ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ కేంద్రంగా పాస్‌పోర్ట్ సేవలు ఉంటాయని పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి ప్రకటించారు.
మర్రిపాలెం(విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ కేంద్రంగా పాస్‌పోర్ట్ సేవలు ఉంటాయని పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విశాఖతో పాటు విజయవాడ, తిరుపతి కేంద్రాలలో ప్రజలు సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల ప్రజలు తిరుపతి కేంద్రంలో, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు విజయవాడ కేంద్రంలో, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల ప్రజలు విశాఖ కేంద్రంలో పాస్‌పోర్ట్ సేవలు అందుకోవచ్చని వివరించారు.
ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు విజయవాడ కేంద్రంలో ప్రత్యేక కౌంటర్లతో సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో అధికారులు విశాఖలో పాస్‌పోర్ట్ సేవలు అన్నట్లు చేసిన ప్రకటన అపోహలకు దారి తీసిందన్నారు. ఇప్పటి వరకూ హైదరాబాద్ కేంద్రంగా సేవలు అందుతోన్న రాయలసీమ జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను విశాఖ కేంద్రానికి అనుసంధానం చేసినట్టు తెలిపారు. ఆయా జిల్లాల ప్రజలకు ఎప్పటి మాదిరిగానే విజయవాడ, తిరుపతిలలో పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. విశాఖలో పాస్‌పోర్ట్ కార్యాలయం ‘పాస్‌పోర్ట్ సేవ ఎట్ యువర్ డోర్ స్టెప్’గా పనిచేస్తుందన్నారు.