No Due Certificate
-
నో డ్యూ ఉంటేనే రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ధరణి పోర్టల్ ద్వారా సబ్ రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ముందు తప్పనిసరిగా సంబంధిత మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) నుంచి ‘నో డ్యూ’సర్టిఫికెట్ పొందాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొ చ్చింది. రిజిస్ట్రేషన్ దస్తావేజు ద్వారా వ్యవసాయేతర ఆస్తి యాజమాన్య హక్కుల బదిలీ చేయాలని కోరుకున్నా, విక్రయం, కానుక, తనఖా, బదిలీ చేయాలనుకున్నా ఈ నిబంధన వర్తి స్తుందని స్పష్టం చేసింది. దరఖాస్తు దారుడు తన వీలును బట్టి అందు బాటులో ఉన్న తేదీ, సమయం కోసం ధరణి పోర్టల్ ద్వారా సబ్ రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆస్తి పన్నులు, ఇతర బకాయిలేవీ లేవని మున్సిపాలిటీ/కార్పొరేషన్ నుంచి, విద్యుత్ బిల్లుల బకాయిలు ఏవీ లేవని డిస్కంల నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకున్న 4 రోజుల్లోగా పురపాలికలు, డిస్కంలు నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వడంలో విఫలమైతే.. జారీ చేసినట్లే పరిగణిస్తారు. ధరణి పోర్టల్ ద్వారా మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్లలో వ్యవసాయేతర ఆస్తుల మ్యూటేషన్ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు–2020ను ప్రకటిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు.. ► వ్యవసాయేతర ఆస్తుల విక్రయం, తనఖా, గిఫ్టు, మార్పిడి (ఎక్స్చేంజ్)కి జరిపే రిజిస్ట్రేషన్, హక్కుల రికార్డు(రికార్డ్స్ ఆఫ్ రైట్స్)ల్లో యాజమాన్య మార్పుల ప్రక్రియ చేపట్టాలి. ► రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి సబ్ రిజిస్ట్రార్ తేదీ, సమయం కేటాయించి, ఈ వివరాలను అతడికి తెలపాలి. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్దేశిత నమూనాలో రిజిస్టర్లో పొందుపర్చాలి. ► దస్తావేజు రిజిస్ట్రేషన్ రోజు సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ నిర్వహించి, నిర్దేశిత మ్యుటేషన్ చార్జీలు తీసుకున్న తర్వాత ఈ మేరకు సంబంధిత మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన హక్కుల రిజిస్టర్లో తక్షణమే యాజమాన్య హక్కులు మార్పు చేయాలి. విక్రయం, గిఫ్టు, ఎక్స్చేంజీ ద్వారా ఆస్తి బదిలీ చేస్తున్న వ్యక్తి ఖాతా నుంచి ఆస్తిని తొలగించి, బదిలీ చేయించుకున్న వ్యక్తి ఖాతాలో జమ చేయడం ద్వారా తక్షణ మ్యుటేషన్ పూర్తి చేయాలి. ► తనఖా అయితే, ధరణిలో తనఖా లావాదేవీ వివరాలను రికార్డు చేయాలి. ► ఆస్తి రిజిస్ట్రేషన్‌లో భాగంగానే మ్యుటేషన్ జరగాలి. హక్కుల రికార్డుల్లోని వివరాలు.. ► మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని వ్యవసాయేతర ఆస్తులపై హక్కుల రికార్డులను ధరణి పోర్టల్‌లో డిజిటల్ రూపంలో తయారు చేసి నిర్వహిస్తారు. ఈ రికార్డుల్లో ఈ వివరాలుంటాయి. ► మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్లు నిర్వహించే ఆస్తుల రిజిస్టర్ ప్రకారం ఆస్తి యజమాని పేరు, సదరు ఆస్తిపై వారసత్వం కలిగిన కుటుంబ సభ్యుల పేర్లు. ► ప్రాంతం (లొకేషన్) వివరాలు, రకం, వినియోగం, విస్తీర్ణం ► ఆస్తి యజమాని, కుటుంబసభ్యుల గుర్తింపును రుజువు చేసేందుకు అవసరమైన ఇతర వివరాలు. ► ప్రతి మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ తన అధీనంలోని వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నిర్దేశిత ఫార్మాట్లో ధరణి పోర్టల్‌లో పొందుపర్చాలి. ఇందుకు ఒకేసారి అవకాశం ఉంటుంది. ► ప్రతి మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసే ప్రతి భవన నిర్మాణ అనుమతి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, లేఅవుట్, ప్లాట్ల అనుమతులను నిర్దేశిత ఫార్మాట్లో ధరణి పోర్టల్‌లో పొందుపర్చాలి. ప్రభుత్వ ఆస్తులకు వర్తించదు... ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన లేదా వీటి నియంత్రణ పరిధిలో ఉన్న వ్యవసాయేతర ఆస్తులకు ఈ నిబంధనలు వర్తించవు. -
ఇదేమి సహకారమో..!
సాక్షి, సైదాపూర్(హుజూరాబాద్) : సహకార సంఘంలో అప్పులు తీసుకోకున్నా, అప్పులు తీసుకున్నట్లు డిమాండ్ నోటీసులు ఇచ్చి ఆయా కుటుంబాల్లో చిచ్చు పెట్టిన సంఘటన సైదాపూర్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గొడిశాలకు చెందిన పిన్నింటి రాంరెడ్డికి సంఘంలో అప్పు లేకున్నా రూ.77,500 అసలు అప్పు, దానికి మిత్తి కింద రూ.4,140 చెల్లించాలని సంఘం పేరున డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. బాధిత రైతు విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాంరెడ్డి సహకార సంఘంలో 2001లో లాంగ్‌టర్మ్ రుణం తీసుకున్నాడు. ఆ రుణం మొత్తం 2003 డిసెంబర్ 31న పూర్తిగా చెల్లించాడు. పిల్లల చదువు కోసం కరీంనగర్ వచ్చి, రెడ్డి మార్బుల్ షాపులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లల చదువు కోసం కరీంనగర్లో ఓ బ్యాంకులో స్టడీ లోన్‌కు దరఖాస్తులు చేసుకున్నాడు. స్వగ్రామంలో ఇతర బ్యాంకుల్లో అప్పులేనట్లు నోడ్యూస్ సర్టిఫికెట్ అడగడంతో సైదాపూర్‌లోని కేడీసీసీ, వైశ్యాబాంకుల్లో నోడ్యూస్ సర్టిఫికేట్లు తీసుకున్నాడు. ఇలా ఉండగా ఈనెల 27న రాంరెడ్డి పేరున గొడిశాలలో ఓ బెల్టుషాపులో నోటీస్ ఇచ్చారు. ఈ విషయం రాంరెడ్డి ఇంట్లో తెలిసింది. బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఏం చేశావని ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ ముదిరింది. దీంతో గొడిశాలకు వచ్చిన రాంరెడ్డి నోటీసులు తీసుకోని సహకారం సంఘంలో కలిశాడు. పాత బాకీ కట్టిన రశీదులు, నో డ్యూస్ పత్రం కూడా చూపించాడు. అప్పు లేకుంటే నోటీసులు ఎందుకు ఇస్తాం. రికార్డులు చూడాలి. అని సీఈవో బిక్షపతి బదులిచ్చాడు. అప్పు లేకున్నా, అప్పు ఉన్నట్లు నోటీసులు ఇచ్చి సహకార సంఘం అధికారులు పరువు తీశారని విలేకరులతో రాంరెడ్డి మొరపెట్టుకున్నారు. దీనిపై సీఈవో వివరణ కోరగా వాస్తవంగా రాంరెడ్డి పేరున అప్పు లేదు. పొరపాటున నోటీస్ వెళ్లిందని వివరణ ఇచ్చాడు. -
చేవెళ్ల ఎస్బీహెచ్ ఎదుట రైతుల ఆందోళన
చేవెళ్లరూరల్: రుణమాఫీ అంటూ రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో ‘నో డ్యూ’ సర్టిఫికెట్ ఇవ్వాలంటే కూడా డబ్బులు చెల్లించాలనే బ్యాంకు నిబంధనలతో అవాక్కయిన రైతులు బుధవారం చేవెళ్ల ఎస్బీహెచ్ ఎదుట ఆందోళన చేశారు. చేవెళ్లలోని ఎస్బీహెచ్ వద్దకు షాబాద్ మండలంలోని పలు గ్రామాల రైతులు ‘నో డ్యూ’ సర్టిఫికెట్ కోసం వచ్చారు. ప్రభుత్వం రుణమాఫీ, రీషెడ్యూల్ అమలు చేస్తుండటంతో మళ్లీ రుణాలు తీసుకునే రైతులకు ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకోలేదని నోడ్యూ సర్టిఫికెట్ తీసుకు రావాలని రుణాలు ఇచ్చే బ్యాంకులు ఆదేశిస్తున్నాయి. కాగా షాబాద్ మండలంలోని బ్యాంకులు, చేవెళ్ల బ్యాంకుల్లో కూడా ఈ నోడ్యూ సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్పారు. రైతులు రుణాలు త్వరగా వస్తాయనే ఆశతో చేవెళ్ల మండల కేంద్రంలోని బ్యాంకుల వద్దకు వచ్చారు. ఇక్కడ అన్ని బ్యాంకుల వారు రైతుల వివారాలను తెలుసుకొని వారికి సంతకాలు చేసి పంపించారు. సంతకం చేయాలంటే బ్యాంకు నిబంధనల ప్రకారం రూ.110 చెల్లిస్తే ఇస్తామని బ్యాంకు మేనేజర్ కిరణ్మయి చెప్పారు. కొంతమంది రైతులు చెల్లించారు. మరికొంత మంది రైతులు ఇదేంటని నిలదీశారు. ఇప్పటివరకు అన్ని బ్యాంకులకు తిరిగినా ఏ బ్యాంకు అధికారులూ డబ్బులు అడగలేదని, మీరు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. దానికి నిబంధనల ప్రకారమే డబ్బులు అడుగుతున్నామని మేనేజర్ చెప్పారు. దీంతో రైతులు ఆగ్రహించి రుణమాఫీ పేరుతో ఇలా రైతులకు బ్యాంకుల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేయటం బాగాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.