NLP Chowdary
-
పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్టుల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం
మర్రిపాలెం (విశాఖపట్నం): పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్టుల్లో ఇంటర్న్‌షిప్‌కు అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్టు విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి చెప్పారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నేతృత్వంలో ‘పాస్‌పోర్ట్ సేవామిత్ర’గా ఇంటర్న్‌షిప్‌కు కేంద్రం అవకాశం కల్పిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 81 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, 37 ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయా ల్లో ఈ-గవర్నెన్స్ ద్వారా ఇంటర్న్‌షిప్ జరుగుతుందన్నారు. జూన్ 8న ప్రారంభమయ్యే ఇంటర్న్‌షిప్ 4-8 వారాలు కొనసాగుతుందన్నారు. డిగ్రీ చేసినవారు www.passportindia.gov.in లో పొందుపరిచిన ఫారంలో వివరాలు నమోదు చేసి, ఈ నెల 31లోగా ‘ది డెరైక్టర్(పిఎస్పి), సి.పి.వి. డివిజన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్స్ అఫైర్స్, న్యూఢిల్లీ’ చిరునామాకు పంపాలని తెలిపారు. ఉద్యోగులు, విద్యార్థులకు మినహాయింపు పాస్‌పోర్ట్ మంజూరులో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో ఉద్యోగులు, విద్యార్థులకు మినహాయింపు ఇస్తున్నట్టు చెప్పారు. ఉద్యోగులు ఎన్వోసీకి దరఖాస్తు చేసినట్టు ఫారం అనెక్సర్ ఎన్, ఎం, బి, నకలు సమర్పిస్తే దరఖాస్తు స్వీకరిస్తామన్నారు. 1989 జనవరి 26 తర్వాత పుట్టిన వారికి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చినట్టు తెలిపారు. పుట్టిన తేదీ సర్టిఫికెట్, పది లేదా తత్సమాన విద్యార్హత సర్టిఫికెట్, ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ జారీచేసిన ధ్రువీకరణ పత్రం లేదా కోర్టు ద్వారా జారీ అయిన ధ్రువపత్రం.. వీటిలో ఏ ఒక్కటున్నా మినహాయింపు వర్తిస్తుందన్నారు. ఏపీలో తొలిసారిగా ఓ హిజ్రాకు పాస్‌పోర్ట్ ఇచ్చినట్లు చౌదరి చెప్పారు. -
విశాఖ కేంద్రంగా ఏపీలో పాస్‌పోర్ట్ సేవలు
మర్రిపాలెం(విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ కేంద్రంగా పాస్‌పోర్ట్ సేవలు ఉంటాయని పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విశాఖతో పాటు విజయవాడ, తిరుపతి కేంద్రాలలో ప్రజలు సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల ప్రజలు తిరుపతి కేంద్రంలో, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు విజయవాడ కేంద్రంలో, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల ప్రజలు విశాఖ కేంద్రంలో పాస్‌పోర్ట్ సేవలు అందుకోవచ్చని వివరించారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు విజయవాడ కేంద్రంలో ప్రత్యేక కౌంటర్లతో సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో అధికారులు విశాఖలో పాస్‌పోర్ట్ సేవలు అన్నట్లు చేసిన ప్రకటన అపోహలకు దారి తీసిందన్నారు. ఇప్పటి వరకూ హైదరాబాద్ కేంద్రంగా సేవలు అందుతోన్న రాయలసీమ జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను విశాఖ కేంద్రానికి అనుసంధానం చేసినట్టు తెలిపారు. ఆయా జిల్లాల ప్రజలకు ఎప్పటి మాదిరిగానే విజయవాడ, తిరుపతిలలో పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. విశాఖలో పాస్‌పోర్ట్ కార్యాలయం ‘పాస్‌పోర్ట్ సేవ ఎట్ యువర్ డోర్ స్టెప్’గా పనిచేస్తుందన్నారు. -
‘మీ-సేవ’లో పాస్‌పోర్ట్ సేవలు
విశాఖపట్నం: ఇకనుంచి పాస్‌పోర్ట్ సేవల్ని ‘మీ సేవ’ కేంద్రాల్లో పొందవచ్చని పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి చెప్పారు. ఇందుకోసం ముందుగా మీ సేవ కేంద్రాల ప్రతినిధులకు శిక్షణ ఇస్తామన్నారు. విశాఖపట్నంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో శనివారం మీ సేవ కేంద్రాల ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్యాంకులో ఖాతా తెరవడంతో పోలిస్తే పాస్‌పోర్ట్ పొందడం సులభమని చెప్పారు. పాస్‌పోర్ట్ సేవలు ప్రజలకు మరింత దగ్గరగా చేర్చడానికి మీ సేవలకు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలిపారు. దళారీల నియంత్రణకు సేవలు విస్తృతం చేస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా 1.37 లక్షల మీ సేవ కేంద్రాలుండగా రాష్ట్రంలో 3,600 కేంద్రాలున్నాయని తెలిపారు. మీ సేవలో రూ.100 చెల్లించి పాస్‌పోర్ట్ సేవలు పొందవచ్చని, దరఖాస్తు పూర్తిచేయడం, అప్లోడ్, ఫీజు చెల్లించడంతో స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని చెప్పారు. త్వరలో పోస్టాఫీసుల్లో కూడా పాస్‌పోర్టు సేవలు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.