open SSC
-
ఒకటో తేదీ నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 1 నుంచి 14 వరకు ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు గురువారం తెలిపారు. 57 కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యేందుకు 17,490 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. 67 కేంద్రాల్లో నిర్వహించే ఎస్సెస్సీ పరీక్షలకు 20,659 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. హాల్‌టికెట్లను telanganaopenschool.org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. మొదటి రోజు పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని, ఉదయం 9.35 గంటల తర్వాత, మధ్యాహ్నం పరీక్షకు 2.05 గంటల తర్వాత పరీక్ష హాల్లోకి అనుమతించబోమని వెల్లడించారు. రెండో రోజు నుంచి 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష రాసేందుకు రైటింగ్ ప్యాడ్, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేల్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని చెప్పారు. -
ఓపెన్ ప్రవేశాలకు 12 వరకు గడువు
బషీరాబాద్: ఒపెన్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నామని బషీరాబాద్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సప్ప మంగళవారం పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువులను మధ్యలో నిలిపేసిన విద్యార్థులు ఓపెన్ ద్వారా చదువుకునేందుకు ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి అవకాశం కల్పించిందని, అర్హులైన వారు ఈనెల 12వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. -
ఐదు నిమిషాలు దాటితే నో ఎంట్రీ
నేటి నుంచి ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు విద్యారణ్యపురి : ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు జరగనున్నారుు. జిల్లాలో 4,273మంది ఎస్సెస్సీ పరీక్షలు, 7,730 మంది ఇంటర్ పరీక్షలు రాయనుండగా, ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ పి.రాజీవ్, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ శంకర్రావు తెలిపారు. అన్ని పరీక్షలకు కలిపి 30 కేంద్రాలు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. కాగా, ఉదయం 9-30గంటల పరీక్షలు ప్రారంభం కానుండగా, గంట ముందు నుంచే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తామని, నిర్దేశిత సమయం తర్వాత ఐదు నిమిషాలు దాటినా లోపలకు రానివ్వమని స్పష్టం చేశారు. కాగా, పరీక్షలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌లు, డీవోలను ఆదేశించామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుందని, విద్యార్థులు బ్లూ లేదా బ్లాక్ పెన్లనే వినియోగించాలని సూచించారు. విద్యార్థులు హాల్‌టికెట్ తప్ప ఎలాంటి కాగితాలు తీసుకురావొద్దని, సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, బ్లూ టూత్ తదితర పరికరాలు అనుమతించేది లేదని డీఈఓ, కోఆర్డినేటర్ స్పష్టం చేశారు. కాగా, పరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు ఫ్లరుుంగ్ స్క్వాడ్లను నియమించినట్లు వివరించారు. -
మార్చి 28 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
వచ్చే నెల 11 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్షలను వచ్చే మార్చి 28 నుంచి ఏప్రిల్ 19 వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 11లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఒక్కో పేపరుకు రూ.25 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 12 నుంచి 17 వరకు, రూ.50 ఆలస్య రుసుముతో వచ్చే నెల 18 నుంచి 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. మీసేవా లేదా ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లోనే పరీక్ష ఫీజు చెల్లించాలని వివరించారు. -
ముగిసిన ఎంబీబీఎస్ సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీ శుక్రవారం ముగిసింది. రెండో విడత కౌన్సెలింగ్ తొలిరోజు మొత్తం 753 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే తొలివిడతలో మిగిలిపోయిన 74 ఎంబీబీఎస్ సీట్లు మొదటి రోజే భర్తీ అయ్యాయి. ఇక బీడీఎస్‌లో భర్తీ అయిన సీట్లు పోనూ ఇంకా 78సీట్లున్నాయి. వీటికి శనివారం కౌన్సెలింగ్ జరుగనుంది. ఐసెట్ కౌన్సెలింగ్ పూర్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టిన ఐసెట్ చివరి దశ కౌన్సెలింగ్ శుక్రవారంతో ముగిసినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ ప్రకటించారు. తొలి దశ కౌన్సెలింగ్‌లో 26,826 సీట్లకు 20,243 మంది కాలేజీల్లో చేరినట్లు పేర్కొన్నారు. చివరి దశ కౌన్సెలింగ్‌లో 6,583 సీట్లను కేటాయించగా 3,893 సీట్లు మిగిలిపోయాయన్నారు. చివరి దశ లో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 16లోగా ఫీజు చెల్లించి, కాలేజీల్లో ఈ నెల 12 నుంచి 16లోగా చేరాలని, అంతకంటే ముందుగా వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నారు. ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్‌కు చివరి అవకాశం హైదరాబాద్: ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజు తత్కాల్ కింద చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు ఈనెల 12 నుంచి 15లోగా పరీక్ష ఫీజుతోపాటు తత్కాల్ కింద అదనంగా రూ. 1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. -
మే 4 నుంచి ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు
హైదరాబాద్: ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలను మే 4 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు దశల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఇంటర్మీడియట్ జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 26 నుంచి 30 వరకు జరుగుతాయని తెలిపారు. విద్యార్థులు ఈ నెల 11 నుంచి 24 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. రూ. 25 ఆలస్య రుసుముతో ఈ నెల 25 నుంచి 30 వరకు, రూ. 50 రుసుముతో ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 4 వరకు చెల్లించవచ్చని వివరించారు. విద్యార్థులు మీ సేవ/ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లోనే ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.