not implemented
-
బాబు మాటలు..నీటి మూటలు
ఎన్నికల ముందు గద్దెనెక్కేందుకు నోటికొచ్చిన హామీలు గుప్పించి..జన వంచనతో అధికార పీఠమెక్కిన సీఎం చంద్రబాబు ఐదేళ్లపాటు ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఇచ్చిన హామీల అమలుకు జిల్లా టీడీపీ నేతలు ఎవరూ కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఫలితంగా బాబు మాటలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయి జిల్లా ప్రగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. గారడి బాబు మళ్లీ అవే హామీలతో ఓట్లు అడుగుతూ జనం ముందుకొచ్చారు. సాక్షి, ఒంగోలు సిటీ: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాటకే విలువ లేకుండా పోయింది. ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కాలేదు. ఇచ్చిన తర్వాత నుంచి పట్టించుకున్న దాఖలాలు లేవు. సీఎం హామీలు నీటిమూటలయ్యాయి. జిల్లా అధికారులు పదేపదే లేఖలు రాశారు. వివిధ సందర్భాల్లో నివేదికలను పంపారు. అయినా చలనం లేదు. నీటిపారుదల ప్రాజెక్టులు, ఉన్నత విద్యా రంగం, గనులు, వ్యవసాయం, మౌలిక సదుపాయల కల్పన సంస్థ, గృహ నిర్మాణం వంటి విభాగాల పరిధిలో రకరకాల హామీలు ఇచ్చారు. ఐదేళ్లు కాలం ఇట్టే గడిచి పోయింది. అయినా పురోగతి అడుగు ముందుకు వేయలేదు. సీఎం ఇచ్చిన హామీలను వివిధ సందర్భాల్లో జరిగిన బహిరంగ సభలు, సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు వల్లె వేశారు. ఐదేళ్లు ఇదే తంతు. ఎన్నికలు రానే వచ్చాయి. సీఎం హామీలు మాత్రం నీటి మూటలయ్యాయి. వెలిగొండ నుంచి నీళ్లిస్తామన్నారు వెలిగొండ ప్రాజెక్టు పనులు సంక్రాంతికి పూర్తి చేసి నీళ్లిస్తామన్నారు. సొరంగం పనులకు మళ్లీ మళ్లీ టెండర్లు పిలిచి, అంచనా వ్యయాలను పెంచుకున్నారే గానీ పనులను పూర్తి చేసిన పరిస్థితి లేదు. వెలిగొండ సొరంగం–1 పనులను తొలుత 2018 జూన్ నాటికి, మొత్తం ప్రాజెక్టు పని 2019 జనవరి నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు వ్యయం రూ.5,150 కోట్లు కాగా పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. తాజాగా సొరంగాల ప్రారంభంలోని హెడ్ రెగ్యులేటరీ పనులు సెప్టెంబర్ నాటికి, సొరంగం–1 పనులను మే నాటికి, సొరంగం–2 పనులను డిసెంబర్ ఆఖరి నాటికి పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించారు. ఇప్పటి వరకు రూ.1,525.27 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టు సొరంగం పనుల వద్ద డిజైన్ కూడా మార్చారు. అదనంగా మరో రూ.వెయ్యి కోట్లు అంచనాలను పెంచినా పనులు ఇంకా పూర్తి కాలేదు. రాళ్లపాడు పరిధిలో తాగునీటి పనులు అంతే సీఎం చంద్రబాబు ఐదో విడత జన్మభూమిలో జీకేఎన్ కాలువ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సుమారు 600 మీటర్లు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులను పూర్తి చేసి నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు నుంచి రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరు తీసుకోవడానికి ప్రణాళికను సీఎం ప్రస్తావించారు. సోమశిల నార్త్ ఫీడర్ చానల్ చింతలదీవి దగ్గర నుంచి 0.5 టీఎంసీల నీటిని రాళ్లపాడుకు తీసుకోవాల్సి ఉంది. 