► 28న రవీంద్రభారతిలో అవార్డు ప్రదానం
► నందమూరి లక్ష్మీపార్వతి వెల్లడి
హైదరాబాద్: నందమూరి తారక రామారావు విజ్ఞాన ట్రస్ట్ ఏటా ఇచ్చే ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారానికి ఉర్దూ సాహిత్యంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ కవయిత్రి, పద్మశ్రీ అవార్డు గ్రహీత జిలానీ బానో పేరును ఎంపిక చేశారు. అవార్డు కోసం ముగ్గురితో ఎంపికైన జ్యూరీ కమిటీ ఈసారి ఉర్దూ భాషా సాహిత్యానికి ఇవ్వాలని నిర్ణయించి జిలానీ బానోను ఎంపిక చేసినట్లు ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్టు చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులకు తెలిపారు.
లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. 2006లో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ స్థాపించి అప్పటి నుంచి నిరాఘాటంగా లైఫ్ అచీవ్‌మెంట్ స్థాయి అవార్డును ఎన్టీఆర్ పేరుతో జాతీయ స్థాయిలో అందజేస్తున్నామన్నారు. అవార్డుతో పాటు రూ.లక్ష నగదు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో పేరు గడించిన తొమ్మిది మంది వివిధ భాషల్లో ప్రముఖ రచయితలకు ఇంతవరకు అందజేశామని చెప్పారు. ఈసారి ముగ్గురు సాహితీ ప్రముఖులైన ప్రొఫెసర్ ఖలీల్ ఖాద్రీ, డాక్టర్ శివారెడ్డి, ఓల్గాలతో జ్యూరీ కమిటీ వేశామన్నారు.
ముస్లిం సంప్రదాయ కుటుంబంలో పుట్టిన రచయిత్రి జిలానీ బానో దేశ, విదేశాల్లో ఎంతో గుర్తింపు పొందారన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ... ఈ నెల 28 ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. దక్కన్ ప్రాంత ఉర్దూకు పెద్ద పీట వేస్తున్న హైదరాబాద్ నగర రచయిత్రికి అవార్డు దక్కటం ఆనందంగా ఉందన్నారు.
జిలానీ బానోకు ‘ఎన్టీఆర్ సాహితీ’ పురస్కారం
Published Sun, May 15 2016 9:49 PM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM
Advertisement