ఆన్లైన్ ద్వారానే లబ్దిదారులకు పెన్షన్లు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ దారులకు బ్యాంక్ ఖాతాల్లోకే నేరుగా ఆన్లైన్ ద్వారా పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఎంపీడీఓ, మునిసిపల్ కమిషనర్, డీఆర్డీఏ అ«ధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదని కలెక్టర్ తెలిపారు.
ఖాతాలు లేని లబ్దిదారులు పెన్షన్ కోసం సమీప బ్యాంకులో వెంటనే ఖాతా తెరిచే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బ్యాంకుల బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా, రూపే కార్డుల ద్వారా, ఈ–పాస్ మిషన్ల ద్వారా నగదును పెన్షన్‌దారులకు అందించే ఏర్పాట్లను చేయాలన్నారు. నేటి నుంచి జిల్లాలోని రేషన్ షాపులలో నగదు లేకుండా లావాదేవీలు జరుగుతాయని తెలిపారు.