2018 అక్టోబర్ నాటికి ఈ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇంత వరకు పనులు పూర్తి కాలేదు. ఈ వేసవికి ముందే రాళ్లపాడు పరిధిలోని గ్రామాలకు తాగునీటి సమస్య నెలకొంది. ట్రిపుల్ ఐటీ ఎక్కడ ? జిల్లాకు ట్రిపుల్ ఐటీ కలగానే మిగిలింది. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఒంగోలులో ట్రిపుల్ఐటీ రావాలి. జీవో కూడా ఇచ్చారు. ఒంగోలులో ట్రిపుల్ ఐటీకి సరిపడా స్థలం ఇవ్వలేకపోయారు. అధికారులు కొన్ని స్థలాలకు అడ్వాన్సు పొజిషన్ కూడా ఇచ్చారు. అవి కూడా లిటిగేషన్లలో పడ్డాయి. కందుకూరులో ప్రతిపాదించారు. అక్కడా కుదరలేదు. దీంతో కనిగిరి, పామూరులో 210 ఎకరాలను కేటాయించారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.500 కోట్లు నిధులు కావాలి. ప్రభుత్వం అదిగో ఇదిగో అంటుందే తప్ప నిధులు ఇవ్వలేదు. ఒంగోలు ట్రిపుల్ ఐటీని ఇడుపులపాయలో నిర్వహిస్తున్నారు. ఒంగోలు మంగమూరురోడ్డులో పరిపాలనా భవనం ఏర్పాటు చేశారు. వీసీని నియమించారు. ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు జరిగి ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలోనే అదనంగా ఉన్న కొన్ని తరగతి గదుల్లో అరకొర వసతులతో నిర్వహిస్తున్నారు. ఇప్పటికి నాలుగు బ్యాచ్‌లు పూర్తయ్యాయి. నాలుగు వేల మంది ఒంగోలు ట్రిపుల్ ఐటీ కింద ఉన్నారు. రూ.500 కోట్లకు గాను కేటాయించింది కేవలం రూ.2 కోట్లే. ట్రిపుల్ ఐటీ విషయంలోనూ సీఎం హామీ నెరవేరకుండానే ఎన్నికలు వచ్చేశాయి. ఎన్ఎస్పీ కాలువల ఆధునికీకరణ నీటిమూటే.. నాగార్జున సాగర్ కాలువల పరిస్థితి దయనీయంగా తయారైంది. చంద్రబాబు కాలువల ఆధునికీకరణకు నిధులు ఇస్తామన్నారు. రూ.150 కోట్లు కేటాయిస్తామన్నారు. ఆధునికీకరణ పనులకు నిధులు ఇచ్చింది లేదు. పనులు జరగనందున సుమారు 1.5 లక్షల ఎకరాల గ్యాప్ ఆయకట్టు పెరిగింది. ప్రపంచ బ్యాంకు ఆధునికీకరణ పనుల కోసం రూ.820 కోట్లు కేటాయించింది. ఇందు కోసం 73 ప్యాకేజీలను రూపొందించారు. గత ఏడాది జూలై నాటికి ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు పూర్తయింది. ప్రతిపాదించిన ప్యాకేజీల్లో 12 ప్యాకేజీలను పూర్తి చేశారు. ఆ తర్వాత సీఎం రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఇచ్చి పనులు పూర్తి చేస్తామన్నారు. ఇంత వరకు ఆధునికీకరణ పనులు పూర్తవలేదు. ఊసే లేని మైనింగ్ విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గెలాక్సీ గ్రానైట్‌తో పాటు మైనింగ్ ద్వారా ఆదాయం బాగున్నందున జిల్లాలో చీమకుర్తి కేంద్రంగా మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఈ హామీ నీటి మూటైంది. జిల్లాలో ఐరన్ ఓర్, గ్రానైట్, మైకాహెమటైట్, బ్లాక్ గెలాక్సీ, కలర్ గ్రానైట్, గ్రావెల్, రోడ్డు మెటల్, పలకలు, మార్బుల్, సిలికా, క్వార్జ్, పలుగురాయి తదితర ఖనిజాలు ఉన్నాయి. వీటికి గాను 531 లీజులు ఉన్నాయి. 1120 మినరల్ బేస్ యూనిట్లు ఉన్నాయి. 50 వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఏటా రూ.318 కోట్లకు తగ్గకుండా ఆదాయం వస్తుంది. ఇక్కడ మైనింగ్ విశ్వవిద్యాలయం వస్తే అభివృద్ధి సాధ్యపడుతుందని, చీమకుర్తి బాగా ప్రగతి సాధిస్తుందని భావించినా ఆశ నెరవేరలేదు. అరుంధతి నక్షత్రంలాగే దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ దొనకొండ పారిశ్రామికవాడ గురించి తెలుగుదేశం నాయకులు జిల్లా దశదిశలా ప్రచారం చేశారు. ఇంత వరకు దొనకొండ పారిశ్రామికవాడ ఊసే లేదు. 50 వేల ఎకరాల్లో పారిశ్రామికవాడ నిర్మించడానికి సీఎం హామీ ఇచ్చారు. మంత్రి శిద్దా రాఘవరావు.. సీఎం చంద్రబాబు నాయుడు కన్నా అధికంగా దొనకొండ గురించి ప్రచారం చేశారు. అరుంధతి నక్షత్రం చూపించిన చందంగానే దొనకొండ కారిడార్ నెలకొందన్న విమర్శలున్నాయి. 23 గ్రామాల్లో 25,886 ఎకరాలను భూసేకరణ చేయడానికి గుర్తించారు. కానీ దొనకొండ కారిడార్ మాత్రం రాలేదు. రూ.9070 కోట్లతో పారిశ్రామికవాడ అంచనాలు ఉన్నాయి. 2020 నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలి. కానీ మౌలిక వసతులు పూర్తికాలేదు. అసలు ప్రాజెక్టు వస్తుందో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి. ఎన్నెన్నో హామీలు..నెరవేరితే ఒట్టు గత ఎన్నికల్లో తెలుగుదేశం ఇచ్చిన హామీల్లో మూడొంతులకు పైగా నెరవేర్చింది లేదు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హామీల మీద హామీలు ఇచ్చారు. ఎన్నెన్నో హామీలు జిల్లా అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలాయి. రామాయపట్నం ఓడరేవు హామీకి బదులుగా అతి చిన్న పోర్టుకు శంకుస్ధాపన చేసి మమ అనిపించారు. వివిధ సందర్భాల్లో ఇచ్చిన 23 హామీలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి ఊసే లేదు. -
శుభ్రతపై నిర్లక్ష్యమేల?
ధన్వాడ: వ్యక్తిగత పరిశుభ్రతను పెంచి విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత కల్పించడానికి ప్రభుత్వ పాఠశాలలో వాస్ (వాటర్ శానిటేషన్ హైజిన్) పథకాన్ని ప్రవేశ పెట్టినా అది చాలా పాఠశాలలో అమలు కావడం లేదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చాలా సమస్యలు వెంటాడుతాయి. ఇలాంటి వాటిని దూరం చేయడానికి విద్యార్థి దశ నుంచే జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదని భావించిన ప్రభుత్వం పాఠశాలలో వాస్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలనే నిబంధనలున్నాయి. ఇందుకు అవసరమైన సబ్బులను ఆయా పాఠశాలల నిధుల నుంచి కొనుగోలు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని ఆదేశాలు జారీ చేసినా చాలా పాఠశాలలో అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కిన పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన పర్యవేక్షకులు సైతం ఉదాసీనత చూపుతుండడంతో ఈ పథకం అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఉపాధ్యాయుల బాధ్యత.. ఉపాధ్యాయులకు ప్రతీ నెల నిర్వహిస్తున్న సముదాయ సమావేశాల్లో సూచనలు, సలహాలు ఇచ్చి వాస్ పథకాన్ని అమలు చేయాల్సిన బాధ్యతలను అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులకు దీనిపై పూర్తి అవగహన కల్పించి వారు అనారోగ్య బారిన పడకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. వారికి అందుబాటులో సబ్బులు ఏర్పాటు చేయాలి. మధ్యాహ్న భోజనం చేసే ముందు చేతులు పేట్టలను సబ్బులతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించాలి. భోజనం సమయంలో పరిశుభ్రతకు సబ్బులను ఏర్పాటు చేయడానికి ఇతర ఖర్చులకు రాజీవ్ విద్యా మిషన్ నుంచి ప్రాథమిక పాఠశాలలకు ఏడాదికి రూ. 10వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.15వేలు సమకూరుస్తుంది. నిరాశే మిగిలింది.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వాస్ పథకం కొంతవరకైనా మార్పు తెస్తోందని ఆశించిన ఉన్నతాధికారులకు నిరాశే మిగిలింది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లిందే మొదలు మధ్యాహ్న భోజనం చేసే వరకు మట్టితో సంబంధాలు ఉన్నా వాటినే వాడుతుంటారు. చాలా పాఠశాలలో బెంచీలు లేక నేలపైనే కూర్చుని విద్యాభ్యాసం చేస్తున్నారు. దీంతో పాటు విద్యార్థులు మల, మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. చాలా పాఠశాలల్లో నీటి కొరత కారణంగా వీటికి దూరమవుతున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో హడావుడిగా చేతుల పరిశుభ్రతను పెద్దగా పట్టించుకోవడంలేదు. ధన్వాడ మండలంలో మొత్తం 48 పాఠశాలలు ఉండగా ఇందులో 6500 విద్యార్థులు చదువుకుంటున్నారు. అమలుపై దృష్టి సారిస్తాం ప్రభుత్వ పాఠశాలలో ‘వాస్’ పథకం అమలవుతుంది. దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తాం. ప్రతి సమావేశంలో ఉపాధ్యాయులకు వాస్‌పై సూచనలు అందిస్తున్నాం – సంగీత, ఎంఈఓ, ధన్వాడ -
నాలుగు వారాల్లోగా సమాధానమివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: కోర్టు తీర్పును ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదంటూ సుప్రీం కోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. పదవీ విరమణ పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కార్పొరేషన్ సంస్థలు, సొసైటీలు, గిరిజన, సాంఘిక, గురుకుల విద్యా సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వయోపరిమితి పెంపును అమలు చేయలేదని ఆయా సంస్థలకు చెందిన ఉద్యోగులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆగస్టు 9న ఉద్యోగులకు అనుకూల తీర్పును ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 58 ఏళ్లకే పదవీ విరమణ పొంది ఉండి ఇంకా పదవీ విరమణ వయస్సు దాటనిపక్షంలో వారిని ఉద్యోగంలో కొనసాగనివ్వాలని, పదవీ విరమణ వయస్సు దాటిన పక్షంలో వారు ఉద్యోగం నుంచి వైదొలగిన సమయం నుంచి 60 ఏళ్ల వయస్సు వచ్చిన నాటికి గల కాలానికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని ధర్మాసనం పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వులను అమలు చేయలేదని, అమలుకు షరతులు పెడుతున్నదని పేర్కొంటూ విద్యుత్ సంస్థల ఉద్యోగులు ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలంటూ ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కోలకు జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసు జారీ చేసింది. -
‘వెలుగుల’ పథకం..నిలువెల్లా మసకే
సాక్షి,రాజమండ్రి : నెలకు 50 యూనిట్ల లోపు విద్యుత్తును వాడే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఆ విద్యుత్ ‘ఉచితం’ అని గత ఏడాది మార్చిలో ప్రభుత్వం ఇచ్చిన వరం నేటికీ సాకారం కాలేదు. ఆ వర్గాల్లో పేదలకు మేలు కోసం అన్న ఈ పథకం విధి విధానాలు నేటికీ ఓ కొలిక్కి రాలేదు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి ఈ పథకం నిదర్శనంగా నిలుస్తోంది. సర్కారు మీద నమ్మకంతో ఆ వర్గాల్లో అర్హులైన పేదల బిల్లులు వసూలు చేయకూడదన్న నిర్ణయం ఈపీడీసీఎల్‌కు కూడా బొప్పికట్టేలా చేసింది. ప్రస్తుతం ఈ పథకం అసలైన లబ్ధిదారుల ఎంపిక అనే దశలోనే మిణుకుమిణుకుమంటోంది. ఆ అసలైన లబ్ధిదారులు ఎవరో తేల్చలేక అధికారులూ అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. గత ఏడాది మార్చి నుంచి నవంబరు వరకూ జిల్లాలో సుమారు లక్షా 60 వేలమందికి పైగా ఎస్సీ లబ్ధిదారులు ఈ పథకం పరిధిలోకి వస్తున్నారు. ఈ వ్యవధిలో వారు వినియోగించిన విద్యుత్తు విలువ సుమారు రూ.2.60 కోట్లు. 58,000 మంది ఎస్టీలు పథకం పరిధిలోకి వస్తుండగా వీరు సుమారు రూ.కోటి 50 లక్షల విలువైన విద్యుత్తును ఉపయోగించారు. ఇదంతా ప్రభుత్వం భరించి విద్యుత్తు శాఖకు చెల్లించాల్సి ఉంది. మార్చి నుంచి నవంబరు వరకూ ఏనెలకానెల జాబితాలను తయారుచేసి పంపుతూనే ఉన్నా ఇప్పటివరకూ ఆ బాపతు సొమ్ము సర్కారు నుంచి తమకు చేరలేదని వాపోతున్నారు ఈపీడీసీఎల్ అధికారులు. ఇప్పుడేం జరుగుతోందంటే.. ఆయా మండలాల్లో విద్యుత్తు శాఖ సహాయ ఇంజనీర్లు రూపొందించిన అర్హులైన ఎస్సీ, ఎస్టీల జాబితాలను వారి కుల ధృవీకరణ కోసం తహశీల్దార్లకు పంపారు. తహశీల్దార్లు వీఆర్వోల సాయంతో ఇంటింటి సర్వే చేసి, వారు ఎస్సీ, ఎస్టీలు అవునో, కాదో నిర్ధారించి తిరిగి వాటిని విద్యుత్తు శాఖకు అందచేస్తే వాటిని ప్రభుత్వ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. అప్పుడే ఈ నిధులు విడుదలవుతాయి. విధి విధానాలను నిర్దేశించకుండా ముఖ్యమంత్రి ప్రకటించిన ఈ పథకంలో ముందుగా లబ్ధిదారుల ఎంపికే నెలనెలా ఓ ప్రహసనంగా మారుతోంది. ఈపీడీసీఎల్ రీడింగుల ప్రకారం అప్పటి నుంచి ఇప్పటివరకూ 50 యూనిట్ల లోపు వినియోగిస్తున్న వారిని ప్రాథమికంగా గుర్తించి బిల్లుల వసూలు విరమించారు. కొందరు తమంతట తామే కట్టడం మానేశారు. ఇప్పుడు కొత్తగా జరుగుతున్న కులధృవీకరణలో ఒకవేళ లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో అనర్హులైతే వారు పాత బకాయిలతో పాటు భారీగా బిల్లులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జాబితాలూ కప్పల తక్కెడలే.. ఏ నెలకా నెల 50 యూనిట్ల లోపు వాడే వినియోగదారుల చిట్టా మారుతూనే ఉంటుంది. వేసవి దగ్గర పడితే ప్రతి కుటుంబంలోనూ 50 యూనిట్లకు పైబడే వినియోగం ఉంటుంది. ప్రతి నెలా అర్హుల జాబితాలు తయారుచేయడం, వాటిని కులధృవీకరణకు పంపడం, తిరిగి సాంఘిక సంక్షేమ శాఖకు నివేదించడం, అక్కడినుంచి విద్యుత్తు బిల్లులు రప్పించుకోవడం విద్యుత్తు శాఖకు తలకుమించిన భారంగా తయారవుతోంది. దీనిపైన ఇంత క్లిష్టమైన పద్ధతి కాక ఓ నిర్దిష్టమైన విధానం ఉండాల్సిందేనని ఆ శాఖ అధికారులు చెపుతూనే ఉన్నారు. వచ్చేది వేసవి కావడంతో ఈపీడీసీఎల్ అదనంగా విద్యుత్తు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ సంస్థ కొన్న విద్యుత్తు, పంపిణీ చేసిన విద్యుత్తు మధ్య ఆర్థిక సమతుల్యతను బేరీజు వేసుకుంటోంది. ఈ తరుణంలో ప్రభుత్వ పథకాల పేరుతో కోట్లు బకాయిలు పెడితే తద్వారా ఆ సంస్థకు నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు ఈపీడీసీఎల్‌కు భారీగా బకాయి పడ్డాయి. ‘వాటికి తోడు ఇదొకటా?’ అంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఇందిర జలభ్రమ
సాక్షి, కరీంనగర్ : 2011-12లో జిల్లాకు ఈ పథకం మంజూరయ్యంది. జిల్లావ్యాప్తంగా మూడేళ్లలో 31వేల ఎకరాలను అభివృద్ది చేసి నీటి వసతి కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం 11 కోట్ల 46 అక్షల రూపాయలతో అంచనాలను రూపొందించారు. లబ్దిదారుల ఎంపిక దగ్గర నుంచి అన్నింటా తీవ్ర జాప్యం జరుగుతుండడం వల్ల పథకం నత్తనడక నడుస్తోంది. అభివృద్ది చేసేందుకు 989 బ్లాకులలో 10570 ఎకరాల భూమిని గుర్తించారు. 4888 మంది ఎస్సి, 1421 ఎస్టి లబ్దిదారులకు చెందిన ఈ భూములను అభివృద్ధి పరిచేందుకు ఆరు కోట్ల 67 లక్షల అంచనాలతో 1058 పనులను మంజూ రు చేశారు. 833 బ్లాకుల్లో 8904 ఎకరాలకు సంబంధించి భూగర్భజల సర్వే పూర్తి చేశారు. వివిధ కారణాలతో 4333 ఎకరాల విస్తీర్ణం ఉన్న 397 బ్లాకులలో పనులను రద్దు చేశారు. మిగిలిన బ్లాకులలో బోర్లు, ఓపెన్‌బావులు, విద్యుదీకరణ, మోటార్ల ఏర్పాటు తదితర పనులు చేపట్టి ఇంతవరకు రెండు కోట్ల 64 లక్షలు ఖర్చు చేశారు. ఇద్దరు, అంతకన్నా ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ రైతులు బృందంగా ఏర్పడి, ఐదెకరాలకు మించి ఒకేచోట భూమి చూపితేనే ఈ పథకం కింద లబ్ది పొంద లుగుతారు. ఈ నిబంధన లబ్ధిదారుల ఎంపికలో సమస్యగా మారుతోందన్న వాదన ఉంది. ఇప్పటి వరకు 237 బోర్లు మాత్రమే వేయగా ఇందులోనూ 43 విఫలమయ్యాయి. వీటి కింద 1859 ఎకరాలు మాత్రమే సాగులోకి వస్తాయి. సాగునీటి వసతుల కల్పనలో తీవ్ర జాప్యం జరుగుతుండగా విద్యుదీకరణలో కూడా పురోగతి కనిపించడంలేదు. 183 వనరుల విద్యుదీకరణ కోసం ప్రతిపాదనలు సిద్దం చేయగా 113 పంపుసెట్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కాల పరిమితి 1014 మార్చిలో పూర్తికానుంది. ఇప్పటి వరకు అరకొరగానే పనులు జరిగినందున మిగిలిన 15 నెలల్లో లక్ష్యాన్ని పూర్తి చేయడం సాధ్యమవుతుందా అన్న సందేహం వ్యక్తమవుతుంది.