బాబు మాటలు..నీటి మూటలు | Chandrababu Guarantees Not Implemented In Ongole | Sakshi
Sakshi News home page

బాబు మాటలు..నీటి మూటలు

Published Wed, Mar 20 2019 11:52 AM | Last Updated on Wed, Mar 20 2019 11:56 AM

Chandrababu Guarantees Not Implemented In Ongole - Sakshi

ఎన్నికల ముందు గద్దెనెక్కేందుకు నోటికొచ్చిన హామీలు గుప్పించి..జన వంచనతో అధికార పీఠమెక్కిన సీఎం చంద్రబాబు ఐదేళ్లపాటు ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఇచ్చిన హామీల అమలుకు జిల్లా టీడీపీ నేతలు ఎవరూ కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఫలితంగా బాబు మాటలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయి జిల్లా ప్రగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. గారడి బాబు మళ్లీ అవే హామీలతో ఓట్లు అడుగుతూ జనం ముందుకొచ్చారు.

సాక్షి, ఒంగోలు సిటీ: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాటకే విలువ లేకుండా పోయింది. ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటీ  అమలు కాలేదు. ఇచ్చిన తర్వాత నుంచి పట్టించుకున్న దాఖలాలు లేవు. సీఎం హామీలు నీటిమూటలయ్యాయి. జిల్లా అధికారులు పదేపదే లేఖలు రాశారు. వివిధ సందర్భాల్లో నివేదికలను పంపారు. అయినా చలనం లేదు. నీటిపారుదల ప్రాజెక్టులు, ఉన్నత విద్యా రంగం, గనులు, వ్యవసాయం, మౌలిక సదుపాయల కల్పన సంస్థ, గృహ నిర్మాణం వంటి విభాగాల పరిధిలో రకరకాల హామీలు ఇచ్చారు. ఐదేళ్లు కాలం ఇట్టే గడిచి పోయింది. అయినా పురోగతి అడుగు ముందుకు వేయలేదు. సీఎం ఇచ్చిన హామీలను వివిధ సందర్భాల్లో జరిగిన బహిరంగ సభలు, సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు వల్లె వేశారు. ఐదేళ్లు ఇదే తంతు. ఎన్నికలు రానే వచ్చాయి. సీఎం హామీలు మాత్రం నీటి మూటలయ్యాయి.

వెలిగొండ నుంచి నీళ్లిస్తామన్నారు
వెలిగొండ ప్రాజెక్టు పనులు సంక్రాంతికి పూర్తి చేసి నీళ్లిస్తామన్నారు. సొరంగం పనులకు మళ్లీ మళ్లీ టెండర్లు పిలిచి, అంచనా వ్యయాలను పెంచుకున్నారే గానీ పనులను పూర్తి చేసిన పరిస్థితి లేదు. వెలిగొండ సొరంగం–1 పనులను తొలుత 2018 జూన్‌ నాటికి, మొత్తం ప్రాజెక్టు పని 2019 జనవరి నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు వ్యయం రూ.5,150 కోట్లు కాగా పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. తాజాగా సొరంగాల ప్రారంభంలోని హెడ్‌ రెగ్యులేటరీ పనులు సెప్టెంబర్‌ నాటికి, సొరంగం–1 పనులను మే నాటికి, సొరంగం–2 పనులను డిసెంబర్‌ ఆఖరి నాటికి పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించారు. ఇప్పటి వరకు రూ.1,525.27 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టు సొరంగం పనుల వద్ద డిజైన్‌ కూడా మార్చారు. అదనంగా మరో రూ.వెయ్యి కోట్లు అంచనాలను పెంచినా పనులు ఇంకా పూర్తి కాలేదు.

రాళ్లపాడు పరిధిలో తాగునీటి పనులు అంతే
సీఎం చంద్రబాబు ఐదో విడత జన్మభూమిలో జీకేఎన్‌ కాలువ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.  సుమారు 600 మీటర్లు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులను పూర్తి చేసి నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు నుంచి రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరు తీసుకోవడానికి ప్రణాళికను సీఎం ప్రస్తావించారు. సోమశిల నార్త్‌ ఫీడర్‌ చానల్‌ చింతలదీవి దగ్గర నుంచి 0.5 టీఎంసీల నీటిని రాళ్లపాడుకు తీసుకోవాల్సి ఉంది. 2018 అక్టోబర్‌ నాటికి ఈ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇంత వరకు పనులు పూర్తి కాలేదు. ఈ వేసవికి ముందే రాళ్లపాడు పరిధిలోని గ్రామాలకు తాగునీటి సమస్య నెలకొంది. 

ట్రిపుల్‌ ఐటీ ఎక్కడ ?
జిల్లాకు ట్రిపుల్‌ ఐటీ కలగానే మిగిలింది. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఒంగోలులో ట్రిపుల్‌ఐటీ రావాలి. జీవో కూడా ఇచ్చారు. ఒంగోలులో ట్రిపుల్‌ ఐటీకి సరిపడా స్థలం ఇవ్వలేకపోయారు. అధికారులు కొన్ని స్థలాలకు అడ్వాన్సు పొజిషన్‌ కూడా ఇచ్చారు. అవి కూడా లిటిగేషన్లలో పడ్డాయి. కందుకూరులో ప్రతిపాదించారు. అక్కడా కుదరలేదు. దీంతో కనిగిరి, పామూరులో 210 ఎకరాలను కేటాయించారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.500 కోట్లు నిధులు కావాలి. ప్రభుత్వం అదిగో ఇదిగో అంటుందే తప్ప నిధులు ఇవ్వలేదు. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీని ఇడుపులపాయలో నిర్వహిస్తున్నారు. ఒంగోలు మంగమూరురోడ్డులో పరిపాలనా భవనం ఏర్పాటు చేశారు. వీసీని నియమించారు. ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్లు జరిగి ఇడుపులపాయలోని ట్రిపుల్‌ ఐటీలోనే అదనంగా ఉన్న కొన్ని తరగతి గదుల్లో అరకొర వసతులతో నిర్వహిస్తున్నారు. ఇప్పటికి నాలుగు బ్యాచ్‌లు పూర్తయ్యాయి. నాలుగు వేల మంది ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ కింద ఉన్నారు. రూ.500 కోట్లకు గాను కేటాయించింది కేవలం రూ.2 కోట్లే. ట్రిపుల్‌ ఐటీ విషయంలోనూ సీఎం హామీ నెరవేరకుండానే ఎన్నికలు వచ్చేశాయి.

