ఐటీ వారికి మరో అవకాశమిచ్చింది
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల్లో భారీగా డిపాజిట్ చేసిన వారికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆ డిపాజిట్లపై ఫిబ్రవరి 10లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ తేదీలను ప్రభుత్వం ప్రస్తుతం పొడిగించింది. నగదు డిపాజిట్లపై అసెసీలు అందించాల్సిన వివరాల తేదీలను మరో ఐదు రోజుల పాటు అంటే ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. ''నగదు డిపాజిట్లపై ఆన్లైన్ స్పందనలు తెలిపే టైమ్ లిమిట్స్‌ను పొడిగిస్తున్నాం. ఇప్పుడు ఆపరేషన్ క్లీన్ మనీపై 2017 ఫిబ్రవరి 15 వరకు మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు'' అని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. జనవరి 31న ఆదాయపు పన్ను శాఖ ' ఆపరేషన్ క్లీన్ మనీ' ని ప్రారంభించింది.
దీని కింద పెద్ద నోట్ల రద్దు అనంతరం నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో రూ.5లక్షలకు పైబడిన అనుమానస్పద డిపాజిట్లపై రూ.18 లక్షల మంది అసెసీలకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా వివిధ ప్రశ్నలను ఆదాయపు పన్నుశాఖ సంధించింది. వీరిని ఐటీ డిపార్ట్మెంట్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సమాధానాలు తెలుపాలని ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీ మొత్తంలో బ్యాంకుల్లో డిపాజిట్ అయిన సంగతి తెలిసిందే. రూ.2 లక్షల నుంచి రూ.80 లక్షల వరకున్న డేటాను, రూ.80 లక్షలకు పైనున్న డేటాను ప్రభుత్వం విభజించింది. నగదు డిపాజిట్ల డేటానే, అసెసీ ప్రొఫైల్స్‌తో ఆదాయపు పన్ను శాఖ సరిపోలుస్తూ... వాటిలో అనుమానస్పద డిపాజిట్లు ఏమైనా తేలితే వారికి ఎస్ఎంఎస్, ఈ-మెయిల్స్ ద్వారా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తోంది.