంది అని అన్నారు. అయితే మా చిత్రం పక్కా సీ గ్రేడ్ చిత్రం..కుటుంబ పరమైన భాష మాట్లాడటానికి అవకాశమే లేదు అని అన్నారు. అయినా కొన్ని సీన్లను తొలిగించాడనికి ఒప్పుకోవడంతో ప్రేక్షకుల ముందుకు 'మిస్ లవ్లీ' వస్తోంది అని అన్నారు. ఈ చిత్ర విజయానికి ఎలాంటి ట్రిక్స్ ప్రదర్శించడం లేదు అని.. కేవలం ప్రస్తుత ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నాం అని అహ్లూవాలియా తెలిపారు.