ఎన్‌ఎస్‌పీ కాలువల ఆధునికీకరణ నీటిమూటే..
నాగార్జున సాగర్‌ కాలువల పరిస్థితి దయనీయంగా తయారైంది. చంద్రబాబు కాలువల ఆధునికీకరణకు నిధులు ఇస్తామన్నారు. రూ.150 కోట్లు కేటాయిస్తామన్నారు. ఆధునికీకరణ పనులకు నిధులు ఇచ్చింది లేదు.  పనులు జరగనందున సుమారు 1.5 లక్షల ఎకరాల గ్యాప్‌ ఆయకట్టు పెరిగింది.  ప్రపంచ బ్యాంకు ఆధునికీకరణ పనుల కోసం రూ.820 కోట్లు కేటాయించింది. ఇందు కోసం 73 ప్యాకేజీలను రూపొందించారు. గత ఏడాది జూలై నాటికి ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు పూర్తయింది. ప్రతిపాదించిన ప్యాకేజీల్లో 12 ప్యాకేజీలను పూర్తి చేశారు. ఆ తర్వాత సీఎం రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఇచ్చి పనులు పూర్తి చేస్తామన్నారు. ఇంత వరకు ఆధునికీకరణ పనులు పూర్తవలేదు.

ఊసే లేని మైనింగ్‌ విశ్వవిద్యాలయం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గెలాక్సీ గ్రానైట్‌తో పాటు మైనింగ్‌ ద్వారా ఆదాయం బాగున్నందున జిల్లాలో చీమకుర్తి కేంద్రంగా మైనింగ్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఈ హామీ నీటి మూటైంది. జిల్లాలో ఐరన్‌ ఓర్, గ్రానైట్, మైకాహెమటైట్, బ్లాక్‌ గెలాక్సీ, కలర్‌ గ్రానైట్, గ్రావెల్, రోడ్డు మెటల్, పలకలు, మార్బుల్, సిలికా, క్వార్జ్, పలుగురాయి తదితర ఖనిజాలు ఉన్నాయి. వీటికి గాను 531 లీజులు ఉన్నాయి. 1120 మినరల్‌ బేస్‌ యూనిట్లు ఉన్నాయి. 50 వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఏటా రూ.318 కోట్లకు తగ్గకుండా ఆదాయం వస్తుంది.  ఇక్కడ మైనింగ్‌ విశ్వవిద్యాలయం వస్తే అభివృద్ధి సాధ్యపడుతుందని, చీమకుర్తి బాగా ప్రగతి సాధిస్తుందని భావించినా ఆశ నెరవేరలేదు.

అరుంధతి నక్షత్రంలాగే దొనకొండ ఇండస్ట్రియల్‌ కారిడార్‌
దొనకొండ పారిశ్రామికవాడ గురించి తెలుగుదేశం నాయకులు జిల్లా దశదిశలా ప్రచారం చేశారు. ఇంత వరకు దొనకొండ పారిశ్రామికవాడ ఊసే లేదు. 50 వేల ఎకరాల్లో పారిశ్రామికవాడ నిర్మించడానికి సీఎం హామీ ఇచ్చారు. మంత్రి శిద్దా రాఘవరావు.. సీఎం చంద్రబాబు నాయుడు కన్నా అధికంగా దొనకొండ గురించి ప్రచారం చేశారు. అరుంధతి నక్షత్రం చూపించిన చందంగానే దొనకొండ కారిడార్‌ నెలకొందన్న విమర్శలున్నాయి. 23 గ్రామాల్లో 25,886 ఎకరాలను భూసేకరణ చేయడానికి గుర్తించారు. కానీ దొనకొండ కారిడార్‌ మాత్రం రాలేదు. రూ.9070 కోట్లతో పారిశ్రామికవాడ అంచనాలు ఉన్నాయి. 2020 నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలి. కానీ మౌలిక వసతులు పూర్తికాలేదు. అసలు ప్రాజెక్టు వస్తుందో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి.

ఎన్నెన్నో హామీలు..నెరవేరితే ఒట్టు
గత ఎన్నికల్లో తెలుగుదేశం ఇచ్చిన హామీల్లో మూడొంతులకు పైగా నెరవేర్చింది లేదు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హామీల మీద హామీలు ఇచ్చారు. ఎన్నెన్నో హామీలు జిల్లా అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలాయి. రామాయపట్నం ఓడరేవు హామీకి బదులుగా అతి చిన్న పోర్టుకు శంకుస్ధాపన చేసి మమ అనిపించారు. వివిధ సందర్భాల్లో ఇచ్చిన 23 హామీలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి ఊసే లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement