Online video games
-
ఆన్లైన్ గేమ్స్ వద్దన్నందుకు డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ముదిగుబ్బ: ఆన్లైన్ గేమ్స్ ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొన్నాయి. వివరాలు.. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం గుట్టకిందపల్లికి చెందిన సంతోష్‌కుమార్(20) డిగ్రీ చదువుతున్నాడు. మొబైల్లో ఆన్లైన్ గేమ్‌లకు బానిసై డిగ్రీ సెకండియర్ మధ్యలోనే మానేశాడు. ఇంటివద్దే ఉంటూ ఆన్లైన్ వీడియో గేమ్‌లు ఆడేవాడు. ఈ విషయమై తల్లిదండ్రులు గురువారం సంతోష్‌ను నిలదీశారు. చదువులు మానేసి ఆన్లైన్ గేమ్‌లు ఆడుతూ కూర్చొంటే ఎలా బతుకుతావంటూ మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన సంతోష్ పురుగుమందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి సంతోష్ మృతిచెందాడు. పట్నం ఎస్ఐ సాగర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆన్లైన్లో ఆటలొద్దు
పంజాబ్‌లో 17 ఏళ్ల బాలుడు ఇటీవల పబ్జీ గేమ్ ఆడుతూ రూ.16 లక్షలు పోగొట్టుకున్నాడు. గేమ్‌లో తాను ఎంపిక చేసుకున్న పాత్ర(యానిమేషన్ బొమ్మ)కు కాస్మోటిక్ ఐటెమ్స్, గన్స్,టోర్నమెంట్ పాస్, రాయల్‌పాస్,రంగు రంగుల డ్రెస్‌ల కోసం తల్లితండ్రుల డెబిట్ కార్డులతో డబ్బులు చెల్లించాడు. విత్‌డ్రా అయినట్టు వచ్చిన మెసేజ్‌లను తల్లిదండ్రులకు తెలియకుండా డిలీట్ చేశాడు. ఉద్యోగి అయిన తన తండ్రి వైద్య ఖర్చుల కోసం తెచ్చుకున్న ప్రావిడెంట్ ఫండ్ రూ.16 లక్షలను కొడుకు ఇలా సైబర్ నేరగాళ్ల పాలు చేశాడు. సాక్షి, అమరావతి: ఆన్లైన్ గేమ్స్ మనకు తెలియకుండానే జేబులు గుల్ల చేస్తూ బతుకు చిత్రాలను తల్లకిందులు చేస్తున్నాయి. ఎక్కడో పొరుగు దేశాల్లో ఉండే గేమ్స్ నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా ఆకట్టుకుని అందినంత కాజేస్తుండటంతో సరికొత్త సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. అసలే కరోనా నేపథ్యంలో ఇంటి పట్టునే ఉంటున్న పిల్లల నుంచి పెద్దల వరకు తెలిసీ తెలియక ఆన్లైన్ గేమ్‌లకు బానిసలై ఏ మాత్రం అవగాహన లేని లింక్‌లు క్లిక్ చేయడం, బ్యాంకు డీటైల్స్ ఇవ్వడం, ఓటీపీలు ఎంటర్ చేయడం వంటి అనేక స్వయం కృతాపరాధాలతో డబ్బులు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. వీడియో గేమ్స్ పేరుతో ఎర ► ఇంటిపట్టునే ఉంటున్న పిల్లలు ఫ్రీఫైర్, పబ్జీ, ఫోర్ట్‌నైట్, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి ఆన్లైన్ గేమ్స్‌కు.. పెద్దలు ఆన్లైన్ రమ్మీ(పేకాట)కి ఆకర్షితులవుతున్నారు. ► ఈ వీడియో గేమ్స్‌లో ఒకేసారి వివిధ ప్రాంతాల నుంచి ఆన్లైన్లో 50 మంది నుంచి 100 మంది వ్యక్తులు వారు ఎంపిక చేసుకున్న క్యారెక్టర్ల (యానిమేటెడ్ బొమ్మలు) రూపంలో అధునాతన ఆయుధాలతో కదులుతూ పోరాడుతారు. ► గేమ్‌ను బట్టి ఒక్కొక్కరు సుమారు రూ.100 నుంచి రూ.5 వేల వరకు ఆన్లైన్లో ఎంట్రీ ఫీజుగా చెల్లిస్తారు. వీరందిరిలో వీడియోగేమ్ నిర్ధేశించిన క్యారెక్టర్లు ఒకరికొకరు గన్ ద్వారా కాల్చుకుంటారు. చివరలో మిగిలిన ముగ్గురు విజేతలకు బహుమతులు ఇస్తారు. పిల్లల బలహీనతలే వారి బలం ► ఆన్లైన్ గేమ్‌లను పిల్లలకు, యువతకు ఆసక్తికరంగా మలిచి ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్, ఈ మెయిల్ ఐడీ, ప్రత్యేక యాప్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ► పిల్లలు, యువతలోని బలహీనతను గమనించి వీడియో గేమ్‌లలో వారు ఎంపిక చేసుకున్న పాత్ర (యానిమేషన్) బొమ్మలకు ఆకర్షణీయమైన వస్త్రధారణ, అధునాతన ఆయుధాల కొనుగోలుకు డబ్బులు ఆన్లైన్లో చెల్లించేలా నిబంధన పెడతారు. ఈ పాత్రలను రాయల్‌పాస్ ఆటగాళ్లుగా పిలుస్తారు. ► చాలా మంది పెద్దలు ఆన్లైన్లో జంగల్ రమ్మీ, క్లాసిక్ రమ్మీ, ప్లే రమ్మీ, ఏసి ఈ టూ త్రీ డాట్ కామ్, పేటీఎం, ఫస్ట్ గేమ్స్ డాట్ కాం, డక్కన్ రమ్మీ డాట్ కాం వంటి వెబ్సైట్లలో పేకాట ఆడుతూ జేబుకు చిల్లు పెట్టుకుంటున్నారు. 20 రోజుల్లో రూ.5.40 లక్షలు హుష్ అమలాపురం టౌన్ : తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో 9వ తరగతి విద్యార్థి 20 రోజులపాటు సరదాగా తన తల్లి షేక్ రజియా బేగం స్మార్ట్ ఫోన్ ద్వారా ఆడిన ఆన్లైన్ గేమ్ రూ.5.40 లక్షలు దోపిడీకి గురయ్యేలా చేసింది. తండ్రి కువైట్‌లో ఉంటున్నాడు. తల్లికి పెద్దగా చదువురాదు. ఈ బాలుడు ‘ఫ్రీ ఫైర్’ అనే ఆన్లైన్ వీడియో గేమ్ యాప్‌ను ఓపెన్ చేశాడు. అందులో వెపన్స్ కొనాలంటే నిర్దేశించిన లింక్ ఓపెన్ చేసి తన తల్లి డెబిట్ కార్డుల వివరాలు ఇచ్చాడు. దీంతో సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ద్వారా సొమ్ము కాజేశారు. దిక్కుతోచని ఆమె తన కుమారుడిని వెంటబెట్టుకుని వెళ్లి సోమవారం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా వద్ద గోడు వెళ్లబోసుకుంది. కృష్ణా జిల్లా నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తున్న గుండ్ర రవితేజ ఆన్లైన్లో రమ్మీ(పేకాట), క్యాసినో ఆటలతో చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. చివరకు బ్యాంకులో డిపాజిట్ల రూపంలో ఉన్న రూ.1,56,56,587 డబ్బును కాజేశాడు. ఆ డబ్బునూ ఆటల్లో పెట్టి పోగొట్టుకున్నాడు. తుదకు ఇతనిపైనే కేసు నమోదైంది. ఆన్లైన్ గేమ్స్‌లో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. ఈ తరహా నేరగాళ్లను పట్టుకోవడం క్లిష్టంగా మారుతోంది. ఒకవేళ పట్టుకున్నా, చట్టపరంగా కఠిన శిక్షలు లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ గేమ్స్ నిషేధించేలా, సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలని ప్రతిపాదన చేశాం. పిల్లల ఆటల పట్ల పెద్దలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. – సునీల్‌కుమార్ నాయక్,డీఐజీ, సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం -
వీడియో గేములతోనూ గాలం!
సాక్షి, హైదరాబాద్: శతకోటి దరిద్రాలకు.. అనంతకోటి ఉపాయాలు అన్న సామెత సైబర్ నేరగాళ్ల విషయంలో సరిగ్గా సరిపోతుంది. టిక్‌టాక్ ప్రో, చాక్లెట్ బాక్సులు, ప్రేమపెళ్లి అంటూ రకరకాల కారణాలతో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసే సైబర్ నేరగాళ్లు మరో కొత్త ఎత్తుగడ ఎంచుకున్నారు. చిన్నారులు అమి తంగా ఇష్టపడే ఆన్లైన్ వీడియో గేముల్లోనూ తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉచితం పేరుతో మాల్వేర్ లింకులు.. సాధారణంగా పిల్లలు షూటింగ్ గేమ్‌లను ఇష్టపడతారు. అందులో రకరకాల స్టేజీలు ఉంటాయి. తరువాత స్టేజ్‌లోకి వెళ్లాలంటే.. నిర్దేశిత పాయింట్లు సాధించాలి లేదా ఆయుధాలు పొందాల్సి ఉంటుంది. ఒకవేళ సరైనన్ని పాయింట్లు, ఆయుధాలు లేకపోతే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆన్లైన్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లోసుగునే సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అలా గేమ్‌లు ఆడే చిన్నారులకు సైబర్ నేరగాళ్లు మాల్వేర్ను ఉంచిన లింకులను పంపుతున్నారు. సదరు లింకులను క్లిక్ చేస్తే.. ఉచితంగా పాయింట్లు, ఆయుధాలు పొందవచ్చని ఎరవేస్తున్నారు. ఇవేమీ తెలియని చిన్నారులు, విద్యార్థులు వాటిని క్లిక్ చేసి గేమ్‌లో ముందుకు పోతున్నారు. కానీ, మొత్తం మొబైల్‌ను వారి చేతికి ఇచ్చేశాం అన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్‌లో జొరబడిన మాల్వేర్ పనిచేయడం మొదలుపెడుతుంది. బ్యాంకు ఖాతాల వివరాలతోపాటు, వ్యక్తిగత వివరాలు క్షణాల్లో సైబర్ నేరగాళ్ల చేతికి చేరుతాయి. వారు అంతేవేగంగా స్మార్ట్‌ఫోన్‌కు లింక్ అయి ఉన్న ఖాతాల్లోని మొత్తం నగదును మాయం చేస్తారు. ఈ సమయంలో నగదును కొట్టేసినట్లు మన మొబైళ్లకు ఎలాంటి సందేశాలు రావు. దీంతో ఈ విషయం తెలిసే సరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. అందుకే, వీడియోగేమ్‌లు ఆడుకునేందుకు పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇచ్చే తల్లిదండ్రులు ఈ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
ఆన్లైన్ గేమ్స్ కోసం..విస్తుపోయే ఘటన
లక్నో : ఆన్లైన్ వీడియో గేమ్స్ కోసం ఓ బాలుడు ఏకంగా తండ్రి పేరిట పేటీఎం ఖాతాను క్రియేట్ చేసి రూ 35,000 తస్కరించిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమ్స్‌కు బానిసైన నాలుగవ తరగతి చదివే బాలుడు తన తండ్రి మొబైల్ ఫోన్లో పేటీఎం ఖాతాను తెరిచి పెద్దమొత్తంలో డబ్బును విత్‌డ్రా చేశాడు. తన ఖాతాలో తనకు తెలీకుండా లావాదేవీలు జరగడంతో సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేసిన బాధితుడికి తన కుమారుడే ఈ తతంగం నడిపించినట్టు తేలడంతో విస్తుపోయారు. దర్యాప్తు చేపట్టినప్పుడు పోలీసులతో పాటు తండ్రికి సైతం తమ చిన్నారిపై ఎలాంటి అనుమానం రాలేదు. లావాదేవీలపై ఎక్కడా ఆధారాలు లభించకపోవడంతో బాలుడిని ప్రశ్నించగా తాను చేసిన నిర్వాకం బయటపెట్టాడని పోలీసులు తెలిపారు. పలు ఆన్లైన్ వీడియో గేమ్‌లను డౌన్లోడ్ చేసుకునే సమయంలో కొంతమొత్తం చెల్లించడం తప్పనిసరి కావడంతో తండ్రి మొబైల్ నుంచి పేటీఎం ఖాతాను క్రియేట్ చేసి దాన్ని ఆయన బ్యాంకు ఖాతాకు లింక్ చేశాడు. వీడియో గేమ్స్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో పేటీఎం వ్యాలెట్ ద్వారా డబ్బు చెల్లించేవాడు. ఇలా రూ 35,000 వరకూ తండ్రి ఖాతా నుంచి ఆన్లైన్ గేమ్స్‌కు వెచ్చించాడు. అయితే తన ఖాతా నుంచి ఆయా మొత్తం తగ్గుతుండటంపై తండ్రికి అంతుపట్టకపోవడంతో బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా ఆయన సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆరా తీయడంతో తానే ఇదంతా చేశానని చెప్పిన బాలుడు తన తండ్రి తనను శిక్షిస్తాడని భయపడ్డాడు. హజరత్‌గంజ్ పోలీసులు, సైబర్ సెల్ పోలీసులు బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం ఇంటికి పంపారు. -
లైఫ్‌తో వీడియోగేమ్
గతంలో మాదిరిగా ఇప్పుడు పేకాట క్లబ్‌లు పెద్దగా నడవట్లేదు. ఇళ్లలో, పనిచేసే కార్యాలయాల్లో, దుకాణాల్లో, బజారులో ఎక్కడంటే అక్కడ కూర్చుని సెల్ఫోన్లో పేకాట (రమ్మీ) ఆడుతున్నారు. పేకాట ఆడేవాళ్లను ఆకర్షిస్తూ అందర్నీ కలిపి ఓ ప్లాట్‌ఫాంగా మార్చారు. పేకాటరాయుళ్లు, రమ్మీలో సత్తా చాటాలనుకునే వారు అటు చూస్తున్నారు. మొదట్లో డబ్బులు బాగానే వచ్చినా తరువాత నుంచి జేబులు ఖాళీ చేస్తున్నారు. ఆన్లైన్ రమ్మీ ఆడాలనుకునే వారి బ్యాంకు ఖాతాల నుంచి పందానికి సరిపోయే నగదును ముందుగా సర్దుబాటు చేసుకుంటున్నారు. తరువాత పందెం వస్తే డబ్బులు వేయడం లేదంటే వెనక్కి లాక్కోవడం ఉంటుంది. సాక్షి, విశాఖపట్నం : ఉదయం లేచిన దగ్గర నుంచి తిరిగి నిద్రపోయే వరకు రోజులో 40 నుంచి 60 శాతం చాలా మంది చేతుల్లో సెల్‌ఫోన్ ఉంటుంది. స్మార్ట్ఫోన్లు పట్టుకుని ఈ లోకంలో లేనట్లు, తమదైన లోకంలో ఉన్నట్లుగా వీడియో గేమ్‌లు ఆడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒక రోజు వీడియో గేమ్ ఆడకుంటే ఏదో కోల్పోయామనే భావన వారిలో నెలకుంటోంది. పిల్లలు కార్టూన్ నెట్‌వర్క్‌తో పాటు వీడియో గేమింగ్‌కు బానిసలుగా మారుతుంటే, పెద్దలు, ఉద్యోగులు గృహిణులు సైతం ఆ ఆటల్లో లీనమైపోతున్నారు. సెల్‌ఫోన్ పట్టుకుని నిద్రాహారాలు మాని వీడియో గేమ్‌లు ఆడేవారు ప్రతి ఇంట్లోనూ ఉంటున్నారు. వారి జీవనశైలి మిగిలిన వారిపై ప్రభావం చూపించడమే కాకుండా పెద్దల్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది. నగరంలో మానసిక వైద్య నిపుణుల వద్దకు వెళ్లే కేసుల్లో వీడియో గేమింగ్ వ్యసనంతో అనారోగ్యం బారిన పడిన వారే ఎక్కువ మంది ఉంటున్నారు. తెరపై ఆటలు అనారోగ్యానికి బాటలు వేస్తున్నాయని తెలిసినా చాలా మంది ఆ ఉచ్చులో పడుతున్నారు. బ్లూవేల్ గేమ్ చాలామంది ప్రాణాల్ని తోడేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఆటను నిషేధించారు. పబ్జీ అనే ఆట ఇప్పుడు ఎక్కువ మందిని ప్రభావితం చేస్తోంది. ఈ ఆట ప్రపంచం ప్లాట్ ఫాంగా నడుస్తోంది. ఆటలో తోటివారు సాయం చేయకపోయినా, తుపాకీ సాయంగా ఇవ్వకపోయినా నేరుగా చిరునామా తీసుకుని దాడులకు తెగబడుతున్న సంఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. గేమింగ్ బానిసల లక్షణాలివి.. ఇతర పనుల కన్నా మొబైల్ లేదా వీడియో గేమ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం మొబైల్ లేదా వీడియో గేమ్ చేతిలో ఉంటే గేమ్స్ ఆడాలనే కోరికను ఆపుకోలేకపోవడం గేమ్ ఆడుతున్న ప్రతిసారీ ఆనందాన్ని పొందుతుండడం గేమ్ ఆడడం మొదలెట్టాక, దాన్ని ఎప్పుడు ఆపాలో తెలుసుకోలేకపోవడం గేమ్ ఆడడం వల్ల చదువు, ఉద్యోగం లేదా ఇతర పనులపై చెడు ప్రభావం ఎవరైనా 12 నెలల కంటే ఎక్కువ కాలం ఇలా ఉన్నప్పుడు డాక్టర్ సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. సీఎం సీరియస్.. ఆన్లైన్ రమ్మీని ఇప్పటికే తెలంగాణలో నిషేధించారు. మన రాష్ట్రంలో కూడా ఆన్లైన్ రమ్మీని నిషేధం చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లాలోని చాలా మంది యువకులు, ఉద్యోగులు ఈ గేమ్ బారిన పడి రూ.లక్షలు పోగొట్టుకున్నారు. ఆన్లైన్ ఆట నిర్వహణకు వేదిక ఏర్పాటు చేసిన వారిని పట్టుకుంటే ఈ ఆటకు చెక్ పెట్టి వ్యసనం నుంచి చాలా మందిని కాపాడేందుకు అవకాశముంటుంది. పిల్లల వద్ద పెద్దలు సరదాకు కూడా ఈ ఆట ఆడవద్దని మానసిక వైద్య నిపుణుల హెచ్చరిస్తున్నారు. ఈ గేమ్‌పై పోలీసుల నిఘా లేకపోవడంతో సెల్‌ఫోన్, కంప్యూటర్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లలో ప్రత్యక్షమవుతోంది. ఏం చేయాలి వీడియో గేమింగ్ నుంచి బయటడేందుకు పాఠశాల నుంచి పిల్లలు రాగానే సెలవులు, ఖాళీ సమయాల్లో టీవీ, సెల్ఫోన్ల వద్దకు పంపించకుండా కాసేపు సరదాగా ప్రకృతిలోకి తీసుకెళ్లి వారితో ఆటలు, క్రీడలు, సంగీతం, నృత్య సాధన చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. పుస్తక పఠనం ముఖ్యంగా వేమన పద్యాలు చదివించడం, మహానీయుల స్ఫూర్తిగాథలు చదివించడం, ఉప కరణాలతో బోధన చేయాలి. ఎన్సీఆర్టీఈ అమలుచేసే జ్ఞానదర్శిని, ఇస్రోకు చెందిన విజ్ఞాన్‌ప్రసార్, జపాన్‌కు చెందిన ఎన్‌హెచ్‌కే టీవీ చానళ్లు చూపించాలి. గేమింగ్ బాధితుల చికిత్స కోసం మానసికవేత్తలు, మానసిక వైద్య నిపుణుల సాయం తీసుకోవాలి. ఇద్దరూ ఒకే సమయంలో చికిత్స చేయడం వల్ల రోగిలో త్వరగా మార్పు కనిపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా 6–8 వారాల్లో ఈ గేమింగ్ వ్యసనం వదిలిపోతుంది. అసలు దీని నుంచి బయటపడే కారణాలను వివరిస్తూ, అసలు గేమ్స్ ఆడడం అలవాటు చేయకపోవడమే మంచిదని నిపుణులు సలహా చేస్తున్నారు. -
ఆన్లైన్ గేమ్స్ తో మెదడుకు పదును!
సిడ్నీః ఇటీవల పెద్దా చిన్నా తేడాలేకుండా అందరూ స్మార్ట్ ఫోన్లతో బిజీగా కనిపిస్తున్నారు. వారిలో ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉన్నవారు ఫేస్ బుక్, వాట్సాప్, ఈ మెయిల్ వంటి వాటికి అతుక్కుపోతున్నారు. అయితే సోషల్ మీడియాతో కాలం గడపడం ప్రతికూల ప్రభావాలను తెచ్చిపెడుతుందని, అంతకంటే ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడటం కొంతవరకూ ఉపయోగపడుతుందని చెప్తున్నారు పరిశోధకులు. ఆన్లైన్ వీడియో గేమ్స్ విద్యార్థుల్లో మెదడుకు పదును పెడతాయని, లెక్కలు, సైన్సు వంటి సబ్జెక్లుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు తోడ్పడతాయని తాజా అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. ఆటలు పిల్లలకు ఆరోగ్యాన్నిస్తాయన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ప్లేగ్రౌండ్స్ కు వెళ్ళి, ఆటస్థలాల్లోనూ ఆడుకునే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా చదువుకునే పిల్లలు కాస్త ఖాళీ దొరికితే టీవీల ముందు కూర్చోవడమో, స్మార్ట్ ఫోన్లు, మీడియాతో కాలక్షేపం చేయడమో చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా కంటే విద్యార్థులు వీడియో గేమ్స్ ఆడటం కొంతవరకూ పనికొస్తుందని చెప్తున్నారు తాజా అధ్యయనకారులు. ఆన్లైన్ వీడియో గేమ్స్ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని, విద్యార్థుల్లో నైపుణ్యం పెరిగే అవకాశం ఉందని, చెప్తున్నారు. దాదాపు ప్రతిరోజూ ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడే విద్యార్థులు మిగిలిన వారితో పోలిస్తే గణితంలో 15, సైన్స్ లో 17 పాయింట్లు సగటున ఎక్కువగా స్కోర్ చేయగల్గుతున్నట్టు అధ్యయనాల్లో తెలుసుకున్నారు. ముఖ్యంగా టీనేజర్లు ఆన్లైన్ గేమ్స్ ఆడటం, వాటిలోని పజిల్స్ పూర్తి చేయడం, నెక్స్ట్ లెవెల్ కు చేరుకోవడం వల్ల జనరల్ నాలెడ్జ్ పెరగడంతోపాటు, గణితం, సైన్సు వంటి సబ్జెక్టుల్లో మరింత నైపుణ్యాన్ని సంపాదించే అవకాశం ఉంటుందని ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఆర్ఎంఐటీ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆల్బెర్టో పోసో చెప్తున్నారు. క్రమం తప్పకుండా సోషల్ మీడియా సైట్లు ఫాలో అయ్యేవారు పాఠశాల ఫలితాల్లో వెనుకబడి ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రతిరోజూ ఫేస్ బుక్, ఛాట్ తో కాలం గడిపేవారు మిగిలిన వారితో పోలిస్తే మాథ్స్ లో 20 పాయింట్ల వరకూ వెనుకబడి ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే టీచర్లు విద్యార్థులకు ఉపయోగపడే వీడియో గేమ్స్ ద్వారా బోధిస్తే.. వారికి కొంత వరకూ ఉపయోగకరంగా ఉండటంతోపాటు..సోషల్ మీడియా ప్రభావం వారిపై పెద్దగా ఉండదని సూచిస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్ తో పరిచయం ఉన్న, 15 సంవత్సరాల వయసున్న 12,000 మంది విద్యార్థులపై నిర్వహించిన పరిశోధనల వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనికేషన్ లో నివేదించారు.