one year rule
-
కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్
సాక్షి, హైదరాబాద్: రేవంత్ పాలనలో అన్నీ తిట్లు, ఒట్లేనని.. ప్రశ్నించే గొంతుకలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ పేరిట ఆయన ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, పోలీసుల చేత పోలీస్ కుటుంబాలను కొట్టించారన్నారు.‘‘రేవంత్‌రెడ్డికి పరిపాలనలో స్థిరత్వం లేదు. రేవంత్ విధానాలతో తెలంగాణ తిరోగమనంలో వెళ్లింది. గ్యారెంటీలు, హామీల అమల్లో ప్రభుత్వం విఫలమైంది. తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావడం లేదు. రేవంత్ అడుగులు కూల్చివేతలతో ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగం అయ్యింది. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది.’’ అని హరీష్‌రావు ధ్వజమెత్తారు.‘‘శాంతి భదత్రల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కాంగ్రెస్ హయాంలో తొమ్మిది చోట్ల మత కలహాలు జరిగాయి. మద్యం విక్రయాలు పెంచాలని మెమోలు ఇచ్చారు. గాంధీభవన్‌లో ఇచ్చే సూచనల ఆధారంగా చట్టాలు చేస్తున్నారు’’ అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.ఇదీ చదవండి: ఇది గారడీ సర్కార్ -
ఫొటోలు దిగడం తప్ప ప్రజలకు చేసిందేమిటో..!
సాక్షి, హైదరాబాద్: బాధ్యతల స్వీకరణకు ముందు పలు వివాదాలకు కారణమై.. తీవ్ర ఉత్కంఠ రేపి ఎట్టకేలకు ఎన్నికయ్యాక రెండు నెలల తర్వాత పగ్గాలు చేపట్టిన జీహెచ్ఎంసీ పాలకమండలి ఏడాది కాలంలో ఏం చేసిందో కనిపించడం లేదు. పైపెచ్చు కార్పొరేటర్ల నుంచి మేయర్ వరకు అవకతవకలు, సొంతలాభం వంటి మరకలంటుకున్నాయి. ఇక మహిళా సాధికారత లక్ష్యంగా అతివలకు ప్రాధాన్యమిచ్చినా.. పతుల తోడు లేనిదే ముందుకు కదలని వారు ఎందరో. నగరం గురించి విజన్ ఉందని.. చేయాలనుకున్నవి చేసి చూపిస్తామన్న మేయర్ తన విజన్‌ను ఏమేరకు అమలు చేశారో ఆమెకే తెలియాలి. పాలకమండలి పగ్గాలు చేపట్టినప్పటికీ, స్వతంత్ర నిర్ణయాలతో పనిచేసిన దాఖలాల్లేవు. అధికారుల అజెండాలకు.. పాలకమండలి సభ్యులు పచ్చజెండాలూపి ఫొటోలు దిగడం తప్ప వారు చేసిందేమిటో ప్రజలకు తెలియడం లేదు. ► గత ఏడాది ఫిబ్రవరి 11న పాలకమండలి కొలువుదీరినప్పటికీ, జూన్ 29 వరకు సర్వసభ్య సమావేశమే జరగలేదు. బడ్జెట్ ఆమోదం కోసం వర్చువల్‌గా నిర్వహించారు. ఆ సమావేశంపై ప్రతిపక్ష బీజేపీ పెదవి అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం డిసెంబర్ 18న భౌతికంగా సమావేశాన్ని నిర్వహించినా.. బల్దియా చరిత్రలో అంతకు ముందెన్నడూ లేనివిధంగా కౌన్సిల్ హాల్లోకి మీడియాకు అనుమతి నిరాకరించి చీకటి దినంగా గుర్తుండేలా చేశారు. ► తమ వాణి వినిపించేలా సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పలుమార్లు డిమాండ్ చేసిన బీజేపీ సభ్యులు నవంబర్ 23న మేయర్ చాంబర్లో రణరంగం సృష్టించారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసులు నమోదు చేశారు. పాలకమండలి పగ్గాలు చేపట్టా క తొమ్మిదినెలల తర్వాత నవంబర్‌లో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. గతంలో మాదిరిగానే టీఆర్ఎస్, ఎంఐఎం పరస్పర ఒప్పందంతో టీఆర్ఎస్ నుంచి 8 మందికి ఎంఐఎం నుంచి ఏడుగురికి అవకాశం కల్పించారు. మరిన్ని విశేషాలు.. ► ఎస్ఎఫ్ఏల తొలగింపు, నియామకాల్లో జోక్యంతో మేయర్ సీటు వన్నె తగ్గింది. అధికారిక, అనధికారిక అన్ని కార్యక్రమాల్లోనూ డిప్యూటీ మేయర్ వెంట ఆమె భర్త ఉండటం చర్చనీయాంశంగా మారింది. మహిళా సాధికారతపై సంశయాలు రేకెత్తించింది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న జీహెచ్ఎంసీ నిధుల నుంచి మేయర్, డిప్యూటీ మేయర్ వంటి వారు కార్యాలయాలు, క్యాంప్ కార్యాలయాల ఆధునికీకరణల పేరిట నిధులు దుబారా చేయడం వారి ఆశను వెల్లడించింది. (చదవండి: నిషా ముక్త్ నగరమే లక్ష్యం) ► వానలు రావద్దని కోరుకుంటానంటూ మేయర్ వ్యాఖ్యానించడం, ఇంటికి జనరేటర్ కావాలని కోరడం వివాదాలకు కారణమయ్యాయి. స్వచ్ఛ హైదరాబాద్, పచ్చదనం పెంపు వంటి అంశాల్లో నగరం మెరుగైన ర్యాంక్ సాధించడం కలిసి వచ్చింది. ర్యాంకులొచ్చినా, స్వచ్ఛ ఆటోలు పెరిగినా, చెత్త సమస్యలు తీరలేదు. ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో పోస్టింగులకు ప్రాధాన్యం పెరిగింది. సామాన్య ప్రజల ఫిర్యాదులు స్వీకరించే దిక్కు లేకుండా పోయింది. ► పాలకమండలికి అధికార యంత్రాంగంపై పట్టులేక పోవడం వెల్లడైంది. జోన్లు,సర్కిళ్ల స్థాయిలో అవినీతి పెచ్చరిల్లిందనే విమర్శలున్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనూ ఎవరు కార్యాలయాలకు వస్తున్నారో, ఎవరు రావడం లేదో తెలియని దుస్థితి. అందరికీ బయోమెట్రిక్ హాజరు అన్నది పబ్లిసిటీకి మాత్రం పనికొచ్చింది. కంట్రోల్ రూమ్‌ల పేరిట ఖర్చులు పెరిగాయి. గతంలోని కంట్రోల్ రూమ్ చేయలేకపోయిందీ.. కొత్తగా ఏర్పాటు చేసింది చేస్తున్నదేమిటో పట్టించుకున్న వారు లేరు. (చదవండి: మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు!) ► కనీస సమాచారం సైతం కరువైన దుస్థితి నెలకొంది. ఇటీవలి కాలంలో మేయర్ జోన్లవారీ సమీక్షలు నిర్వహిస్తుండటం చెప్పుకోదగ్గ అంశం. సభా మర్యాదలు మంట గలిశాయి. ఒక్క సమావేశమే జరిగినా అర్థవంతమైన చర్చల సంగతటుంచి నువ్వా.. నేనా..? తేల్చుకుందామన్నట్లుగా వ్యవహరించారు. ఏడాదైనా వార్డు కమిటీలు ఏర్పాటు కాలేదు. ఇలా.. ఇంకా.. ఎన్నో.. ఎన్నెన్నో! -
ఏడాదిలోనే 90 శాతం హామీలు పూర్తి: రాష్ట్ర కార్యదర్శి
సాక్షి, విశాఖపట్నం: దేశంలో మొదటి సంవత్సరంలోనే 90 శాతం హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గ్రామస్థాయిలో సచివాలయాలు పెట్టి సుమారు 20 శాఖల పాలనను అందిస్తున్నారన్నారు. ప్రతి 50 గృహాలకు వాలంటీర్లను నియమించి నేరుగా ప్రజల వద్దకే సంక్షేమ పథకాలను అందిస్తూ సీఎం జగన్ ఆదర్శ పాలనను సాగిస్తున్నారన్నారు. (భరోసా కేంద్రాలతో రైతులకు మేలు..) ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులకు నేరుగా ఇంటివద్దకే నగదు రూపంలో పించన్ అందించడం ఒక ప్రయోగమని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాలు తలెత్తకుండా 3 రాజ్యాంగ వ్యవస్థలను 3 ప్రాంతాలలో నెలకొల్పి పరిపాలనను వికేంద్రీకరణ చేయడం సీఎం జగన్ తీసుకున్న ఆదర్శ ఆలోచన అన్నారు. ప్రతి పార్లమెంటు, నియోజకవర్గ స్థాయిలో ఒక జిల్లాను ఏర్పాటు చేయడంలో భాగంగా 12 కొత్త జిల్లాలను త్వరలో సీఎం జగన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
జనరంజక పాలన; జనం స్పందన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తవుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు అఖండ విజయం కట్టబెట్టడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను ఏడాది కాలంలోనే అమలు చేశారు. అంతేకాకుండా మేనిఫెస్టోలో చెప్పని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. పాఠశాల విద్యార్థుల నుంచి పండు వృద్దుల వరకు అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. వైఎస్ జగన్ ఏడాది పాలనపై అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారు తమ అనుభవాలను, అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకోవచ్చు. దాంతోపాటు చేయాల్సిన పనులకు సంబంధించి ఏవైనా సూచనలు, సలహాలను కూడా మాకు పంపొచ్చు. అభిప్రాయాలను webeditor@sakshi.comకు మెయిల్ చేయండి. మీ అభిప్రాయాలు పంపినప్పుడు వాటితో పాటు మీ పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ వంటి పూర్తి వివరాలతో పంపగలరని మనవి. -
సీఎం జగన్ ఏడాది పాలన: ప్రత్యేక సదస్సులు
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు రోజుల పాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు. (రుణపడి ఉంటాం.. థాంక్యూ జగనన్న) 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం.. 25న పరిపాలన సంస్కరణలు-సంక్షేమం, 26న వ్యవసాయం-అనుబంధ రంగాలు, 27న విద్యారంగం సంస్కరణలు-పథకాలు, 28 న పరిశ్రమలు-పెట్టుబడుల రంగం, 29న వైద్య ఆరోగ్య రంగం సంస్కరణలు-పథకాలపై సదస్సులు నిర్వహించనున్నారు. 30న రైతు భరోసా కేంద్రాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఆన్లైన్ పద్దతిలో.. ఆన్ లైన్ పద్దతిలో సదస్సులను ప్రభుత్వం నిర్వహించనుంది. సదస్సుల్లో ప్రతి రోజు సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. జిల్లా స్థాయిలో ఇంచార్జ్ మంత్రి, మంత్రులు, లబ్ధిదారులతో సదస్సులు జరగనున్నాయి. భౌతిక దూరం పాటిస్తూ 50 మంది మాత్రమే పాల్గొనాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఒక్క అడుగు... ముందుకు!
(ఆంధ్రప్రదేశ్ బ్యూరో): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది పాలన ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి చందంగా సాగింది. అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైన రాజధాని నిర్మాణం విషయంలో పారదర్శకత లోపించింది. సమీక్షలు, సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు, పర్యటనలతోనే సగం కాలం గడిచిపోయింది. ఏడాదిలో దాదాపు నెలరోజుల పాటు విదేశీ పర్యటనల్లోనే సాగింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు వస్తున్నాయనీ రాష్ట్రాన్ని సింగపూర్‌ను చేస్తానంటూ రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించారు. కానీ ఏవీ జరగలేదు. గతేడాది సరిగ్గా ఇదే రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పెట్టిన తొలి సంతకాలు ఏడాదైనా అమలు కాకపోగా, పక్కరాష్ట్రమైన తెలంగాణలో కోట్లు ఎర వేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న విషయంలో అడ్డంగా దొరికిపోయి ప్రజల ముందు దోషిగా నిలబడ్డారు. శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలను తన పార్టీలోకి లాక్కున్న చంద్రబాబు సొంత పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంపై పెదవి విప్పకపోవడం విమర్శలకు తావిచ్చింది. రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన గెలుపొందిన ఇద్దరు ఎంపీలను బెదిరించి తన పార్టీలో చేర్పించుకున్నారన్న విమర్శలకూ స్పందించకపోగా, నైతిక విలువలంటూ ప్రసంగాలు చేయడం ప్రజలు నవ్వుకునేలా చేసింది. ప్రతి పనికీ కన్సల్టెంట్ల నియామకమే తప్ప ప్రగతి లేదు. తెరవెనుక తతంగాలెన్నో.. రాజధాని మాస్టర్ ప్లాన్ నుంచి కుప్పంలో రహదారి నిర్మాణం వరకు అన్ని పనులూ అత్యంత గోప్యంగానే సాగుతున్నాయి. పలు లావాదేవీల్లో చంద్రబాబు కుమారుడు లోకేశ్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడంపైనా తీవ్రమైన విమర్శలే వచ్చాయి. తండ్రీకొడుకులపై సూట్‌కేసులు, బ్రీఫ్‌కేసులు అనే విమర్శలు వెల్లువెత్తాయి. పోలవరాన్ని పక్కనపెట్టి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరమీదకు తేవడం వెనుక దాదాపు రూ.400 కోట్ల మేరకు చేతులు మారాయన్న ఆరోపణలొచ్చాయి. ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచిన తీరు, కాంట్రాక్టర్‌కు కట్టబెట్టిన వైనంపై వచ్చిన తీవ్రమైన ఆరోపణల విషయంలో ప్రభుత్వం విపక్షాలను సమాధానపరచలేకపోయింది. రైతులకు రాయితీలు ఇవ్వమంటే మనసొప్పలేదు. అదే పారిశ్రామిక రాయితీలను మాత్రం ఆగమేఘాలపై విడుదల చేశారు. ఏకంగా రూ.2,067 కోట్లు పారిశ్రామిక వర్గాలకు చెల్లించారు. ఇందులో చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న పలువురు మంత్రులు లబ్ది పొందారన్న విషయం బహిరంగ రహస్యం. ఈ వ్యవహారమంతా చినబాబు తెరవెనుక ఉండి నడిపించగా 30 శాతం మేరకు కమీషన్ రూపేణా కొల్లగొట్టారనే ఆరోపణలొచ్చాయి. పేరుకు ఇసుక రీచ్‌లను డ్వాక్రా సంఘాలకు అప్పగించినా.. వారిని అడ్డుపెట్టుకుని తెలుగు తమ్ముళ్ల యథేచ్ఛ దోపిడీ సాగుతోంది. ఇప్పటికే రూ.800 కోట్ల నుంచి 1,000 కోట్ల మేరకు ఇసుక రూపంలో డబ్బు దోచేశారన్న ఆరోపణలున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రన్న కానుక పేరుతో పథకం ప్రవేశపెట్టి చంద్రబాబు తన సొంత హెరిటేజ్ సంస్థకు ప్రయోజనం చేకూర్చారు. బెరైటీస్ మంత్రాంగం ఏడాది కాలంలో ప్రభుత్వం విడుదల చేసిన అన్ని టెండర్లలోనూ మతలబులున్నాయి. బెరైటీస్ టెండర్ల ద్వారా 300 కోట్ల మేరకు క్రషింగ్ చేసేశారు. గ్లోబల్ టెండర్ల పేరిట గోబెల్స్ ప్రచారం చేసిన పెదబాబు.. చివరకు చినబాబు మంత్రాంగం మేరకు అంతర్జాతీయ, జాతీయ సంస్థలను పోటీకి రాకుండా నిలువరించారు. బెరైటీస్ ఖనిజానికి అంతర్జాతీయ మార్కెట్ ధరలో 70 నుంచి 75 శాతం కనీస ధరగా నిర్ణయించాలన్న నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఇచ్చిన జీవోను రద్దు చేసి 65-70 శాతం కనీస ధరగా ఖరారు చేయాలంటూ జీవో ఇప్పించారు. చివరకు అంతర్జాతీయ ధరలో 65 శాతాన్ని మాత్రమే బేసిక్ ధరగా నిర్ణయించి టెండర్లు పిలిపించారు. కేవలం కనీస ధరను తగ్గించడంవల్లే ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు రూ. 280 కోట్ల నష్టం వాటిల్లింది. ఈమేరకు కాంట్రాక్టర్లు లబ్ధిపొందారు. ఈ వ్యవహారంలో ఒక ఎంపీ మధ్యవర్తిత్వం ద్వారా ప్రయోజనం పొందిన బెరైటీస్ సంస్థలు.. చినబాబుకు రూ.300 కోట్లు ముట్టజెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హంగులు, ఆర్భాటాలకు కోట్లు డబ్బులు లేవని రాజధాని నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తున్న చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం, సచివాలయంలోని పేషీ, ఇంటివద్ద ఏర్పాట్లు, విజయవాడలో క్యాంపు కార్యాలయం వంటి వాటికి హంగులు, ఆధునిక సదుపాయాల కోసం ఏకంగా రూ.వంద కోట్లు వెచ్చించడమంటే ఏ స్థాయిలో ఆర్భాటాలకు పోతున్నారో అర్థమవుతుంది. ఈ పనులన్నీ నామినేషన్ పద్ధతిలో అప్పగించి అందినకాడికి దోచుకున్నారన్న విమర్శలొచ్చాయి. ఎలాంటి అధికారిక హోదా లేని లోకేశ్ అమెరికా పర్యటనకు వెళితే వెంట ఇద్దరు అధికారులను ప్రభుత్వ ఖర్చులతో పంపించడమే కాకుండా ఆ దేశ అధ్యక్షుడు ఒబామాతో ఫొటో దిగడానికి లక్షలు వెచ్చించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రమాణ స్వీకారం చేయడానికి రూ.30 కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు మళ్లీ ఏడాది తర్వాత అక్కడే మరో రూ.30 కోట్లతో బ్రహ్మాండమైన సభ నిర్వహిస్తున్నారు. ఇలా పాలన అంతా పైన పటారం లోన లొటారం అన్న చందంగానే సాగిందని విమర్శలున్నాయి.