ఒక్క అడుగు... ముందుకు! | chandrababu naidu one year rule | Sakshi
Sakshi News home page

ఒక్క అడుగు... ముందుకు!

Published Mon, Jun 8 2015 11:44 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM

ఒక్క అడుగు... ముందుకు!

ఒక్క అడుగు... ముందుకు!

(ఆంధ్రప్రదేశ్ బ్యూరో): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది పాలన ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి చందంగా సాగింది. అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైన రాజధాని నిర్మాణం విషయంలో పారదర్శకత లోపించింది. సమీక్షలు, సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు, పర్యటనలతోనే సగం కాలం గడిచిపోయింది. ఏడాదిలో దాదాపు నెలరోజుల పాటు విదేశీ పర్యటనల్లోనే సాగింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు వస్తున్నాయనీ రాష్ట్రాన్ని సింగపూర్‌ను చేస్తానంటూ రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించారు. కానీ ఏవీ జరగలేదు.

గతేడాది సరిగ్గా ఇదే రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పెట్టిన తొలి సంతకాలు ఏడాదైనా అమలు కాకపోగా, పక్కరాష్ట్రమైన తెలంగాణలో కోట్లు ఎర వేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న విషయంలో అడ్డంగా దొరికిపోయి ప్రజల ముందు దోషిగా నిలబడ్డారు. శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలను తన పార్టీలోకి లాక్కున్న చంద్రబాబు సొంత పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంపై పెదవి విప్పకపోవడం విమర్శలకు తావిచ్చింది. రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన గెలుపొందిన ఇద్దరు ఎంపీలను బెదిరించి తన పార్టీలో చేర్పించుకున్నారన్న విమర్శలకూ స్పందించకపోగా, నైతిక విలువలంటూ ప్రసంగాలు చేయడం ప్రజలు నవ్వుకునేలా చేసింది.  ప్రతి పనికీ కన్సల్టెంట్ల నియామకమే తప్ప ప్రగతి లేదు.

తెరవెనుక తతంగాలెన్నో..
రాజధాని మాస్టర్ ప్లాన్ నుంచి కుప్పంలో రహదారి నిర్మాణం వరకు అన్ని పనులూ అత్యంత గోప్యంగానే సాగుతున్నాయి. పలు లావాదేవీల్లో చంద్రబాబు కుమారుడు లోకేశ్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడంపైనా తీవ్రమైన విమర్శలే వచ్చాయి. తండ్రీకొడుకులపై సూట్‌కేసులు, బ్రీఫ్‌కేసులు అనే విమర్శలు వెల్లువెత్తాయి. పోలవరాన్ని పక్కనపెట్టి  పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరమీదకు తేవడం వెనుక దాదాపు రూ.400 కోట్ల మేరకు చేతులు మారాయన్న ఆరోపణలొచ్చాయి.

ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచిన తీరు, కాంట్రాక్టర్‌కు కట్టబెట్టిన వైనంపై వచ్చిన తీవ్రమైన ఆరోపణల విషయంలో ప్రభుత్వం విపక్షాలను సమాధానపరచలేకపోయింది. రైతులకు రాయితీలు ఇవ్వమంటే మనసొప్పలేదు. అదే పారిశ్రామిక రాయితీలను మాత్రం ఆగమేఘాలపై విడుదల చేశారు. ఏకంగా రూ.2,067 కోట్లు పారిశ్రామిక వర్గాలకు చెల్లించారు. ఇందులో చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న పలువురు మంత్రులు లబ్ది పొందారన్న విషయం బహిరంగ రహస్యం. ఈ వ్యవహారమంతా చినబాబు తెరవెనుక ఉండి నడిపించగా 30 శాతం మేరకు కమీషన్ రూపేణా కొల్లగొట్టారనే ఆరోపణలొచ్చాయి.

పేరుకు ఇసుక రీచ్‌లను డ్వాక్రా సంఘాలకు అప్పగించినా.. వారిని అడ్డుపెట్టుకుని తెలుగు తమ్ముళ్ల యథేచ్ఛ దోపిడీ సాగుతోంది. ఇప్పటికే రూ.800 కోట్ల నుంచి 1,000 కోట్ల మేరకు ఇసుక రూపంలో డబ్బు దోచేశారన్న ఆరోపణలున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రన్న కానుక పేరుతో పథకం ప్రవేశపెట్టి చంద్రబాబు తన సొంత హెరిటేజ్ సంస్థకు ప్రయోజనం చేకూర్చారు.

బెరైటీస్ మంత్రాంగం
ఏడాది కాలంలో ప్రభుత్వం విడుదల చేసిన అన్ని టెండర్లలోనూ మతలబులున్నాయి. బెరైటీస్ టెండర్ల ద్వారా 300 కోట్ల మేరకు క్రషింగ్ చేసేశారు. గ్లోబల్ టెండర్ల పేరిట గోబెల్స్ ప్రచారం చేసిన పెదబాబు.. చివరకు చినబాబు మంత్రాంగం మేరకు అంతర్జాతీయ, జాతీయ సంస్థలను పోటీకి రాకుండా నిలువరించారు. బెరైటీస్ ఖనిజానికి అంతర్జాతీయ మార్కెట్ ధరలో 70 నుంచి 75 శాతం కనీస ధరగా నిర్ణయించాలన్న నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఇచ్చిన జీవోను రద్దు చేసి 65-70 శాతం కనీస ధరగా ఖరారు చేయాలంటూ జీవో ఇప్పించారు.

చివరకు అంతర్జాతీయ ధరలో 65 శాతాన్ని మాత్రమే బేసిక్ ధరగా నిర్ణయించి టెండర్లు పిలిపించారు. కేవలం కనీస ధరను తగ్గించడంవల్లే ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు రూ. 280 కోట్ల నష్టం వాటిల్లింది. ఈమేరకు కాంట్రాక్టర్లు లబ్ధిపొందారు. ఈ వ్యవహారంలో ఒక ఎంపీ మధ్యవర్తిత్వం ద్వారా ప్రయోజనం పొందిన బెరైటీస్ సంస్థలు.. చినబాబుకు రూ.300 కోట్లు ముట్టజెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హంగులు, ఆర్భాటాలకు కోట్లు
డబ్బులు లేవని రాజధాని నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తున్న చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం, సచివాలయంలోని పేషీ, ఇంటివద్ద ఏర్పాట్లు, విజయవాడలో క్యాంపు కార్యాలయం వంటి వాటికి హంగులు, ఆధునిక సదుపాయాల కోసం ఏకంగా రూ.వంద కోట్లు వెచ్చించడమంటే ఏ స్థాయిలో ఆర్భాటాలకు పోతున్నారో అర్థమవుతుంది. ఈ పనులన్నీ నామినేషన్ పద్ధతిలో అప్పగించి అందినకాడికి దోచుకున్నారన్న విమర్శలొచ్చాయి.

ఎలాంటి అధికారిక హోదా లేని లోకేశ్ అమెరికా పర్యటనకు వెళితే వెంట ఇద్దరు అధికారులను ప్రభుత్వ ఖర్చులతో పంపించడమే కాకుండా ఆ దేశ అధ్యక్షుడు ఒబామాతో ఫొటో దిగడానికి లక్షలు వెచ్చించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రమాణ స్వీకారం చేయడానికి రూ.30 కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు మళ్లీ ఏడాది తర్వాత అక్కడే మరో రూ.30 కోట్లతో బ్రహ్మాండమైన సభ నిర్వహిస్తున్నారు. ఇలా పాలన అంతా పైన పటారం లోన లొటారం అన్న చందంగానే సాగిందని విమర్శలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement