ముత్తారం(మంథని): ఒకచోట చోరీకి యత్నించి విఫలమయ్యాడు.. వెంటనే మరో ప్రాంతానికి వెళ్లి ఓ మహిళ మెడలో చైన్ తెంపాడు. వెంటనే బాధితురాలు కేకలు వేయగా, పారిపోతూ చెరువుగుంతలో పడి ఓ పాత నేరస్తుడు మృతి చెందాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మైదంబండ గ్రామపంచాయతీ పరిధి సర్వారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..రామగిరి మండలం బేగంపేటకు చెందిన బొంతల రాజ్‌కుమార్(35) తన కుటుంబంతో కలిసి గోదావరిఖనిలో ఉంటున్నాడు.
గురువారం బైక్‌పై ముత్తారం మండలం మచ్చుపేట నుంచి సర్వారం వైపు వెళుతున్నాడు. ఆ గ్రామానికి చెందిన కాంచర్ల పుష్పలత చేనుకు నడుచుకుంటూ వెళుతుండగా, బైక్‌పై రావాలని రాజ్‌కుమార్ కోరగా, ఆమె నిరాకరించింది. దీంతో ఆమె గొంతు పట్టుకున్నాడు. బాధితురాలు కేకలు వేయడంతో సమీప చేనులో ఉన్న గొర్రె నవీన్ రావడంతో రాజ్‌కుమార్ అక్కడినుంచి పరారయ్యాడు. ఆ తర్వాత సర్వారంలోని సజ్జనపు మమత కిరాణం వద్దకు చేరుకున్నారు. బైక్‌లో పెట్రోల్ పోయించుకోగా, మిగతా చిల్లర ఇవ్వడానికి మమత ఇంట్లోకి వెళ్లింది.
ఆమెను వెంబడించి మెడలోనుంచి 3 తులాల బంగారు పుస్తెలతాడు లాక్కు న్నాడు. వెంటనే ఆమె కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడకు చేరుకు న్నారు. వారిని చూసి రాజ్‌కుమార్ బైక్ అక్కడే వదిలేసి మైదంబండ వైపు పరుగెత్తాడు. ఆ దారిలో చెరువుగుంత కనిపించక అందులో మునిగి చనిపోయాడు. సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాసరావు తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడికి భార్య సింధూజ, కుమారుడు అక్షిత్‌కుమార్(2) ఉన్నారు.
నిందితుడిపై 12 కేసులు
రాజ్‌కుమార్‌పై పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 12 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనాలతోపాటు పలు ఇళ్లలో చోరీలు చేశాడు. ఈక్రమంలో 2022న రామగిరిలో అరెస్టయి కరీంనగర్ జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై విడుదలయ్యాక గోదావరిఖనికి మకాం మార్చాడు.
బైక్‌లో కారంపొడి ప్యాకెట్
చోరీలు చేయాలనే పక్కా ప్లాన్‌తోనే రాజ్‌కుమార్ తన బైక్‌లో కారంపొడి ప్యాకెట్లు ఉంచాడు. మమత మెడలో నుంచి పుస్తెలుతాడు లాక్కొని, పారిపోయేందుకు వీలుగా రోడ్డుపై బైక్ సిద్ధంగా ఉంచుకున్నాడు. అక్కడి నుంచి కాల్వశ్రీరాంపూర్ వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కానీ, చోరీ సమయంలో స్థానికులు వెంబడించడంతో దారి మార్చుకున్నాడు. చెరువు వైపు పరుగెత్తాడు. అక్కడ చెట్ల ఆకులు, తీగలు, నాచు ఉండడంతో చెరువులోని నీరు కనిపించలేదు. అటువైపు వెళ్లొద్దని స్థానికులు హెచ్చరిస్తున్నా వినకుండా వెళ్లి పూడికతీసిన గుంతలో పడి చనిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment