
సాక్షి, శ్రీకాళహస్తి : అనుమానం పెనుభూతమై భార్యపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శ్రీకాళహస్తి పట్టణంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. 1వ పట్టణ సీఐ నాగార్జునరెడ్డి కథనం మేరకు.. పట్టణంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన వెంకటేష్‌కు నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం ఏకసిరి గ్రామానికి చెందిన దుర్గ (18)తో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. నాలుగు నెలలుగా దుర్గ అమ్మగారింట్లోనే కాపురం ఉంటున్నారు. రెండు నెలల క్రితం శ్రీకాళహస్తి వచ్చారు. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
పెద్దలు రాజీ చేయడానికి ప్రయత్నించగా రూ.1.50 లక్షలు ఇస్తే దుర్గను వదిలేస్తానని వెంకటేష్ చెప్పినట్టు అమ్మాయి బంధువులు ఆరోపిస్తున్నారు. బుధవారం కూడా వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున తీవ్ర ఆగ్రహం చెందిన వెంకటేష్ కత్తితో దుర్గపై దాడి చేశాడు. చెయ్యి, కాలుకు తీవ్రం గాయాలయ్యాయి. బంధువులు ఆమెను వెంటనే శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు వెంకటేష్ పోలీసులకు లొంగిపోయాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు వెంకటేష్‌పై హత్యాయత్నం, వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment