ఏడాదంతా తాటి నీరా ఉత్పత్తి!
ఉద్యాన శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
- ప్రకృతిసిద్ధమైన పోషకాలున్న హెల్త్ డ్రింక్ తాటి నీరా
- ఇప్పుడు తాటి ‘మగ, ఆడ కాడల’ నుంచి 7-8 నెలలు తీస్తున్నారు
- మిగతా 4 నెలలు కూడా తాటి కాయల నుంచి నీరా తీయొచ్చంటున్న శాస్త్రవేత్తలు
- నీరాను ఐస్ బాక్సుల్లో సేకరించి సీసాల్లో నింపి అమ్మొచ్చు
- ఖరీదైన తాటి బెల్లం, తాటి చక్కెర తయారీతో అధికాదాయం పొందొచ్చు
- గీత కార్మికులకు, తాటి చెట్లున్న రైతులకు ఏడాదంతా ఆదాయం
తాటి కాయల నుంచి జాలువారే ఆరోగ్యదాయకమైన పోషక జలం ‘నీరా’ ఇక ఏడాది పొడవునా తాజాగా ప్రజలకు అందుబాటులోకి రానుంది. తూ. గో. జిల్లా పందిరిమామిడిలోని డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు పీ సీ వెంగయ్య, జీ ఎన్ మూర్తి, కే ఆర్ ప్రసాద్ దీనికి సంబంధించిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారు. ఆ వివరాలను ఈ వ్యాసం ద్వారా ‘సాగుబడి’ పాఠకులకు అందిస్తున్నారు. నాణ్యమైన నీరాను ఏడాది పొడవునా ప్రత్యేక ఐస్ బాక్స్‌ల ద్వారా సేకరించే పద్ధతిని ఈ సీనియర్ శాస్త్రవేత్తలు రూపొందించారు. నీరాను సీసాల్లో నింపి మార్కెటింగ్ చేయొచ్చు. కుటీర ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా ఔషధ విలువలున్న ఖరీదైన తాటి బెల్లాన్ని, చక్కెరను కూడా ఏడాదంతా తయారు చేయొచ్చు. గీత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి దొరుకుతుంది. పొలాల్లో, గట్లపైన తాటి చెట్లను పెంచుతున్న రైతులకు గణనీయమైన ఆదాయం సమకూరుతుంది. ఈత చెట్ల నుంచి వర్షాకాలంలో నీరా తీయడం కష్టం. కానీ, తాటి చెట్ల నుంచి ఏడాదంతా తీయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెట్టుబడి లేని తాటి తోటల పెంపకానికి ఈ ఆవిష్కరణ దోహదపడుతుందని ఆశిద్దాం..
- సాగుబడి డెస్క్
గ్రామీణ భారతంలో తాటి చెట్టుకు విశిష్ట స్థానం ఉంది. ఈ చెట్టులో పనికిరాని భాగమంటూ లేదు. ముఖ్యంగా పూరిళ్ల నిర్మాణంలో వీటి పాత్ర వెలలేనిది. వేసవి తాపాన్ని తీర్చే తాటి ముంజలు, కల్లు వంటివాటిని ఎరుగని వారుండరు. మన దేశంలో 14 కోట్ల తాటి చెట్లున్నాయి. తమిళనాడులో అత్యధికంగా 6 కోట్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 5 కోట్ల తాటి చెట్లున్నాయని అంచనా. ఇన్నాళ్లూ గీత కార్మికులు తాటి చెట్టు కాడల నుంచి నీరాను లేదా కల్లును జనవరి నుంచి మే నెల వరకు తీస్తున్నారు.
అయితే, తాటి కాడల నుంచి కాకుండా కాయల నుంచి తీస్తే ఏడాది పొడవునా నీరాను తీసుకునే వినూత్న పద్ధతి మా పరిశోధనా కేంద్రంలో జరిపిన తాజా పరిశోధనల ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ముదిరిన తాటి కాయల నుంచి నీరాను తీయడం ద్వారా ప్రజలకు పోషకవిలువలు కలిగిన ఆరోగ్యదాయకమైన పానీయం నీరా, తాటి బెల్లం తదితర ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. గీత కార్మికులకు ఏడాదంతా ఉపాధి, అధికాదాయం లభిస్తుంది. తాటి చెట్లు కలిగి ఉన్న రైతులకు కౌలు రూపంలో అధికాదాయం లభిస్తుంది. పన్నెండేళ్లు నిండిన తాటి చెట్టుకు కొద్ది సంఖ్యలో గెలలు రావడం ప్రారంభమవుతుంది. పాతికేళ్లు నిండిన చెట్ల (తాటి చెట్టు వందేళ్లకు పైగా కాయలు కాస్తుంది)కు పూర్తిస్థాయిలో 15-20 గెలలు వస్తాయి. పక్వానికి వచ్చిన తాటి చెట్టు ద్వారా ప్రతి నెలా రూ. 8 వేల మేరకు.. ఏడాది పొడవునా ఆదాయం పొందే అవకాశాలు ఇప్పుడున్నాయి.
తాటి గెలల నుంచి ఊరే తాజా రసాన్ని నీరా అంటారు. తాజా నీరా మంచి వాసన, స్వచ్ఛమైన రంగులో తియ్యగా ఉంటుంది. ఇది మత్తును కలిగించదు. ఇది ఆరోగ్యవంతమైన హెల్త్ డ్రింక్. నీరా పులిస్తే కల్లుగా మారుతుంది. ఇది మత్తును కలిగిస్తుంది.
తాటి గెలకు బదులు కాయల నుంచి నీరా..
తాటి చెట్టు నుంచి లభించే ఉత్పత్తుల్లో నీరా అతి ముఖ్యమైనది. తాటి చెట్లకు కాయలు రాక మునుపు తాటి కాడల నుంచి నీరా లేదా కల్లు తీయడం ఆనవాయితీ. మగ కాడల నుంచి అక్టోబర్/నవంబర్ నుంచి జనవరి/ఫిబ్రవరి వరకు, ఆడ కాడల నుంచి ఫిబ్రవరి/మార్చి నుంచి మే/జూన్ వరకు.. ఏడాదికి చెట్టుకు 300 నుంచి 600 లీటర్ల వరకు నీరా తీస్తున్నారు. అయితే, తాటి కాయల నుంచి కూడా జూన్ నుంచి సెప్టెంబర్/అక్టోబర్ వరకు నీరా తీయొచ్చని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఇక ఏడాది పొడవునా, చెట్టుకు ఏడాదికి 600 లీటర్ల నుంచి వెయ్యి లీటర్ల వరకు నీరా ఉత్పత్తి చేయొచ్చని నిర్థారణ అయింది. ఈ విధానంలో ముదిరిన గెలలో అట్టడుగున ఉన్న తాటి కాయకు తొలుత గాటు పెట్టి నీరా సేకరిస్తారు. తర్వాత క్రమంగా పైనున్న కాయలకు గాటు పెట్టుకుంటూ మొత్తం గెలలోని అన్ని కాయల నుంచి నీరాను సేకరిస్తారు. ఒక మనిషి రోజుకు 12-15 చెట్ల నుంచి నీరాను సేకరించగలడు.
తాటి కాయల నీరాలో పోషకాలెక్కువ..
గెల నుంచి తీసిన నీరాలో కన్నా.. కాయల నుంచి తీసిన నీరాలో పోషక విలువలు ఎక్కువ. ఆరోగ్యానికి మేలు చేసే మాంసకృత్తులు, చక్కెర, ఇనుము, నత్రజని, భాస్వరం, కాల్షియం, తయామిన్, విటమిన్లు వంటి పలు పోషకాలు అధిక పరిమాణంలో ఉండి టానిక్‌లా పనిచేస్తుంది. ఖర్జూరా, కొబ్బరి, జీరిక చెట్ల నుంచి లభించే ఆహారోత్పత్తుల్లో కన్నా నీరాలో చక్కెర మోతాదు ఎక్కువగా ఉంటుంది. చక్కెర శాతం సుమారు 12-15 వరకు ఉంటుంది. ఆడ చెట్ల నుంచి సేకరించే నీరాలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. నీరాతో పలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. ఉబ్బసం, రక్తహీనత వంటి వ్యాధులను నివారిస్తుంది. క్షయవంటి రోగాలను పోగొడుతుంది. పులియని నీరాను శీతల పానీయంగా ఉపయోగిస్తారు. వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది.
సేకరించిన నీరాను శీతల పానీయంగా వాడాలంటే పులియకుండా, తాజాదనం కోల్పోకుండా నిల్వ ఉంచాలి. దీనికోసం గుజరాత్, మహారాష్ట్రలో నీరా సేకరించే కుండకు సున్నం పూస్తారు. అయితే సున్నానికి బదులుగా పందిరి మామిడి పరిశోధనా స్థానం కూలింగ్ బాక్స్‌ను రూపొందించింది.
చెట్టుకు నెలకు రూ. 800 పైగా నికరాదాయం
పలు ప్రయోజనాలున్న తాటి నీరాను శుద్ధి చేసి, బాటిళ్లలో నింపి విక్రయించటం ద్వారా గీత కార్మికులు మంచి ఆదాయం పొందవచ్చు. తాటి బెల్లం (కిలో ధర రూ.300) తదితర అనుబంధ ఉత్పత్తుల తయారీతో కుటుంబ సభ్యులకు ఉపాధి లభిస్తుంది. చెట్టుకు నెలకు రూ. 800కు పైగా నికరాదాయం (పట్టిక చూడండి) పొందవచ్చు. 1970 నిబంధనల ప్రకారం ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి పొంది నీరాను సేకరించి, ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. గుజరాత్లో రైతుల సహకార వ్యవసాయ పరపతి సంఘాలే నీరాను సేకరించి విక్రయిస్తూ ఏటా రూ. 6-7 కోట్ల వ్యాపారం చేస్తుండడం విశేషం. నిర్వహణ ఖర్చులు కూడా లేని తాటి చెట్ల నుంచి ఏడాది పొడవునా నీరాను సేకరించి అధికాదాయం పొందే అవకాశాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పందిరిమామిడి ఉద్యాన పరిశోధనా కేంద్రంలో మోడల్ నీరా బాట్లింగ్ వ్యవస్థ రూపుదిద్దుకుంటున్నది. వచ్చే మార్చి నాటికి ఇది పనిచేయడం ప్రారంభిస్తుంది.
(ఆహార శాస్త్రవేత్త పీ సీ వెంగయ్యను 94931 28932 నంబరులో సంప్రదించవచ్చు)