గీత కార్మికుల కోసం ‘కోటి ఈత చెట్లు’
సికింద్రాబాద్: రాష్ట్రంలో ఏడాదిలోగా కోటి ఈత మొక్కలను నాటాలని నిర్ణయించినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్ చెప్పారు. గీత కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తున్న మంత్రి పద్మారావుగౌడ్‌ను ఆదివారం తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ప్రతినిధులు కలసి అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెరువులు, కుంట కట్టలపై హరితహారం కార్యక్రమం ద్వారా ఈత మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధమైందని తెలిపారు. ఇప్పటికి 48 లక్షల ఈత మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉంచామన్నారు. గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌గౌడ్, సత్యనారాయణ గౌడ్, గోపాల్ గౌడ్, వినోద్ గౌడ్, రాములు గౌడ్ తదితరులు మంత్రిని కలసిన వారిలో ఉన్నారు.