పర్సంటైల్.. ఎంతో మేలు
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : జేఈఈ మెయిన్స్, ఇంటర్ మార్కుల ఆధారంగా లెక్కించే పర్సంటైల్ విధానం మన విద్యార్థులకు మేలు చేస్తుందనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. జేఈఈ మెయిన్స్ మార్కుల ఆధారంగా దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఎన్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం లభించనుంది. ఈ కళాశాలల్లో ప్రవేశం పొందడానికి జేఈఈ మార్కులతోపాటు ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కులూ కీలకం కానున్నాయి. జేఈఈలో సాధించిన మార్కులతోపాటు ఇంటర్లో సాధించిన మార్కులను కలిపి లెక్కించగా వచ్చినర్యాంక్ను పర్సంైటైల్ అంటారు. ఈ ర్యాంకు ఆధారంగా దేశంలోని ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీకి అనుబంధంగా ఉన్న డీమ్డ్ యూనివర్సిటీల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.
పర్సంటైల్ లెక్కింపుపై గతేడాది వివాదాలు తలెత్తాయి. జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకులను నిర్ణయించేందుకు రెండు విభాగాలుగా చేసి, అందులో వచ్చిన మార్కుల ఆధారంగా పర్సంటైల్, నార్మలైజేషన్ పద్ధతుల ద్వారా ర్యాంకులు కేటాయిస్తారు. ఒక విద్యార్థికి జేఈఈ మెయిన్స్ పరీక్షలో వచ్చిన మార్కులకు 60 శాతం వెయిటేజీ, అదే విద్యార్థికి ఇంటర్లో వచ్చిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇస్తారు. ఈ రెండింటిని కలిపి నార్మలైజ్డ్ పర్సంటైల్ పద్ధతి ద్వారా ర్యాంకు కేటాయిస్తారు. గతేడాది ప్రవేశాల సమయంలో పర్సంటైల్ పద్ధతితో వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ సారి కూడా ఈ విధానంపై విద్యార్థుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి.