ఆపరేషన్ ముగిసినట్లేనా?
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులను ఏరివేసే ఆపరేషన్ మొత్తం ముగిసినట్లేనా? ఇక అక్కడ ఉగ్రవాదులు ఎవరూ లేరని కచ్చితంగా నిర్ధారణకు వచ్చినట్లేనా? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనుకోవాలి. రక్షణమంత్రి మనోహర్ పారిక్కర్, ఆర్మీ చీఫ్‌తో పాటు ఎయిర్ చీఫ్ మార్షల్ కూడా మంగళవారం పఠాన్‌కోట్ వెళ్తున్నారు. ఇంత ఉన్నతస్థాయి బృందం అక్కడకు వెళ్తోందంటే.. ఆ ప్రాంతం మొత్తం క్లీన్‌గా ఉన్నట్లేనని సైనిక వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో మందుపాతరల లాంటివి ఏమైనా పెట్టారా అనే విషయం మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌బేస్ మొత్తం 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండటంతో.. ఈ మొత్తం ప్రాంతాన్ని గాలించడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టేలా ఉంది.
భద్రతా లోపాలు ఉన్నాయి..
కాగా, భద్రాతపరమైన లోపాల వల్లే ఈ ఉగ్రదాడి జరిగిందని కేంద్రం అంతర్గత సమావేశాల్లో అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. నిఘా హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదని, అలాగే అపహరణకు గురైన ఎస్పీ చెప్పిన విషయాన్ని కూడా సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే ఉగ్రవాదులు అక్కడివరకు రాగలిగారని అంటున్నారు. ఇందుకు బాధ్యులపై చర్యలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. మంగళవారం ఉదయం మరోసారి హోంశాఖ ఉన్నతాధికారులతో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.