ఎస్సీలను వర్గీకరించవద్దు
కేంద్ర మంత్రి గెహ్లాట్, ఏచూరిలకు మాల మహానాడు వినతి
న్యూఢిల్లీ: ఉషా మెహ్రా కమిషన్ నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మాలల కంటే మాదిగలే ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ వద్దని కోరుతూ కేంద్ర సామాజిక, న్యాయశాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలకు వినతిపత్రాలు సమర్పించారు. సుప్రీంకోర్టు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ల తీర్పులను గౌరవించి వర్గీకరణకు సహకరించవద్దని వారిని కోరారు.
మనువాదులతో కుమ్మకై దళితులను చీల్చే కుట్ర: రామూర్తి
ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ మనువాదులతో కుమ్మకై దళితులను చీల్చే కుట్ర పన్నుతున్నారని తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు పసుల రామూర్తి విమర్శించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మం తర్ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. అగ్రవర్ణ నాయకులకు దళితులపై చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగం ద్వారా వచ్చే ఫలాలను వారికి అందేలా చూడాలని కోరారు.