old criminal
-
చైన్‌స్నాచింగ్ చేసి.. పారిపోతూ..చెరువుగుంతలో పడి..
ముత్తారం(మంథని): ఒకచోట చోరీకి యత్నించి విఫలమయ్యాడు.. వెంటనే మరో ప్రాంతానికి వెళ్లి ఓ మహిళ మెడలో చైన్ తెంపాడు. వెంటనే బాధితురాలు కేకలు వేయగా, పారిపోతూ చెరువుగుంతలో పడి ఓ పాత నేరస్తుడు మృతి చెందాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మైదంబండ గ్రామపంచాయతీ పరిధి సర్వారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..రామగిరి మండలం బేగంపేటకు చెందిన బొంతల రాజ్‌కుమార్(35) తన కుటుంబంతో కలిసి గోదావరిఖనిలో ఉంటున్నాడు. గురువారం బైక్‌పై ముత్తారం మండలం మచ్చుపేట నుంచి సర్వారం వైపు వెళుతున్నాడు. ఆ గ్రామానికి చెందిన కాంచర్ల పుష్పలత చేనుకు నడుచుకుంటూ వెళుతుండగా, బైక్‌పై రావాలని రాజ్‌కుమార్ కోరగా, ఆమె నిరాకరించింది. దీంతో ఆమె గొంతు పట్టుకున్నాడు. బాధితురాలు కేకలు వేయడంతో సమీప చేనులో ఉన్న గొర్రె నవీన్ రావడంతో రాజ్‌కుమార్ అక్కడినుంచి పరారయ్యాడు. ఆ తర్వాత సర్వారంలోని సజ్జనపు మమత కిరాణం వద్దకు చేరుకున్నారు. బైక్‌లో పెట్రోల్ పోయించుకోగా, మిగతా చిల్లర ఇవ్వడానికి మమత ఇంట్లోకి వెళ్లింది. ఆమెను వెంబడించి మెడలోనుంచి 3 తులాల బంగారు పుస్తెలతాడు లాక్కు న్నాడు. వెంటనే ఆమె కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడకు చేరుకు న్నారు. వారిని చూసి రాజ్‌కుమార్ బైక్ అక్కడే వదిలేసి మైదంబండ వైపు పరుగెత్తాడు. ఆ దారిలో చెరువుగుంత కనిపించక అందులో మునిగి చనిపోయాడు. సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాసరావు తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడికి భార్య సింధూజ, కుమారుడు అక్షిత్‌కుమార్(2) ఉన్నారు. నిందితుడిపై 12 కేసులు రాజ్‌కుమార్‌పై పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 12 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనాలతోపాటు పలు ఇళ్లలో చోరీలు చేశాడు. ఈక్రమంలో 2022న రామగిరిలో అరెస్టయి కరీంనగర్ జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై విడుదలయ్యాక గోదావరిఖనికి మకాం మార్చాడు. బైక్‌లో కారంపొడి ప్యాకెట్ చోరీలు చేయాలనే పక్కా ప్లాన్‌తోనే రాజ్‌కుమార్ తన బైక్‌లో కారంపొడి ప్యాకెట్లు ఉంచాడు. మమత మెడలో నుంచి పుస్తెలుతాడు లాక్కొని, పారిపోయేందుకు వీలుగా రోడ్డుపై బైక్ సిద్ధంగా ఉంచుకున్నాడు. అక్కడి నుంచి కాల్వశ్రీరాంపూర్ వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కానీ, చోరీ సమయంలో స్థానికులు వెంబడించడంతో దారి మార్చుకున్నాడు. చెరువు వైపు పరుగెత్తాడు. అక్కడ చెట్ల ఆకులు, తీగలు, నాచు ఉండడంతో చెరువులోని నీరు కనిపించలేదు. అటువైపు వెళ్లొద్దని స్థానికులు హెచ్చరిస్తున్నా వినకుండా వెళ్లి పూడికతీసిన గుంతలో పడి చనిపోయాడు. -
పోలీసులు వేధిస్తున్నారని..
సాక్షి, మిర్యాలగూడ: దొంగతనం కేసులో పోలీసుల అదుపులో ఉన్న పాత నేరస్తుడు గాజు ముక్కలు మింగాడు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకే గాజుముక్కలు మింగినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. వివరాలు.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన సట్టు నాగేశ్వర్రావు గతంలో ఓ దొంగతనం కేసులో శిక్ష అనుభవించాడు. కాగా, కొద్దిరోజుల క్రితం మిర్యాలగూడ పట్టణంలో జరిగిన చోరీ కేసులో అతడిని అనుమానితుడిగా గుర్తించిన వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఉదయం పోలీస్‌స్టేషన్ మరుగుదొడ్డికి వెళ్లిన అతను అందులోని విద్యుత్ బల్బును వెంట తెచ్చుకున్నాడు. సెల్‌లోకి వెళ్లి ముక్కలుగా చేసి మింగాడు. దీంతో అతనిని స్థానిక ఏరియా ఆస్పత్రికి.. పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్‌కు తరలించారు. తనను దొంగతనం కేసులో 13 రోజుల క్రితం తీసుకొచ్చారని, అప్పటినుంచి తీవ్రంగా హింసిస్తున్నారని నాగేశ్వర్రావు ఆరోపించాడు. తన కాళ్లు పనిచేయడం లేదని, పోలీసుల దెబ్బలకు తట్టుకోలేకనే గాజు బల్బును పగులగొట్టి మింగానని ఆవేదన వ్యక్తం చేశాడు. -
సైకోనా.. పాత నేరస్తుడా
కోవూరు ప్రజలకు సైకో భయం వీడటం లేదు. అనుమానాస్పదస్థితిలో ఎవరు కనిపించిన సైకో అంటూ హడలెత్తుతున్నారు. అటు వెళ్లాడు.. ఇటు వెళ్లాడంటూ చర్చించుకుంటున్నారు. ఈ సమాచారం పోలీసులకు అందితే పరుగులు పెడుతున్నారు. కాగా పుకార్లను నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. బుచ్చిరెడ్డిపాళెం: కోవూరులో సైకో కలకలం వీడలేదు. పగలు, రాత్రి తేడా లేకుండా పోలీసులు గాలిస్తున్నా ప్రజల్లో భయం పోలేదు. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున జలదంకి విజయమ్మ, ఒంటేరు అంకమ్మపై సైకోగా చెబుతున్న వ్యక్తి దాడి చేసి గాయపరిచిన విషయం విదితమే. అదే రోజు మరో ముగ్గురిపై దాడి చేయపోగా ప్రతిఘటించడంతో పారిపోయాడు. ఇదంతా దాడి చేసిన వ్యక్తిని కళ్లారా చూసిన వ్యక్తులు చెబుతున్న విషయమే. అయితే మరుసటిరోజు 3వ తేదీన రామాలయం వద్ద బిచ్చగాడిపై జరిగిన దాడిలో దాడి చేసిన వ్యక్తులను ఎవరూ చూడలేదు. ఆ రోజు నుంచి అనుమానంగా ఎవరు కనపడినా ప్రజలు భయపడుతున్నారు. సైకో వచ్చాడంటూ అంటున్నారు. దీంతో అందరూ ఉలిక్కిపడి కంగారు పడుతున్నారు. తాజాగా సోమవారం రాత్రి పడుగుపాడు రైల్వేట్రాక్ పక్కన గుడిసెల వద్దకు సైకో వచ్చాడంటూ అక్కడి మహిళలు చెబుతున్నారు. బహిర్భూమికి వచ్చాడని అనుకున్నామని, ఒక్కసారిగా కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించగా భయపడి పరుగులు తీశామని అంటున్నారు. యువకులు స్పందించి పట్టుకునేందుకు ప్రయత్నించగా రాళ్లతో దాడి చేశాడని తెలిపారు. అదే సమయంలో వేగూరులో కూడా సైకో వచ్చాడంటూ కలకలం రేగింది. అయితే పోలీసులు మాత్రం అవన్నీ పుకార్లేనని కొట్టిపారేస్తున్నారు. పుకార్లను నమ్మవద్దని చెబుతున్నారు. సైకోనా.. దొంగా.. సైకోగా చెబుతున్న వ్యక్తి పాత నేరస్తుడిగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన మహిళలపై దాడి చేసింది వాస్తవమేనని, అయితే అతడు పాతనేరస్తుడని అంటున్నారు. గతంలో నెల్లూరు ఇరుగాళమ్మ దేవాలయం వద్ద ఉన్న ఓ వ్యక్తి అక్కడి నుంచి వెంకటేశ్వరపురానికి మకాం మార్చాడు. మద్యం సేవిస్తే చిర్రెత్తి పోయే వ్యక్తి మహిళలపై అత్యాచారానికి ప్రయత్నిస్తాడని సమాచారం. ఈ క్రమంలో 2వ తేదీ మహిళలపై దాడి చేసి గాయపరిచాడని, పోలీసుల దృష్టి పడడంతో పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు మాత్రం సదరు వ్యక్తిని పట్టుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఏ నిమిషమైనా ఆ వ్యక్తిని పట్టుకునే అవకాశం ఉంది. అయితే ఈలోగా ప్రజల్లో ఉన్న భయాందోళనతో కలకలం రేగుతోంది. త్వరలోనే పట్టుకుంటాం సైకోగా చెబుతున్న వ్యక్తి పాత నేరస్తుడని అతడ్ని పట్టుకుంటామని సీఐ వెంకటేశ్వర్లురెడ్డి చెబుతున్నారు. గాయపడిన మహిళలను ఇటీవల సన్నపనేని రాజకుమారి పరామర్శించిన విషయం విదితమే. గాయపరచిన వ్యక్తిని త్వరలో పట్టుకోవాలని ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణను ఆమె కోరిన విషయం తెలిసిందే. ఎస్పీ రామకృష్ణ ఇప్పటికే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు విస్తృతం చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో గాయపరచిన వ్యక్తిని పట్టుకుంటామని సీఐ చెబుతున్నారు. -
సెల్ఫోన్లోనే మిస్టరీ !
సబ్బవరం/పెందుర్తి: సబ్బవరం సమీపంలో ఓ పాతనేరస్తుడు దారుణహత్యకు గురయ్యాడు. ఆనందపురం – అనకాపల్లి జాతీయ రహదారి సమీపంలో బొర్రమ్మగెడ్డకు కొద్దిదూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హతుడు 15 చోరీ కేసుల్లో నిందితుడు కాగా... ఇటీవల హతుడికి సంబంధించిన విలువైన స్థలంపై వివాదం నడుస్తున్నట్లు సమాచారం. అయితే ఈ హత్యాకాండ మిస్టరీగానే ఉంది. స్థానికులు, పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... సబ్బవరం బర్మాకాలనీ(దుర్గానగర్)లో కోన చంద్రశేఖర్(26) ఉంటున్నా డు. ఇతని తల్లిదండ్రులు మరణించగా నలు గురు అక్కలు ఉన్నారు. చంద్రశేఖర్ వ్యసనాల కు బానిస కావడంతో దొంగతనాల బాటపట్టాడు. ఈ క్రమంలో ఇతడిపై సబ్బవరం, పెందుర్తి, గాజువాక, నగరంతోపాటు జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో 15 చోరీ కేసులు ఉన్నా యి. కొన్నాళ్ల క్రితమే ఇతడిపై సబ్బవరం పోలీస్ స్టేషన్లో డీసీ షీట్ ఓపెన్ చేశారు. చంద్రశేఖర్ ఎప్పుడూ ఇంటిపట్టున ఉండడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ సబ్బవరం సమీపంలోని ఓ దాబాలో తలదాచుకునేవాడు. ఆదివారం రాత్రి కూడా దాబాకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో చంద్రశేఖర్‌ను సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా నరికి చంపారు. మంగళవారం ఉదయం కొందరు రైతులు ఇటుగా రావడంతో ఘటన వెలుగుచూసింది. సమాచారం అందుకున్న అనకాపల్లి డివిజన్ డీఎస్పీ వెంకటరమణ, సీఐ జి.రామచంద్రరావు, సబ్బవరం ఎస్ఐ ఎన్.ప్రభాకర్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను రప్పించి ఆధారాల కోసం శోధించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. సెల్ఫోన్లోనే మిస్టరీ ! హతుడు చంద్రశేఖర్‌కు జిల్లాతోపాటు నగరంలోని పలువురి నేరస్తులతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలోని ఎల్లమ్మతోట, బర్మా కాలనీ ప్రాంతాల్లోని కొందరితో స్క్రాప్ దొంగతనాలతోపాటు చోరీలకు పా ల్పడుతుండేవాడని తెలుస్తోంది. మరోవైపు మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులతో కూడా చంద్రశేఖర్ గతంలో వివాదాలు పెట్టుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా చంద్రశేఖర్ కుటుంబానికి చెందిన విలువైన స్థలం సబ్బవరం నడిబొడ్డున ఉం ది. దాన్ని విక్రయించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా చంద్రశేఖర్ అడ్డుపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దొంగతనాల్లో సొత్తు పంపకంలో తేడాలు వచ్చి హత్య జరి గిందా... మరే ఇతర కారణాలతో ఇతడిని హ తమార్చారా అన్న కోణాల్లో పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో మృతుడి సెల్‌ఫోన్‌తో పాటు ఏటీఎం కార్డు, ఓటరు కార్డు, మద్యం సీసాలు, చెప్పులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్‌లోని కాల్‌డేటా ద్వారా నిందితుల ఆచూకీ తెలియవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు ఆనందపురం – అనకాపల్లి బైపాస్ రహదారి నుంచి దాదాపు 30మీటర్లు ఉన్న ఘట నా స్థలానికి ఆటో చక్రాల చారలను కూడా పోలీసులు కనుగొన్నారు. ఆటోలో ఇక్కడికి వచ్చిన దుండగులు మందు పార్టీ చేసుకున్న తర్వాత చంద్రశేఖర్‌ను హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
పాత నేరస్తుడి హత్య
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా సబ్బవరంలో పాత నేరస్తుడు హత్యకు గురయ్యాడు. చంద్రశేఖర్ అనే ఈ నిందితుడిపై 26 కేసులు నమోదై ఉన్నాయి. ఇతడిని కత్తులతో పొడిచి దుండగులు హత్య చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
డబ్బు ఇస్తావా? చస్తావా?
హుక్కా సెంటర్ల నిర్వాహకులకు పాతనేరస్తుడి బెదిరింపులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు బంజారాహిల్స్: హుక్కాసెంటర్లు, కాఫీ షాపుల యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న ఓ పాతనేరస్తుడిని బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మొఘల్‌పురాకు చెందిన సొహైల్ ముబారక్ అల్ ఖసేరి (25) జిమ్ ట్రైనర్. పాతనేరస్తుడైన ఇతడిపై ఫలక్‌నుమా, భవానీనగర్, మీర్‌చౌక్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌పరిధిలో క్రిమినల్ కేసులున్నాయి. తరచూ నేరాలు చేస్తుండటంతో మీర్‌చౌక్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇదిలా ఉండగా... ఆరు నెలల క్రితం బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని ‘ఖిల్లా’ హుక్కా సెంటర్ యజమానిని సొహైల్ రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే కత్తితో పొడిచి చంపేస్తానని బెదిరించాడు. ఇదే విధంగా ఇతను బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు హుక్కాసెంటర్లు, కాఫీషాపుల యజమానులను హెచ్చరించాడు. కాగా, ఖిల్లా హుక్కాసెంటర్ యజమాని ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు సొహైల్‌పై ఐపీసీ సెక్షన్ 385,511, 507 కింద కేసులు నమోదు చేశారు. మరింత సమాచారం రాబట్టేందుకు నిందితుడిని రెండు రోజుల కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. -
నల్లకుంటలో పాతనేరస్తుడి అరెస్ట్
న్యూనల్లకుంట పరిధిలోని బాయమ్మ గల్లీ ఆర్చి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న విజయ్ కుమార్ రెడ్డి అనే పాతనేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 3.6 తులాల బంగారు, 12.7 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇతను 15 కేసుల్లో నేరస్తుడిగా ఉన్నాడు. ఈయన స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా కాగా..ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి మండలం దుర్గానగర్‌లో ఉంటున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పోలీసుల సమక్షంలోనే నేరస్థుడ్ని కొట్టి చంపారు!
బండమీది పల్లి: పోలీసుల సమక్షంలోనే పాత నేరస్థుడ్ని కొట్టి చంపిన ఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలం బండమీది పల్లిలో గురువారం రాత్రి కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఓ కార్యక్రమంలో భాగంగా బుగ్గప్ప అనే నేరస్థుడ్నిపోలీసులు తమ వెంట అతని ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం స్టేషన్ కు తరలిస్తున్న సమయంలో కొంతమంది దుండగులు కాపుకాసి బుగ్గప్పపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బుగ్గప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పోలీసుల సమక్షంలో జరిగినా వారు మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది. కాగా, నిందితులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బుగ్గప్ప మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. -
పాత నేరస్తుడు అరెస్ట్
హైదరాబాద్ క్రైం: హైదరాబాద్ నగర పరిధిలో పలు దొంగతనాపాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మెదక్ జిల్లా వికారాబాద్ మండలం మైలర్దేవపల్లి గ్రామానికి చెందిన కొమ్మని శ్రీనివాస్(23) నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. బుధవారం సాయంత్రం అతన్ని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 17 తులాల బంగారం, 25 తులాల వెండితోపాటు రూ. 8 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.