‘వెలుగుల’ పథకం..నిలువెల్లా మసకే | free electricity to sc,st of 50 units but not implemented | Sakshi
Sakshi News home page

‘వెలుగుల’ పథకం..నిలువెల్లా మసకే

Published Sat, Jan 18 2014 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

free electricity to sc,st of 50 units but not implemented

సాక్షి,రాజమండ్రి : నెలకు 50 యూనిట్ల లోపు విద్యుత్తును వాడే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఆ విద్యుత్ ‘ఉచితం’ అని గత ఏడాది మార్చిలో ప్రభుత్వం ఇచ్చిన వరం నేటికీ సాకారం కాలేదు. ఆ వర్గాల్లో పేదలకు మేలు కోసం అన్న ఈ పథకం విధి విధానాలు నేటికీ ఓ కొలిక్కి రాలేదు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి ఈ పథకం  నిదర్శనంగా నిలుస్తోంది.

సర్కారు మీద నమ్మకంతో ఆ వర్గాల్లో అర్హులైన పేదల బిల్లులు వసూలు చేయకూడదన్న నిర్ణయం ఈపీడీసీఎల్‌కు కూడా బొప్పికట్టేలా చేసింది. ప్రస్తుతం ఈ పథకం అసలైన లబ్ధిదారుల ఎంపిక అనే దశలోనే మిణుకుమిణుకుమంటోంది. ఆ అసలైన లబ్ధిదారులు ఎవరో తేల్చలేక అధికారులూ అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

 గత ఏడాది మార్చి నుంచి నవంబరు వరకూ జిల్లాలో సుమారు లక్షా 60 వేలమందికి పైగా ఎస్సీ లబ్ధిదారులు ఈ పథకం పరిధిలోకి వస్తున్నారు. ఈ వ్యవధిలో వారు వినియోగించిన విద్యుత్తు విలువ సుమారు రూ.2.60 కోట్లు. 58,000 మంది ఎస్టీలు పథకం పరిధిలోకి వస్తుండగా వీరు సుమారు రూ.కోటి 50 లక్షల విలువైన విద్యుత్తును ఉపయోగించారు. ఇదంతా ప్రభుత్వం భరించి విద్యుత్తు శాఖకు చెల్లించాల్సి ఉంది. మార్చి నుంచి నవంబరు వరకూ ఏనెలకానెల జాబితాలను తయారుచేసి పంపుతూనే ఉన్నా ఇప్పటివరకూ ఆ బాపతు సొమ్ము సర్కారు నుంచి తమకు చేరలేదని వాపోతున్నారు ఈపీడీసీఎల్ అధికారులు.

 ఇప్పుడేం జరుగుతోందంటే..
 ఆయా మండలాల్లో విద్యుత్తు శాఖ సహాయ ఇంజనీర్లు రూపొందించిన అర్హులైన ఎస్సీ, ఎస్టీల జాబితాలను వారి కుల ధృవీకరణ కోసం తహశీల్దార్లకు పంపారు. తహశీల్దార్లు వీఆర్వోల సాయంతో ఇంటింటి సర్వే చేసి, వారు ఎస్సీ, ఎస్టీలు అవునో, కాదో నిర్ధారించి తిరిగి వాటిని విద్యుత్తు శాఖకు అందచేస్తే వాటిని ప్రభుత్వ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. అప్పుడే ఈ నిధులు విడుదలవుతాయి. విధి విధానాలను నిర్దేశించకుండా ముఖ్యమంత్రి ప్రకటించిన ఈ పథకంలో ముందుగా లబ్ధిదారుల ఎంపికే నెలనెలా ఓ ప్రహసనంగా మారుతోంది.

 ఈపీడీసీఎల్ రీడింగుల ప్రకారం అప్పటి నుంచి ఇప్పటివరకూ 50 యూనిట్ల లోపు వినియోగిస్తున్న వారిని ప్రాథమికంగా గుర్తించి బిల్లుల వసూలు విరమించారు. కొందరు తమంతట తామే కట్టడం మానేశారు. ఇప్పుడు కొత్తగా జరుగుతున్న కులధృవీకరణలో ఒకవేళ లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో అనర్హులైతే వారు పాత బకాయిలతో పాటు భారీగా బిల్లులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

 జాబితాలూ కప్పల తక్కెడలే..
 ఏ నెలకా నెల 50 యూనిట్ల లోపు వాడే వినియోగదారుల చిట్టా మారుతూనే ఉంటుంది. వేసవి దగ్గర పడితే ప్రతి కుటుంబంలోనూ 50 యూనిట్లకు పైబడే వినియోగం ఉంటుంది. ప్రతి నెలా అర్హుల జాబితాలు తయారుచేయడం, వాటిని కులధృవీకరణకు పంపడం, తిరిగి సాంఘిక సంక్షేమ శాఖకు నివేదించడం, అక్కడినుంచి విద్యుత్తు బిల్లులు రప్పించుకోవడం విద్యుత్తు శాఖకు తలకుమించిన భారంగా తయారవుతోంది.

 దీనిపైన ఇంత క్లిష్టమైన పద్ధతి కాక ఓ నిర్దిష్టమైన విధానం ఉండాల్సిందేనని ఆ శాఖ అధికారులు చెపుతూనే ఉన్నారు. వచ్చేది వేసవి కావడంతో ఈపీడీసీఎల్ అదనంగా విద్యుత్తు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ సంస్థ కొన్న విద్యుత్తు, పంపిణీ చేసిన విద్యుత్తు మధ్య ఆర్థిక సమతుల్యతను బేరీజు వేసుకుంటోంది. ఈ తరుణంలో ప్రభుత్వ పథకాల పేరుతో కోట్లు బకాయిలు పెడితే తద్వారా ఆ సంస్థకు నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు ఈపీడీసీఎల్‌కు భారీగా బకాయి పడ్డాయి. ‘వాటికి తోడు ఇదొకటా?’ అంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement