
సాక్షి, అమరావతి: డిజి లాకర్ సౌకర్యాన్ని కేంద్ర విదేశాంగ శాఖ పాస్‌పోర్ట్‌కు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. పాస్‌పోర్టు దరఖాస్తుదారులు డిజి లాకర్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకొని.. తమకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను అందులో దాచుకోవచ్చు. దీని వల్ల పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లేటప్పుడు సర్టిఫికెట్లను వెంట తీసుకువెళ్లే శ్రమ తప్పుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని.. నేరుగా పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లి డిజి లాకర్ ఉందని చెబితే చాలు.. డాక్యుమెంట్లను వాళ్లే వెరిఫై చేస్తారు. ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలోనే డిజి లాకర్ ఆప్షన్ కావాలా? అని అడుగుతుంది. అవసరమని జవాబిస్తే.. మీకు మంజూరయ్యే పాస్‌పోర్ట్ ఒరిజినల్ సైతం డిజి లాకర్‌లో ఉంచుతారు. దీని వల్ల మన పాస్‌పోర్ట్ ఎక్కడైనా పోతుందేమోననే భయం వదిలిపెట్టవచ్చు.
డిజి లాకర్ అంటే..
డిజి లాకర్ అంటే డిజిటల్ లాకర్ అని అర్థం. ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. విలువైన డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లే అవసరం లేకుండా.. కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తూ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీనికి చేయాల్సిందల్లా http://digilocker.gov.in అనే వెబ్‌సైట్‌కు వెళ్లి అకౌంట్ నమోదు చేసుకోవాలి. అనంతరం మన డాక్యుమెంట్లను అందులో నిక్షిప్తం చేసుకోవచ్చు. వాటిని అవసరమైనప్పుడల్లా ఉపయోగించుకోవచ్చు.
గెజిటెడ్ అటెస్టేషన్ కూడా అక్కర్లేదు..
డిజి లాకర్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఎవరూ డాక్యుమెంట్లు తీసుకురానవసరం లేదు. గెజిటెడ్ అటెస్టేషన్ అక్కర్లేదు. వారం రోజులుగా దీనిపై ట్రయల్ రన్ నిర్వహించాం. పాస్‌పోర్ట్‌ను కూడా డిజిలాకర్‌లోదాచుకోవచ్చు.
–శ్రీనివాసరావు, ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment