బ్యాలెట్ పత్రంలో ‘నోటా’ చేర్చాం
అనంతపురం అర్బన్ : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పత్రంలో అభ్యర్థుల పేర్లతో పాటు ‘నోటా’ కూడా చేర్చామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. పట్టభద్ర నియోజవర్గం బ్యాలెట్ పత్రంలో 25 మంది అభ్యర్థులతో పాటు ‘నోటా’ క్రమ సంఖ్య 26గా ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయ నియోజకవర్గం బ్యాలెట్ పత్రంలో 10 మంది అభ్యర్థులతో పాటు ‘నోటా’ క్రమ సంఖ్య 11గా ఉంటుందని తెలియజేశారు. ఈ విషయాన్ని ఓటర్లు గమనించాలని తెలిపారు.
8, 9 తేదీల్లో సెలవు : ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ నెల 8, 9వ తేదీల్లో సెలవు దినాలుగా ప్రకటించామని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు 125 కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు 65 కేంద్రాలు, మొత్తం 190 పోలింగ్ కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేశామన్నారు. వీటికి మాత్రమే సెలవు ఉంటుందన్నారు. అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 20న కౌంటింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ విద్యా సంస్థకు కూడా సెలవు ప్రకటించామని కలెక్టర్ తెలియజేశారు.