NTR Award
-
ఎన్టీఆర్ అవార్డ్ అందుకున్న ప్రముఖ నటుడు, నిర్మాత మృతి
కన్నడ చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత అయిన ద్వారకీష్ (81) గుండెపోటు కారణంగా ఏప్రిల్ 16న మరణించారు. 1963లో నటుడిగా చిత్ర సీమలో అడుగుపెట్టిన ఆయన సుమారు 150కి పైగా సినిమాల్లో నటించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా 50కి పైగా చిత్రాలను నిర్మించారు. పరమానందయ్య శిష్యుల కథ ,రామాయణంలో పిడకల వేట వంటి తెలుగు సినిమాలను నిర్మాతగా కన్నడలో రీమేక్ చేశారు. తమిళ్, తెలుగులో హిట్ అయిన బిచ్చగాడు సినిమాను కూడా కన్నడలో ఆయనే రీమేక్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో కిషోర్ కుమార్‌ని కూడా కన్నడ చిత్ర సీమకు పరిచయం చేసింది ద్వారకీష్ కావడం విశేషం. నిర్మాతగా ఎంతో మంది కొత్తవాళ్లను సినిమాల్లోకి తీసుకొచ్చారు. నటులు, నటీమణులకే కాదు-కొత్త దర్శకులకు, ఇతర సాంకేతిక నిపుణులకు కూడా అవకాశాలు ఇచ్చారు. అందరూ ఆయనను తమ "గాడ్ ఫాదర్"గా కన్నడ సీమలో భావిస్తారు. కన్నడ సినిమాకు వరుసగా రెండు దశాబ్దాలుగా భారీ హిట్లు అందించిన నిర్మాతగా ఆయనకు గుర్తింపు ఉంది. కన్నడ సినిమా పరిశ్రమకు అందించిన సేవలకు గాను ఎన్టీఆర్ అవార్డు ద్వారకీష్ను వరించింది. సీనియర్ ఎన్టీఆర్ పరమానందయ్య శిష్యుల కథ చిత్రం వల్ల వారిద్దిర మధ్య మంచి ఔనత్యం ఉండేది. ద్వారకీష్ గుండెపోటుతో మరణించడం వల్ల కన్నడ చిత్ర సీమలో విషాదం నెలకొంది. -
నాటక సమాజాలకు ‘వైఎస్సార్ రంగస్థల పురస్కారం’
సాక్షి, అమరావతి: ఏపీలోని నాటక రంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తోన్న రంగస్థల సమాజాలు, పరిషత్‌లకు ఈ ఏడాది నుంచి ‘వైఎస్సార్ రంగస్థల పురస్కారం’ అవార్డులను ప్రవేశపెడుతున్నట్లు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎఫ్డీసీ) చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌కే పరిమితమైన కళా ప్రదర్శనలను ఆడిటోరియంలు, కళా వేదికలు నిర్మించడం ద్వారా అన్ని ప్రాంతాలకు విస్తరించేలా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. కళాకారుల అభ్యున్నతిలో వైఎస్సార్ సేవలను స్మరించుకుంటూ రూ.5 లక్షల నగదు బహుమతితో ‘వెఎస్సార్ రంగస్థల పురస్కారం’ అందజేస్తామని చెప్పారు. దీనితో పాటు నాటక రంగంలో రాణిస్తోన్న కళాకారులకు ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం కింద రూ.1.50 లక్షలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే పురస్కారాలకు ఎంపికలను ప్రారంభిస్తామన్నారు. గుంటూరులో నంది అవార్డుల నాటక పోటీలు రంగస్థల నంది నాటక అవార్డులకు తుది ఎంపిక పోటీలను నవంబర్ చివరి వారం/డిసెంబర్ మొదటి వారంలో గుంటూరులో నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే 115 నాటకాలు, నాటికల్లో ప్రాథమిక ఎంపిక పూర్తయిందని, న్యాయ నిర్ణేతలు పరిశీలన అనంతరం 38 నాటకాలు, నాటికలను తుది ప్రదర్శనకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని కళాకారులు, నటీనటులకు ఎటువంటి సభ్యత రుసుము లేకుండా ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో కళా కారులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా www.apsftvtdc.in పోర్టల్‌ను సిద్ధం చేశామని చెప్పారు. జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, దర్శక, నిర్మాతల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. అవసరమైతే కళాకారులకు బస్సు ప్రయాణంలో రాయితీ కల్పించేందుకుకృషి చేస్తామన్నారు. చిత్ర పరిశ్రమను రావాలనే కోరారు.. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం జగన్ సుముఖంగా ఉన్నారని విలేకరుల ప్రశ్నలకు పోసాని బదులిచ్చారు. గతంలో చిత్ర పరిశ్రమలోనే ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి ఏపీలో ఏ ప్రాంతంలోనైనా స్టూడియోల నిర్మాణానికి ముందుకొస్తే ఎంతైనా స్థలం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారని గుర్తు చేశారు. కళాకారులు ఇక్కడికే వచ్చి స్థిరపడితే వారికి ఇళ్ల స్థలాలతో పాటు ఇతర ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారని వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమ విశాఖకు వచ్చే అంశాన్ని పరిశీలించాలని మరోసారి కోరతామన్నారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు పెద్ద సమస్య లేకుండా సినీ పరిశ్రమ తరలివచ్చిందన్నారు. ఏపీ, తెలంగాణలు రెండూ తెలుగు ప్రాంతాలే కావడం..హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తామంటే అక్కడి ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు ఇచ్చిన స్థలాలను వెనక్కి ఇవ్వాలని కోరితే ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి తలెత్తుతుందన్నారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే తరలింపుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వంతో చర్చించి అవసరమైతే వచ్చే ఏడాది నుంచి ఎన్టీఆర్ రంగ స్థల పురస్కారం నగదు ప్రోత్సాహక పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. -
ఎన్టీఆర్ అవార్డ్స్‌కు అరుదైన గౌరవం.. !!
నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డ్స్ వేడుకను నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. దాదాపు 8 రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నటుడు మురళీ మోహన్ పాల్గొని అవార్డులు అందజేశారు. తెలుగు సినీ నటులు మురళి మోహన్, కోట శ్రీనివాస్ రావు, బాబు మోహన్, దర్శకులు సురేష్ కృష్ణ, అశోక్, సత్యానంద్, సీనియర్ జర్నలిస్టులు వినాయక రావు, ధీరజ అప్పాజీ, కూనిరెడ్డి శ్రీనివాస్‌లకు ఈ అవార్డులు దక్కాయి. (ఇది చదవండి: ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి.. దీని వెనుక ఇంత కథ ఉందా..!) ఈ వేడుకను ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా, తెలుగు సినిమా వేదిక సంయుక్తంగా నిర్వహించారు. ఈ వేదికపై 101 మందికి అవార్డులు అందజేయగా.. వరల్డ్ బుక్ అఫ్ రికార్డులో చోటు సంపాదించింది. ఈ ఘనత సాధించిన ఎఫ్టీపీసీ సంస్థ అధ్యక్షులు చైతన్య జంగా - కార్యదర్శి వీస్ వర్మ పాకలపాటి లకు వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లండన్ సీఈఓ రాజీవ్ శ్రీవాత్సవ్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. మురళి మోహన్ మాట్లాడుతూ.. 'జాతీయ స్థాయిలో ఇంతమందిని ఒక వేడుకలో భాగస్వామ్యం చేయడం ఎంతో కష్టసాధ్యం. అయినప్పటికీ యుగపురుషుడు ఎన్టీఆర్‌పై అభిమానంతో ఈ సంస్థలు ఈ కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించారని.' అని అన్నారు. నటన, సేవా రంగాలలో ఎన్టీఆర్ ఎందరికో ఆదర్శ ప్రాయులని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ప్రభాకర్ రావు అభిప్రాయపడ్డారు. (ఇది చదవండి: Kiara Advani: ఖరీదైన కారు కొన్న కియారా.. ధర ఎన్ని కోట్లంటే?) ఈ కార్యక్రమంలో కోట శ్రీనివాస రావు, బాబు మోహన్, జెన్కో చైర్మన్ ప్రభాకర రావు, ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, సినీ ప్రముఖులు బసిరెడ్డి, దామోదర్ ప్రసాద్, కాశీ విశ్వనాధ్, ఎన్టీఆర్ మనవడు నందమూరి యశ్వంత్, తుమ్మల ప్రసన్న కుమార్, గౌతమ్ రాజు తదితరులు విచ్చేసి గ్రహీతలకు అవార్డులను బహూకరించారు. -
హాస్యనటుడు బ్రహ్మానందానికి ఎన్టీఆర్ పురస్కారం
విజయవాడ కల్చరల్: సినీ నటుడు ఎన్టీ రామారావు పురస్కారం అందుకోవడం మహాభాగ్యమని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా బ్రహ్మానందానికి ఎన్టీఆర్ ప్రధాన పురస్కారం, వివిధ రంగాలకు చెందిన 35 మందికి ఎన్టీఆర్ సెంటినరీ పురస్కారాలు అందించారు. (చదవండి: కరాటే కల్యాణికి బిగ్ షాక్.. మా సభ్యత్వం రద్దు!) ఎక్స్‌రే సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో తక్కువ సినిమాలే నటించినా ఆయన వద్ద ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ యుగం స్వర్ణ యుగమని చెప్పారు. ఎక్స్‌రే సేవా సంస్థ అధ్యక్షుడు కొల్లూరి సభను నిర్వహించారు. శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్రావు, టీడీపీ మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి తదితరులు మాట్లాడారు. -
సహజ నటి జయసుధకు ఎన్టీఆర్ పురస్కారం
సహజ నటి జయసుధ ప్రేక్షకలు మదిలో చెరగని ముద్ర వేసుకున్నారని కేంద్ర మంత్రి టి సుబ్బారామిరెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని సినీ నటి జయసుధకు ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. అంతకుముందు ఆకునూరి శారద నిర్వహణలో సినీ సంగీత విభావరి ఆహుతులను ఆకట్టుకుంది. ఆ కార్యక్రమంలో ఏపీ మాజీ డిప్యూటీ స్పికర్ మండలి ఉద్ద ప్రసాద్, సినీ దర్శకుడు ఎ కొదండరామిరెడ్డి, బి గోపాల్, రేలంగి నర్సింహారావు, వైవీఎస్ చౌదరి, వంశఅఈ సంస్థల వ్యవస్థాపకులు వంశీరాజు తదితరులు పాల్గొన్నారు. -
జయప్రదకు ఎన్టీఆర్ చలనచిత్ర పురస్కారం
ప్రముఖ నటి జయప్రదని ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం వరించింది. హీరో బాలకృష్ణ గౌరవ అధ్యక్షతన, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 27 సాయంత్రం నాజర్‌పేట ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్లో రచయిత సాయిమాధవ్ బుర్రా సభా నిర్వహణలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరగనుంది. ఈ వేడుకలో జయప్రదకు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాన్ని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ అందించనున్నారు. అలాగే ఈ నెల 28న ‘అడవి రాముడు‘ సినిమాను ప్రదర్శించనున్నారు. జయప్రద, రామకృష్ణ, దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి ప్రేక్షకులతో కలిసి ఈ సినిమాను వీక్షించనున్నారు. -
ఎన్టీఆర్‌తో నటించేటప్పుడు విలువలు నేర్చుకున్నా
‘‘నేను చిన్నతనం నుంచి ఎన్టీఆర్‌గారిని ఆదర్శంగా తీసుకునేదాన్ని. ఆయనతో నటించేటప్పుడు క్రమశిక్షణ, సిన్సియారిటీ, అంకితభావం, నిబద్ధత, మాటతీరు.. వంటి విలువలు నేర్చుకున్నాను’’ అని సీనియర్ నటి ఎల్.విజయలక్ష్మి అన్నారు. దివంగత నటుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు ఎల్.విజయలక్ష్మి. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఆమెకు హీరో బాలకృష్ణ గౌరవ సత్కారం చేశారు. అనంతరం ఎల్.విజయలక్ష్మి మాట్లాడుతూ– ‘‘ఎంతో అభిమానంతో అమెరికా నుంచి నన్ను పిలిపించి గౌరవించడం చూస్తుంటే కళ్లు చెమర్చుతున్నాయి. ఇందుకు బాలకృష్ణ, ఆలపాటి రాజా, బుర్రా సాయిమాధవ్‌లకు థ్యాంక్స్. వివాహం అయ్యాక సినిమాలు మానేసి అమెరికా వెళ్లాను. అక్కడ సీఏ చదివానంటే ఎన్టీఆర్‌గారి స్ఫూర్తి వల్లే. రామానాయుడు, ఎన్టీఆర్‌గార్ల తరం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మళ్లీ ఇలాంటి వేడుకలకు రావాలనుంది’’ అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘విజయలక్ష్మిగారు వందకుపైగా సినిమాల్లో నటిస్తే అందులో 60కి పైగా నాన్నగారితో నటించారు. ఆమె మహిళా సాధికారతకు ప్రతీక. ఆమె ఎక్కిన మెట్లను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి’’ అన్నారు. ‘‘1964లో మా బేనర్లో(సురేశ్ ప్రొడక్షన్స్) నిర్మించిన ‘రాముడు భీముడు’ సినిమాలో విజయలక్ష్మిగారు నటించారు. అందులో ‘‘దేశమ్ము మారిందే..’ అనే సాంగ్ కోసం ఆమె ఎంత కష్టపడ్డారో నాన్నగారు (రామానాయుడు) చెబుతుండేవారు’’ అన్నారు నిర్మాత డి.సురేశ్ బాబు. ఈ వేడుకలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, డైరెక్టర్ వైవీఎస్ చౌదరి, నిర్మాతలు సి.కల్యాణ్, ప్రసన్న కుమార్, బసిరెడ్డి, రామసత్యనారాయణ, జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ ఖాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్. విజయలక్ష్మికి ఎన్టీఆర్ అవార్డు
అలనాటి అందాల తార, ప్రముఖ నర్తకి ఎల్. విజయలక్ష్మిని ఎన్టీఆర్ అవార్డు వరించింది. తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలు ఏడాది పాటు పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్లో ప్రదర్శితమవుతున్నాయి. ఇక్కడ జరిగే కార్యక్రమంలో ప్రతి నెలా ఎన్టీఆర్ కుటుంబం నుండి ఒకరు పాల్గొంటారు. ఎన్టీఆర్‌తో పనిచేసిన ఒక లెజెండరీ పర్సన్‌కు ప్రతి నెలా అవార్డు, గోల్డ్ మెడల్ ప్రదానం చేస్తారు. అక్టోబర్ నెలకిగాను ఎన్టీఆర్ పురస్కారానికి ఎల్. విజయలక్ష్మి ఎంపికయ్యారు. బాలనటిగా ‘సిపాయి కూతురు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె ‘జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తనశాల, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, రాముడు–భీముడు, భక్త ప్రహ్లాద’ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌తో సుమారు 15 సినిమాలకు పైగా నటించారు విజయలక్ష్మి. 50 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా అమెరికాలో స్థిరపడ్డారామె. ఈ నెల 30న తెనాలిలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకోవడానికి ఆమె ఇక్కడికి రానున్నారు. కాగా ‘ఎన్టీఆర్ శతజయంతి’ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షుడిగా నందమూరి బాలకృష్ణ, అధ్యక్షుడిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బుర్రా సాయిమాధవ్ వ్యవహరిస్తున్నారు. -
‘ఈ రోజు నా జీవితంలో ఎంతో విషాదాన్ని నింపింది’
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు ఎన్టీఆర్ 24వ వర్ధంతి కార్యక్రమం ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ లలిత కళా పురస్కారాన్ని హాస్యనటుడు బ్రహ్మానందం అందుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతీ మాట్లాడుతూ.. ఈ రోజు తన జీవితంలో ఎంతో విషాదాన్ని నిపిందని.. అది తలుచుకుంటేనే మాటలు రావడం లేదన్నారు. ఎన్టీఆర్ ఓ మహానుభావుడని ఆమె అన్నారు. ఎన్టీఆర్‌పై అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ లలిత కళా పురస్కారం అందుకుంటున్న బ్రహ్మానందానికి లక్ష్మీ పార్వతీ అభినందనలు తెలియజేశారు. ఎన్టీఆర్ లలిత కళా పురస్కారాన్ని అందుకున్న అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఓ మహానుభావుడని, ఎన్టీఆర్ లలిత కళా పురస్కారానికి తనను ఎంపిక చేశారని తెలిసినప్పుడు భయం వేసిందన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి మేజర్ చంద్రకాంత్ సినిమా చేయడం తన పూర్వ జన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్మీ పార్వతికి ధన్యవాదాలు తెలిపారు. సీనియర్‌నటీ జమున మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు సంతానం ఉన్నా వారు చేయాల్సిన కార్యక్రమాన్ని లక్ష్మీ పార్వతి నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఎన్టీఆర్ లలితకళా పురస్కారం అందుకున్న బ్రహ్మానందంకు ఆమె అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా ఉండి.. ఎన్టీఆర్‌పై తనకున్న పతిభక్తిని చాటుకున్న లక్ష్మీ పార్వతి అంటే తనకు ఎంతో అభిమానమని అన్నారు. ఎన్టీఆర్ ఓ నటచక్రవర్తి అని, ఆయన పక్కన నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఎన్టీఆర్ అంటే ఓ మహానుభావుడని.. కృష్ణుడు సత్యభామ అంటే ఎన్టీఆర్, తానే గుర్తుకు వచ్చేలా నటించామన్నారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారన్నారు. బ్రహ్మానందంకు ఈ అవార్డు ఇవ్వడం తామందరికి గర్వకారణమని అన్నారు. కేవీ రమణాచారి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటుడిగా ఎంత గొప్పవారో సీఎంగా కూడా అంతే గొప్పవారని గుర్తు చేశారు. ఎంతో మంది నటుల్ని ఎన్టీఆర్ ప్రోత్సహించారని తెలిపారు. మనుషులు ఎంతో మంది ఉంటారు కానీ, తోటివారి బాగుకోరుకునే కొద్దిమంది మంచివారిలో ఎన్టీఆర్ ఒకరని రమణాచారి అన్నారు. ఎన్టీఆర్ ఓ దైవాంశ సంభూతుడని.. ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఇవాళ ఈ అవార్డును బ్రహ్మానందం అందుకున్నారని పేర్కొన్నారు. తెలుగు భాష పట్ల ఎంతో అభిమానం ఉన్న వ్యక్తి బ్రహ్మానందమని చెప్పారు. లక్ష్మీ పార్వతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న ఏకైక వ్యక్తి లక్ష్మీ పార్వతి అని ఆర్టీఏ మాజీ కమీషనర్ విజయబాబు అన్నారు. పార్వతికి ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించినందకు ఏపీ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగులో నేడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా బ్రహ్మానందం ఉండాల్సిందేనని.. ఏ పాత్రనైనా అలవోకగా నటించే సత్తా ఉన్న వ్యక్తి బ్రహ్మానందమని విజయబాబు కొనియాడారు. -
ఎన్టీఆర్ గొప్ప నటుడు
హైదరాబాద్ : నందమూరి తారకరామారావు గొప్ప నటుడని తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కె.రోశయ్య అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ విజ్ఞాన్ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ అస్సామీ రచయిత, మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ నగేన్ సాకియాకు ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారం–2019 ప్రదానం చేశారు. అనంతరం రోశయ్య మాట్లాడుతూ, రాజకీయంగా వైరుధ్యం ఉన్నప్పటికి నటుడిగా ఎన్టీఆర్‌ను ఎంతో అభిమానించానని అన్నారు. ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ, రాజకీయం విడదీస్తుందని.. సాహిత్యం మాత్రం అందరినీ కలుపుకుపోతుందని అన్నారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎన్.లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరిట సేవచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా నృత్య గురువు ఇందిరా ముస్నూరి శిష్యబృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటి జీవిత రాజశేఖర్, ఆర్టీఐ మాజీ కమిషనర్ పి.విజయ్‌బాబు, ప్రముఖ రచయిత్రి డాక్టర్ అనంతలక్ష్మి, చింత కిరణ్‌కుమార్, యువ కళావాహిని అధ్యక్షులు వై.కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రవ్వా శ్రీహరికి ఎన్టీఆర్ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుతో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆయన సతీమణి లక్ష్మీపార్వతి సాహితీ యజ్ఞం చేస్తున్నారని ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏటా ఇచ్చే జాతీయ సాహితీ పురస్కారాన్ని 2018 ఏడాదికి సంస్కృతాంధ్ర పండితుడు రవ్వా శ్రీహరికి ఇవ్వనున్నట్లు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. రమణాచారి మాట్లాడుతూ... జ్యూరీ కమిటీ మెంబర్లు డాక్టర్ అనుమాండ్ల భూమయ్య, ప్రొఫెసర్ సూర్య ధనంజయ్, డాక్టర్ ముక్తేవి భారతి భేటీ అయి ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారానికి శ్రీహరిని ఎంపిక చేశామన్నారు. 2007 నుంచి ఏటా ఈ పురస్కారాన్ని ఇస్తున్నామని లక్ష్మీపార్వతి అన్నారు. పురస్కారంతోపాటు లక్ష నగదు, గోల్డ్ మెడల్, ఎన్టీఆర్ జ్ఞాపికను ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య రానున్నారని తెలిపారు. -
రఘువీర్ చౌదరికి ‘ఎన్టీఆర్’ పురస్కార ప్రదానం నేడు
సాక్షి, హైదరాబాద్: స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన పేరు మీద ఇచ్చే జాతీయ సాహితీ పురస్కారాన్ని జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ రఘువీర్ చౌదరికి ప్రదానం చేయనున్నట్లు ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ ఎన్. లక్ష్మీపార్వతి తెలిపారు. శనివారం ఆమె సాక్షితో మాట్లాడూతూ.. పురస్కారంతో పాటు రూ.లక్ష నగదు అందజేయనున్నట్లు చెప్పారు. ముఖ్య అతిథిగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. శివశంకరరావు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, బిహార్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి తదితరులు పాల్గొంటారని వివరించారు. ఆదివారం(నేడు) సాయంత్రం 5.30కి రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో పురస్కారం ప్రదానం చేస్తామని తెలిపారు. -
అంబరీశ్ దంపతులకు ఎన్టీఆర్ అవార్డు
బెంగళూరు: కర్ణాటక తెలుగు సాహిత్య అకాడమీ వారు ప్రతియేటా ఇచ్చే ఎన్టీఆర్ స్మారక జాతీయ పురస్కారానికి ఈ ఏడాది శాండిల్‌వుడ్ రెబల్ స్టార్ అంబరీశ్, ఆయన భార్య సుమలతలను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రాధాకృష్ణ రాజు మంగళవారం మీడియాకు వెల్లడించారు. కళారంగానికి వారు చేస్తున్న కృషిని గుర్తించి అవార్డును అందజేస్తున్నామన్నారు. ఈ నెల 2న నగరంలోని రవీంద్ర కళా క్షేత్రంలో అంబరీశ్ దంపతులకు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. -
జిలానీ బానోకు ‘ఎన్టీఆర్ సాహితీ’ పురస్కారం
► 28న రవీంద్రభారతిలో అవార్డు ప్రదానం ► నందమూరి లక్ష్మీపార్వతి వెల్లడి హైదరాబాద్: నందమూరి తారక రామారావు విజ్ఞాన ట్రస్ట్ ఏటా ఇచ్చే ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారానికి ఉర్దూ సాహిత్యంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ కవయిత్రి, పద్మశ్రీ అవార్డు గ్రహీత జిలానీ బానో పేరును ఎంపిక చేశారు. అవార్డు కోసం ముగ్గురితో ఎంపికైన జ్యూరీ కమిటీ ఈసారి ఉర్దూ భాషా సాహిత్యానికి ఇవ్వాలని నిర్ణయించి జిలానీ బానోను ఎంపిక చేసినట్లు ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్టు చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులకు తెలిపారు. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. 2006లో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ స్థాపించి అప్పటి నుంచి నిరాఘాటంగా లైఫ్ అచీవ్మెంట్ స్థాయి అవార్డును ఎన్టీఆర్ పేరుతో జాతీయ స్థాయిలో అందజేస్తున్నామన్నారు. అవార్డుతో పాటు రూ.లక్ష నగదు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో పేరు గడించిన తొమ్మిది మంది వివిధ భాషల్లో ప్రముఖ రచయితలకు ఇంతవరకు అందజేశామని చెప్పారు. ఈసారి ముగ్గురు సాహితీ ప్రముఖులైన ప్రొఫెసర్ ఖలీల్ ఖాద్రీ, డాక్టర్ శివారెడ్డి, ఓల్గాలతో జ్యూరీ కమిటీ వేశామన్నారు. ముస్లిం సంప్రదాయ కుటుంబంలో పుట్టిన రచయిత్రి జిలానీ బానో దేశ, విదేశాల్లో ఎంతో గుర్తింపు పొందారన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ... ఈ నెల 28 ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. దక్కన్ ప్రాంత ఉర్దూకు పెద్ద పీట వేస్తున్న హైదరాబాద్ నగర రచయిత్రికి అవార్డు దక్కటం ఆనందంగా ఉందన్నారు. -
కా.రా. మాస్టారుకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్/శ్రీకాకుళం: తెలుగు కథా సాహిత్యంలో అగ్రగణ్యులు కాళీపట్నం రామారావు (కా.రా.మాస్టారు)ను ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.రమణాచారి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ జాతీయ అవార్డు కింద ఆయనకు బంగారు పతకంతో పాటు లక్ష రూపాయల నగదు పారితోషికాన్ని ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28న ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి నగదు పారితోషికాన్ని రూ. 1.50 లక్షలు చేస్తున్నామని చెప్పారు. కథా సాహిత్యాన్ని తారస్థాయికి తీసుకువెళ్లిన శ్రీకాకుళంకు చెందిన కా.రా.మాస్టర్‌ను ఈ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులు, ట్రస్ట్ సలహాదారు డా. కె.శివారెడ్డి, ట్రస్ట్ సభ్యురాలు మృణాళిని, ఓల్గాలను రమణాచారి అభినందించారు. దేశవ్యాప్తంగా ప్రముఖ సాహితీవేత్తలను ఈ అవార్డుకు ఎంపిక చేసి.. వారిని తగు రీతిలో గౌరవిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. సాహిత్యం వల్లే ఎన్టీఆర్‌తో తనకు పరిచయమైందని గుర్తుచేశారు. ఆయన మరణానంతరం స్థాపించిన ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ ద్వారా సాహితీ కృషీవలులకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేయడం తనకు ఆత్మానందాన్ని ఇస్తుందన్నారు. గత పది సంవత్సరాలుగా సాహిత్య దిగ్గజాలను ఈ అవార్డుతో గౌరవిస్తుండటంలో సాహిత్యానికి నిలువెత్తు రూపమైన రమణాచారి కృషి ఎంతో ఉందన్నారు. సమావేశంలో మృణాళిని, డా. కె. శివారెడ్డి, ఓల్గా పాల్గొన్నారు. కథానిలయ స్థాపకుడు.. కా.రా.మాస్టారు 1924 నవంబర్ 9న శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని మురపాక గ్రామంలో జన్మించారు. 1943 నుంచి విశాఖలో పలు ఉద్యోగాలు చేశారు. తరువాత భీమునిపట్నంలో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. సాహిత్యం ద్వారా పారితోషికం, సన్మానాల ద్వారా లభించిన ప్రతి పైసాను కూడబెట్టి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని 1997 పిబ్రవరిలో ‘కథానిలయం’ ఏర్పాటు చేశారు. -
ఆ మూడు కోరికలూ తీరకుండానే వెళ్లిపోయారు!
- నటుడు కాంతారావు భార్య హైమవతి హైదరాబాద్... నల్లకుంట కూరగాయల మార్కెట్ దాటి కొంచెం ముందుకెళ్తే ఎడమవైపున కార్తీక్ రెసిడెన్సీ. ఫస్ట్ ఫ్లోర్‌లోని ఆ ఫ్లాట్‌లోకి అడుగుపెడితే... ఎదురుగా చిన్న మంచం మీద కూర్చుని ఓ పెద్దావిడ ఓ పుస్తకంలో సాయికోటి రాసుకుంటూ కనిపించారు. ఆ పక్కనే టీవీలో ‘లవకుశ’ సినిమాలోని ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు...’ పాట వస్తోంది. ఆ పాటలో హీరో కాంతారావును చూడగానే ఆ పెద్దావిడ మొహం వెలిగిపోయింది. ఆమె కాంతారావు భార్య హైమవతి. 81 ఏళ్ల వయసులోనూ ఆమెకు గతమంతా స్పష్టంగా గుర్తుంది. ఆ స్టార్డమ్... లంకంత కొంప... కార్లు... నౌకర్లు... ఇలా అన్నీ ఆమెకు గుర్తున్నాయి. ఆమెకు గతం రాజభోగమైతే... వర్తమానం వనవాసం. స్వర్గమైనా.. నరకమైనా... అంతా లలాట లిఖితం అనుకునే స్థితప్రజ్ఞత ఆమెది. రాజభోగాన్ని ఎలా ఆస్వాదించారో... వనవాసాన్నీ ఆమె అలానే స్వీకరిస్తున్నారు. కాంతారావంటే కత్తి ఫైటింగులు గుర్తొస్తాయి. తెరపై శత్రువులతో, జీవితంలో సమస్యలతో కత్తి ఫైటింగ్ చేసిన వీరుడాయన. రాముడి వెంట లక్ష్మణుడిలా ప్రతి క్షణం ఆయన వెన్నంటే ఉన్నారామె. నేడు కాంతారావు 91వ జయంతి. ఈ సందర్భంగా భర్త గురించి హైమవతి హృదయావిష్కరణ... మీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? హైమవతి: బాగానే ఉంది. ఒకవేళ బాగోకపోయినా బాగానే ఉందని మనసులో అనుకుని తిరుగుతూనే ఉంటాను. కాంతారావుగారు చనిపోయి అయిదేళ్ళపైనే అవుతోంది కదమ్మా! హైమవతి: 2009 మార్చి 22న వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇలా ఆయన జ్ఞాపకాలతోనే కాలం వెళ్లదీస్తున్నా. ప్రతి పురుషుడి విజయం వెనుకా ఓ స్త్రీ ఉంటుందంటారు. మరి కాంతారావు గారి విజయం వెనుక మీ పాత్ర ఎంత? హైమవతి: నా పాత్ర ఏముంటుంది! ఆయనకు అనుకూలంగా ఉండేదాన్ని. మామూలుగా హీరోలు తెరపై హీరోయిన్లతో సన్నిహితంగా మెలగాల్సి వస్తుంది. అవి చూసి నేనేమీ ఫీలయ్యేదాన్ని కాదు. అదంతా నటనలో ఓ భాగమని తెలుసు. ఇంటి పోరు లేకుండా ఉంటే మగాడు సగం విజయం సాధించినట్టేగా! వాళ్లతో అంత సన్నిహితంగా ఎందుకు నటించారని అడిగితే, వాళ్లకీ మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేకుండా వాళ్లు మాత్రం ఎలా యాక్ట్ చేయగలుగుతారు! ఏ విషయంలోనూ ఆయనతో మీకు అభిప్రాయ భేదాలు రాలేదా? హైమవతి: నేనెప్పుడూ ఏ విషయంలోనూ ఆయనతో పోట్లాట పెట్టుకోలేదు. అన్నీ సమకూరుస్తున్నప్పుడు అసంతృప్తులెందుకొస్తాయి? ఆయన హీరోగా సంపాదించిందంతా, నిర్మాతగా పోగొట్టినప్పుడు కూడా మీరేమీ అనలేదా? హైమవతి: నేనేమీ అనలేదు. కనీసం సలహాలు, సూచనలు కూడా ఇచ్చేవారు కాదా? హైమవతి: నేనేమిస్తానండీ.. ఆయనకన్నీ తెలుసు. పైగా మొండి మనిషి. చెప్పినా వినే రకం కాదు. అనుకున్నది చేసేసేవారంతే! ఆయనకు వంశ పారంపర్యంగా 500 ఎకరాల పొలం ఆస్తిగా వచ్చింది. చాలామటుకు దానధర్మాలు చేసేశారు. చివరికి మా పెళ్లి నాటికి 70 ఎకరాలు మిగిలింది. ఆ తర్వాత అదీ లేదు. సినిమాలు తీసి అప్పులపాలయ్యాం. ఆయనకు ఎవ్వరికీ బాకీ ఉండడం ఇష్టం ఉండదు. ఆస్తంతా అమ్మి, అప్పులు తీర్చేశారు. ఇంట్లో మీతో ఎలా ఉండేవారు? హైమవతి: మమ్మల్ని చక్కగా చూసుకునేవారు. ఇంటికి కావాల్సినవన్నీ సమకూర్చేవారు. నేను పూర్వజన్మలో బాగా పుణ్యం చేసుకోబట్టే, దేవుడు నాకంత మంచి భర్తనిచ్చాడు. బంధుమిత్రులను కూడా బాగా చూసుకునేవారు. ఇంటికొచ్చినవారిని భోజనం పెట్టకుండా పంపించేవారు కాదు. ఒకప్పుడు మా ఇంట్లో రోజుకి 18 మంది భోజనం చేసేవారు. ఇంట్లో నాలుగు కార్లు ఉండేవి. పిల్లల్ని స్కూలుకి తీసుకెళ్లడానికి ఓ కారు, ఆయనకో కారు, నా కోసం ఓ కారు, ఒకటి గెస్ట్‌ల కోసం. మద్రాసులో మా ఇంటి పక్కనే గుడిసెలు ఉండేవి. వర్షం వస్తే వాళ్లకు మా ఇంట్లోనే ఆశ్రయం. వాళ్లింట్లో పెళ్లిళ్లయినా మా ఇంట్లోనే హడావిడి! మా అమ్మానాన్నలను కూడా బాగా చూసుకున్నారు. అమ్మ పక్షవాతం బారిన పడితే, మూడేళ్లు మా ఇంట్లోనే పెట్టుకుని కంటికి రెప్పలా చూశాం. నేనెప్పుడైనా అమ్మను విసుక్కుంటే, ఆయన నన్ను బాగా కోప్పడేవారు. ఇంతకూ మీరు కాంతారావుగారిని మొదట ఎప్పుడు చూశారు? హైమవతి: నిజామ్ ఏలుబడిలో రజాకార్ల దురాగతాలు సాగుతున్న సమయంలో నైజామ్ ప్రాంతం నుంచి చాలామంది ఆంధ్రాకు వలస వెళ్లిపోయారు. కాంతారావుగారూ అంతే. కోదాడ దగ్గరున్న గుడిబండ గ్రామం నుంచి జగ్గయ్యపేటకు వచ్చి, మా వీధిలోనే ఆయన కాపురం పెట్టారు. మా నాన్నగారు జాతకాలు చెప్పేవారు. ఒకసారి మా నాన్నగారి దగ్గరకు జాతకం చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు చూశానాయన్ని. ఆ తర్వాత ఆయన మొదటి భార్య సుశీల, పిల్లవాడు నాకు బాగా సన్నిహితమయ్యారు. కాంతారావుగారిని పెళ్లి చేసుకోమని మిమ్మల్ని సుశీలగారే అడిగారట కదా! హైమవతి: అవును. ఆవిడకు బాగా అనారోగ్యం. అప్పట్లో కొన్ని జబ్బులకు మందులుండేవి కావు. పిల్లాడు నాకు బాగా దగ్గరవ్వడంతో ఆవిడ ఆ నిర్ణయం తీసుకున్నారు. మా నాన్నగారి దగ్గరకు వచ్చి ఆవిడే ఒప్పించారు. 1950 మార్చి 1న మా పెళ్లి హైదరాబాద్‌లోని నల్లకుంట దగ్గర్లోని ఓ సత్రంలో జరిగింది. మా పెళ్లయిన కొన్ని రోజులకే ఆవిడ పైకి వెళ్లిపోయారు. ఆ తర్వాత పిల్లాడు కూడా అనారోగ్యంతో చనిపోయాడు. మీ పెళ్లయిన వెంటనే కాంతారావుగారు మద్రాసు వెళ్లిపోయినట్టున్నారు? హైమవతి: అవును. మొదట ‘నిర్దోషి’లో చిన్న వేషం వేసే అవకాశమిచ్చారు దర్శక - నిర్మాత హెచ్.ఎమ్. రెడ్డిగారు. తర్వాత ఆయనే ‘ప్రతిజ్ఞ’తో హీరోను చేశారు. కాంతారావు గారు సినిమా ఫీల్డ్కి వెళతానంటే మీరేమన్నారు? హైమవతి: నాకప్పట్లో ఏమీ తెలిసేది కాదు! ఆయనకు ఇష్టమైన పని ఆయన చేస్తున్నారని భావించేదాన్ని. ఆయనేం చేసినా నాకు ఇష్టంగానే అనిపించేది. భర్త అడుగుజాడల్లోనే నడవాలని మా పెద్దలు చెప్పారు. నేను చదివిన పుస్తకాల సారం కూడా అదే. మిమ్మల్ని షూటింగ్స్‌కి, ప్రివ్యూలకు తీసుకెళుండేవారా? హైమవతి: చాలాసార్లు! అవుడ్డోర్ షూటింగ్స్‌కి ఎక్కువ వెళ్లేదాన్ని. నాకు ఇంగ్లీషు రాదు. కొత్తవాళ్లతో మాట్లాడడం తెలిసేది కాదు. అక్కడ లొకేషన్లో ఎవరైనా, ఏదైనా అడిగితే చెప్పేదాన్ని. లేకపోతే కుర్చీలో కూర్చుని షూటింగు చూసేదాన్ని. సినిమా ఫీల్డ్‌లో మీకు సన్నిహితులు ఎవరూ లేరా? హైమవతి: ఎవ్వరూ లేరు. నేనెక్కడికీ వెళ్లేదాన్ని కాదు. అప్పుడప్పుడూ ఆయనతో కలిసి ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి వెళ్లేదాన్ని. కాంతారావుగారికి దర్శకుడు విఠలాచార్య ఎంత లైఫ్ ఇచ్చారో, అంత ఇబ్బంది పెట్టారటగా? హైమవతి: ఏమో..! అవన్నీ నాకు తెలియదు. నేను అడిగేదాన్ని కాదు. ఆయన చెప్పేవారు కాదు. పరిశ్రమలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వివక్ష గురించి కూడా ఆయన మీతో ప్రస్తావించేవారు కాదా? హైమవతి: ఏ కష్టమైనా ఆయన మనసులోనే పెట్టుకునేవారు. నాకు చెప్పేవారు కాదు. (కాంతారావుగారి మూడో అబ్బాయి రాజా, తల్లి పక్కనే కూర్చుని ఆసక్తిగా ఈ సంభాషణ గమనిస్తున్నారు. ఈ ప్రశ్నకు ఆయన కల్పించుకుని జవాబు చెప్పారు). రాజా: అప్పట్లో హీరోల మధ్య పోటీ ఎలా ఉండేదో నాన్న నాకు చెబుతుండేవారు. కులం, ప్రాంతం తాలూకు ప్రభావం ఎలా ఉంటుందో రకరకాల సంఘటనలు నాకు చెప్పారు. నాన్నకు లౌక్యం తెలియదు. పారితోషికంగా ఎవరు ఎంతిచ్చినా తీసుకునేవారు. పాత్ర ప్రాధాన్యం ఎలాంటిదో తెలుసుకోకుండానే, సినిమాలు ఒప్పేసుకునేవారు. దీనివల్ల చాలా ఎదురు దెబ్బలు కూడా తిన్నారు. పారితోషికాలు కూడా పెంచేవారు కాదు. ఎప్పుడూ ఒకటే రేటు. కొంతమంది నిర్మాతలైతే - ‘కాంతారావుకు ఇంతకు మించి ఇవ్వొద్ద’ని రేటు కూడా ఫిక్స్ చేసేశారు. అయినా కూడా నాన్న ఏమీ మాట్లాడేవారు కాదు! ఇంకొంతమంది డబ్బులు కూడా పూర్తిగా ఇచ్చేవారు కాదు. హీరోగా అన్ని సినిమాలు చేసి కూడా ఆయన ఆస్తులు కూడబెట్టుకోకపోవడానికి కారణం? హైమవతి: స్థలాలు కొనలేదు కానీ, మద్రాసులోని టి. నగర్లో పెద్ద ప్యాలెస్ లాంటి బంగ్లా కట్టించారు. ఆ ఇంటి గురించి అప్పట్లో గొప్పగా చెప్పుకునేవారు. చూడడానికి చాలామంది హీరోయిన్లు కూడా వచ్చారు. బాత్రూమే బెడ్రూమ్ సైజులో ఉండేది. అందులోనే వెరైటీగా మేకప్‌రూమ్ కూడా ఏర్పాటు చేయించారు. ఆ ఇంట్లో మేం 28 ఏళ్లు ఉన్నాం. మరి ఆ ఇల్లు ఏమైంది? హైమవతి: సినిమాలు తీసి అప్పులు పెరగడంతో 1987లో చాలా చౌకగా 13 లక్షలకు అమ్మేశాం. రెండేళ్ల తర్వాత అదే ఇల్లు కోటి రూపాయల రేటు పలికిందట. ఇప్పుడైతే ఎన్ని కోట్ల విలువ చేస్తుందో..! ఆ 13 లక్షల్లో కొంత అప్పు తీర్చి, మిగిలిన డబ్బుతో ‘స్వాతి చినుకులు’ సినిమా తీశారు. అదే ఆయన తీసిన ఆఖరు చిత్రం. దాంతో మొత్తం పోయింది. నిజానికి ఆయనకు ఆ సినిమా తీయడం ఇష్టం లేదు. అయినా ఇప్పుడు అనుకుని ఏం లాభం! అంతా లలాట లిఖితం. కాంతారావుగారి మీద మీకేం కోపం లేదా? హైమవతి: ఎందుకు కోపం? నన్ను ఓ రాజకుమారిలాగా చూసుకున్నారు. కష్టాలూ నష్టాలూ ఇవన్నీ సహజమే. డబ్బులున్నప్పుడూ... అన్నమే తిన్నాం. ఇప్పుడూ అన్నమే తింటున్నాం. మనవళ్లు డబ్బు పంపించినప్పుడు చాలా బాధపడిపోయేవారు. ‘‘ఇలా వీళ్లమీద ఆధారపడుతూ ఎన్ని రోజులు తినాలో?’’ అనేవారు నాతో. ‘‘పూర్వజన్మలో వాళ్లు మీకు బాకీ ఉండి ఉంటారు. అది తీరేవరకూ పంపిస్తార్లెండి’’ అనేదాన్ని. నిర్మాతగా కాంతారావుగారు అస్సలు లాభం చూడలేదా? రాజా: అయిదు సినిమాలు తీస్తే ఒక్కటి కూడా హిట్టు కాలేదు. కానీ, ఒకే ఒక్క సినిమా ‘గండర గండడు’కి మాత్రం కొంచెం డబ్బులొచ్చాయి. దేనికి దానికి సరిపోయాయి. మద్రాసు నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చేశారు? హైమవతి: అప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చేసింది. ఇక్కడైనా అవకాశాలు వస్తాయని వచ్చేశాం. రాజా: ఆ రోజు నాకింకా గుర్తుంది. వనవాసానికి బయలుదేరిన సీతారాముల్లాగా అమ్మా నాన్న కట్టుబట్టలతో మద్రాసులో బయలుదేరి హైదరాబాద్ వచ్చేశారు. అప్పుడు ఇక్కడ మా అక్క సుశీల, డాక్టర్ కృష్ణకుమారిగారు హెల్ప్ చేశారు. మొదట హోటల్లో ఉండి, తర్వాత హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాం. మెల్లిమెల్లిగా నాన్నకు టీవీ సీరియల్స్‌లో నటించే ఆవకాశాలు రావడం మొదలు పెట్టాయి. సినిమా ఛాన్సులు మాత్రం చాలా తక్కువే వచ్చేవి. నల్లకుంట నుంచి రప్పించడం ఎందుకనుకునేవారు! నల్లకుంట ఏదో వేరే రాష్ట్రం అన్నట్టుగా! అలా కొన్ని అవకాశాలు పోయాయి. మళ్లీ చివర్లో బాగానే అవకాశాలొచ్చాయి. ఆఖరు దశలో కొన్ని షూటింగ్స్‌లో కాంతారావుగారిని అగౌరవంగా చూసేవారని ఓ టాక్. నిజమేనా? రాజా: కొత్త తరానికి కాంతారావుగారి గొప్పతనం తెలియక అలా ప్రవర్తించిన మాట వాస్తవమే. పాత తరం వాళ్లు మాత్రం చాలా గౌరవంగా చూసుకునేవాళ్లు. ఒకసారైతే ఓ ప్రొడక్షన్ వాళ్లు కారు కూడా పంపకుండా ఆటోలో లొకేషన్‌కు రమ్మన్నారు. ఆ రోజు మాత్రం నాన్న చాలా బాధపడ్డారు. ఎంతో వైభవం చూసిన ఆయన చివరకు ఇలా చితికిపోవడాన్ని జీర్ణించుకోగలిగారా? రాజా: ఈ ఫ్లాట్‌లో బాల్కనీలో కూర్చుని తన స్థితిని అప్పుడప్పుడు తలుచుకుని వాపోయేవారు. కానీ ఏనాడూ మనో నిబ్బరాన్ని కోల్పోలేదు. అంతా విధి రాత అనేవారు. తోటి నటులతో పోలిస్తే ఈయనే ఎందుకింత వెనుకబడి పోయారు? రాజా: పరిశ్రమలో నిలబడాలంటే కచ్చితంగా ఎవరో ఒకరి అండాదండా ఉండాలి. నాన్నకు అలాంటి బ్యాకింగ్ లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా నాన్న ఒంటరిగానే తీసుకునేవారు. ఎన్టీఆర్, ఏయన్నార్ తర్వాత నాన్న పేరే చెప్పేవారు. ఇప్పుడు క్రమంగా నాన్న పేరు చెప్పడం మానేశారు. ఇలాంటివి విన్నప్పుడు బాధ వేస్తుంది. నాన్న తీసిన అయిదు సినిమాల్లో ఒక్కటి హిట్టయినా, నిలదొక్కుకునేవారు. సంపాదించిందంతా మళ్లీ సినిమాల్లోనే పెట్టారు. అప్పట్లో జూబ్లీహిల్స్‌లో స్థలాలు పది రూపాయిలు, వంద రూపాయిలన్నట్టుగా ఉండేవి. కొనమని కొంతమంది నాన్నకు సలహా ఇచ్చినా, పట్టించుకోకుండా మళ్లీ సినిమాల్లోనే పెట్టారు. అదే పొరపాటు అయిపోయింది. ఆయన ఆఖరి స్టేజ్ గురించి చెప్పండి? హైమవతి: హీరోగా ఎంతో వైభవం చూసి, చివరకు ఓ అద్దె ఇంట్లో కాలం గడపాల్సి వచ్చినా బాధపడలేదు. ఈ అతి సామాన్య జీవితాన్ని కూడా బాగానే ఆస్వాదించారు. ఇంటికి దగ్గర్లోనే కూరగాయల మార్కెట్. హాయిగా నడుచుకుంటూ వెళ్లి కూరగాయలు కొనుక్కొచ్చేవారు. ఫంక్షన్లకు కూడా ఆటోల్లోనే వెళ్లేవారు. పిల్లలకు సంపాదించి ఇవ్వలేకపోయాననే బాధ మాత్రం ఉండేది. ‘వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కట్టాలి’ అని లెక్కలు వేసుకునేవారు. మీ పిల్లల గురించి చెప్పండి? హైమవతి: మాకు నలుగురబ్బాయిలు, ఒకమ్మాయి. పెద్దవాడు, రెండోవాడు మద్రాసులో ఉంటారు. మూడోవాడు రాజా. నేను వీడితోనే ఉంటున్నాను. నాలుగోవాడూ ఇక్కడే ఉంటాడు. అమ్మాయిదీ హైదరాబాదే. ప్రస్తుతం మీ కుటుంబం ఎలా గడుస్తోంది? హైమవతి: ఆయన పోయిన దగ్గర్నుంచీ ఎలా బతుకు తున్నామో మాకే తెలీదు. ఎవరో ఒకరొచ్చి సాయం చేసి వెళ్తున్నారు. ఈ అయిదేళ్లూ బతికామంటే దైవకృప. రాజా: నాది చాలా చిన్న ఉద్యోగం. ఈ ఫ్లాట్ అద్దే - పది వేలు. ఏదో అలా కాలం గడిచిపోతోంది. 1999 నుంచి 2003 వరకూ సూపర్‌స్టార్ రజనీకాంత్‌గారు నెల నెలా 5 వేలు పంపించేవారు. దాసరిగారు 2000 మే నుండి 2009 మార్చి వరకూ నెల నెలా 5 వేలు ఇచ్చారు. మీ పిల్లలు ఎవరూ సినిమాల్లోకి రాలేదు కదా! హైమవతి: రాజా చిన్నప్పుడు ‘సుడిగుండాలు, మరో ప్రపంచం, ఎవరు మొనగాడు, మనుషులు-మట్టి బొమ్మలు’ ఇలా కొన్ని సినిమాల్లో నటించాడు. రాజా కొడుకు సాయి ఈశ్వర్‌కి సినిమాలంటే బాగా ఆసక్తి. కాంతారావు గారి సినిమాల్లో మీకు బాగా నచ్చినవి? హైమవతి: అన్నీ నచ్చుతాయి. ముఖ్యంగా ‘లవకుశ’. శ్రీకృష్ణ తులాభారం, ఆకాశరామన్న, శాంతి నివాసం... ఈ సినిమాలన్నీ ఇష్టంగా చూస్తుంటాను. అవార్డు రాకుండా అడ్డుపుల్లలేశారు! అవార్డుల విషయంలో కూడా అన్యాయమే జరిగినట్టుంది? రాజా: కచ్చితంగా జరిగింది. ఎన్టీఆర్ అవార్డు తనకొస్తుందని నాన్న చాలా ఆశపడ్డారు. కొందరు అడ్డుపుల్లలు వేశారు. పేర్లు అనవసరం. కులం, ప్రాంతం కూడా అడ్డొచ్చుంటాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కదా! మరి ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారాలు ఆశిస్తున్నారా? రాజా: ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవాలని ఉంది. నాన్న కూడా అప్పట్లో అడిగి ఉంటే ఎమ్జీఆర్, జయలలిత, ఎన్టీఆర్ సాయం చేసేవారేమో. ఒకసారి దూరదర్శన్ కేంద్రంలో ఓ కార్యక్రమానికి వెళ్లినప్పుడు అక్కడ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిగారు ఉన్నారు. అప్పుడు ఆయనే ముఖ్యమంత్రి. ఆయనతో అరగంట గడిపారు కానీ, హెల్ప్ చేయమని అడగడానికి మొహమాట పడ్డారు. అడిగివుంటే కచ్చితంగా ఆయన హెల్ప్ చేసేవారు. నాన్న చనిపోయినపుడు కొంతమంది సినీ ప్రముఖులు ‘‘అది చేస్తాం... ఇది చేస్తాం’’ అని స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ, మళ్లీ ఎవ్వరూ కనబడలేదు. కోదాడలో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. అదీ లేదు. ఆయన తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకునేవారా? రాజా: మనసులో ఉండేది. ఎప్పుడూ బయటపడలేదు. కాంతారావుగారి ఆఖరి సినిమా ఏది? హైమవతి: ‘శంకర్‌దాదా జిందాబాద్’. అయితే ‘పాండురంగడు’లో ఒకే ఒక్క సీన్లో చేశారు. అది కూడా మోహన్‌బాబుగారు చెప్పడంతో! ఒక్క రోజు వేషమే అయినా, పారితోషికం మంచిగా ఇప్పించారు. కాంతారావుగారికి తీరని కోరికలేమైనా ఉన్నాయా? హైమవతి: ముఖ్యంగా మూడు ఉండేవి. హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉండాలని తపించారు. ఒకసారి టి. సుబ్బరామిరెడ్డిగారు ఘన సన్మానం చేసి పది లక్షలిస్తే, ఇల్లు కొందామనుకున్నారు. ఈలోగా క్యాన్సర్ రావడంతో అవి వైద్యచికిత్సకే అయిపోయాయి. ఇక రెండో కోరిక ఏంటంటే - ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు. ప్రభుత్వపరంగా ఆ గుర్తింపు కావాలనుకున్నారు. ఇక మూడో కోరిక ఏమిటంటే - రాష్ట్ర ప్రభుత్వమిచ్చే ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకోవాలని చాలా తపించారు. చాలా రాజకీయాలు జరిగాయి. అదీ జరగలేదు. ఇలా ఆ మూడు కోరికలూ తీరకుండానే వెళ్లిపోయారు. కాంతారావు గారికి క్యాన్సర్ ఉందన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? హైమవతి: 2005 నవంబర్ 16న సరిగ్గా ఆయన పుట్టిన రోజు నాడు మాకీ విషయం తెలిసింది. అప్పటికే క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ అట! ఆసుపత్రి నుంచి తీసుకురాగానే మూడు రోజులు బాగానే ఉన్నారు. తర్వాత మళ్లీ వాంతులు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేవాళ్లం. ఇలా చాలాకాలం బాధపడ్డారు. వేలకు వేల డబ్బులు అలా వెళ్లిపోయాయి. ఫిలిమ్నగర్లో చాలామందికి స్థలాలు ఇచ్చారు కదా. మరి కాంతారావుగారికి ఇవ్వలేదా? రాజా: దీనికి జవాబు నేను చెప్తాను. అమ్మకు ఆ వివరాలేమీ తెలియవు. అప్పట్లో స్థలం కోసం రెండు వేల రూపాయలు కట్టారు. తర్వాత 40 వేలు కట్టమన్నారు. అప్పటికి నాన్నగారి దగ్గర డబ్బుల్లేవు. దాంతో ఆ స్థలం రాకుండా పోయింది. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటారు? రాజా: ఆయన హీరోగానే ఉండుంటే పరిస్థితి బాగానే ఉండేది. సినిమాలు తీసి మొత్తం పోగొట్టుకున్నారు. ఆయన కెరీర్ మొదట్నుంచీ చివరి వరకూ పరిశ్రమలో ఎదురీదారు. రకరకాల పరిస్థితులు, రకరకాల ఫీలింగ్స్... ఇలా ఎన్నో! చెప్పినా ఇప్పుడు వేస్ట్! - పులగం చిన్నారాయణ