నిందితుడు సొహైల్
- హుక్కా సెంటర్ల నిర్వాహకులకు పాతనేరస్తుడి బెదిరింపులు
- అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు
బంజారాహిల్స్: హుక్కాసెంటర్లు, కాఫీ షాపుల యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న ఓ పాతనేరస్తుడిని బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మొఘల్‌పురాకు చెందిన సొహైల్ ముబారక్ అల్ ఖసేరి (25) జిమ్ ట్రైనర్. పాతనేరస్తుడైన ఇతడిపై ఫలక్‌నుమా, భవానీనగర్, మీర్‌చౌక్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌పరిధిలో క్రిమినల్ కేసులున్నాయి. తరచూ నేరాలు చేస్తుండటంతో మీర్‌చౌక్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇదిలా ఉండగా... ఆరు నెలల క్రితం బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని ‘ఖిల్లా’ హుక్కా సెంటర్ యజమానిని సొహైల్ రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే కత్తితో పొడిచి చంపేస్తానని బెదిరించాడు. ఇదే విధంగా ఇతను బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు హుక్కాసెంటర్లు, కాఫీషాపుల యజమానులను హెచ్చరించాడు. కాగా, ఖిల్లా హుక్కాసెంటర్ యజమాని ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు సొహైల్‌పై ఐపీసీ సెక్షన్ 385,511, 507 కింద కేసులు నమోదు చేశారు. మరింత సమాచారం రాబట్టేందుకు నిందితుడిని రెండు రోజుల కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు.