opportunist politics
-
Gujarat Assembly Election 2022: ఆకాశంలో సగం.. అవకాశాలే గగనం!
ఆకాశంలో సగం అంటూ గొప్పగా కీర్తించడమే తప్ప రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు కల్పించడంలో మాత్రం పార్టీలు వెనుకంజ వేస్తున్నాయి. జనాభాలో దాదాపు సగం ఉన్న అతివలకు ఆ మేరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కడం లేదు. గుజరాత్లో శాసనసభ ఎన్నికల ముఖచిత్రం పరిశీలిస్తే నిరాశే మిగలడం ఖాయం. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా, మొత్తం 1,621 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో మహిళల సంఖ్య కేవలం 139 అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వీరిలో ఏకంగా 56 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తుండడం విశేషం. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 126 మంది మహిళలు పోటీకి దిగారు, 13 మంది విజయం సాధించారు. అప్పట్లో 104 మంది మహిళలు డిపాజిట్ సైతం కోల్పోయారు. ‘ఆప్’ నుంచి ఆరుగురు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌తోపాటు ఈసారి అదృష్టం పరీక్షించుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా మహిళలకు పరిమిత సంఖ్యలోనే టిక్కెట్లిచ్చాయి. ఈ మూడు పార్టీల నుంచి కేవలం 38 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 2017 ఎన్నికలతో పోలిస్తే ఈసారి వారి సంఖ్య పెరగడం కొంత ఊరటనిచ్చే విషయం. 2017లో బీజేపీ 12 మంది మహిళామణులకు టిక్కెట్లు ఇవ్వగా, ఈ ఎన్నికల్లో 18 మందికి అవకాశం కల్పించింది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే.. 2017లో 10 మందికి, ఇప్పుడు 14 మంది ఆ పార్టీ టిక్కెట్లు లభించాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దళిత, గిరిజన మహిళలకు టిక్కెట్లు ఇచ్చాయి. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మొత్తం 182 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. వీరిలో మహిళలు కేవలం ఆరుగురు. ఈ ఆరుగురిలో ముగ్గురు ఎస్టీ రిజర్వ్డ్ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. 13 స్థానాల్లో పోటీ చేస్తున్న ఆలిండియా మజ్లిస్ ఇత్తెహదూల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ చేస్తున్న ఇద్దరు మహిళలకు టిక్కెట్లు కేటాయించింది. వీరిలో ఒకరు ముస్లిం కాగా, మరో మహిళ దళిత వర్గానికి చెందినవారు. బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) 101 స్థానాల్లో పోటీ చేస్తోంది. 13 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. జాతీయ పార్టీ అయిన సీపీఎం ఒక మహిళా అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపింది. ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని టిక్కెట్లు బీజేపీకి 9 మంది మహిళా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా, ఈసారి ఐదుగురికి మొండిచెయ్యి చూపింది. నలుగురికి మరోసారి టిక్కెట్లు కేటాయించింది. కాంగ్రెస్‌కు నలుగురు మహిళా సిట్టింగ్ ఎమ్మెల్యేల ఉన్నారు. వీరిలో ఇద్దరికి మళ్లీ అవకాశం కల్పించింది. 2017 ఎన్నికల కంటే ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య పెరగడం సానుకూల అంశం. 2017లో బీజేపీ ఎస్సీ స్థానాల్లో ఇద్దరికి, ఎస్టీ స్థానాల్లో ఒక మహిళకు టిక్కెట్లు ఇవ్వగా, ఇప్పుడు ఎస్సీ స్థానాల్లో నలుగురికి, ఎస్టీ స్థానాల్లో ఇద్దరికి పోటీ చేసే అవకాశం కల్పించింది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎస్టీ మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. ఎస్సీలకు చోటు దక్కలేదు. ఈసారి నలుగురు ఎస్టీ, ఒక ఎస్సీ మహిళా అభ్యర్థి కాంగ్రెస్ టిక్కెట్లు దక్కించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముగ్గురు ఎస్టీ మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. బిల్లు ఆమోదం పొందితే.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితేనే ఎన్నికల్లో వారి సంఖ్య పెరుగుతుందని శాయాజీగంజ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమీ రావత్ చెప్పారు. ఉన్నత పదవుల్లో మహిళలను నియమించడంలో తమ పార్టీ ముందంజలో ఉందని గుజరాత్ బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలు దీపికాబెన్ సర్వాదా వెల్లడించారు. ఒక గిరిజన మహిళను తమ పార్టీ దేశ రాష్ట్రపతిగా ఎన్నుకుందని గుర్తుచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ పేటెంట్ కోసం పవన్ కల్యాణ్ పోటీ పడుతున్నారా!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తన చపల చిత్తం లేదా, అవకాశవాద రాజకీయం రెండిటిని బహిర్గతం చేసుకున్నారు. ఇంతకాలం ఇలాంటి రాజకీయాలకు పెట్టింది పేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారన్నది జనాభిప్రాయం. ఇప్పుడు ఆయనను దాటిపోయి, ఆ పేటెంట్‌ను తాను పొందాలన్న తాపత్రయంలో పవన్ ఉన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఆయన లక్ష్యమని ఆయన చెప్పారు. నిజానికి గత ఎన్నికలలో జనసేనకు ఒక్క సీటు మాత్రమే ఇచ్చి, మిగిలిన అన్ని చోట్ల ప్రజలు ఓడించారు. చివరికి పవన్ కల్యాణ్ రెండుచోట్ల పోటీచేసి పరాజయ పరాభవాన్ని ఎదుర్కున్నారు. అంటే దాని అర్థం ఏపీని జనసేన బారిన పడకుండా ప్రజలు విముక్తి చేశారని అనుకోవాలా? చదవండి: టీచర్ల సంఘాలే రాజకీయం చేస్తున్నాయి అయినా టీడీపీ అండతోనో, టీడీపీ మద్దతు మీడియాతోనో పవన్ కల్యాణ్ చెలరేగిపోవాలని తంటాలు పడుతున్నారు. ఆ క్రమంలో ఆయన అనేక కప్పగంతులు వేస్తున్నారు. కప్ప ఉభయచరం అన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కూడా తానూ తీసిపోలేదని నిరూపించుకుంటున్నారు. కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న ఉపన్యాసాలు, చెబుతున్న మాటలు పరిశీలిస్తే ఈయన అంత పవర్ ఫుల్ అయిపోయారా? అన్న డౌటు వస్తుంది. కాని తను అంత శక్తిమంతుడు కాలేదని మళ్లీ ఆయనే చెబుతారు. తిరుపతిలో పవన్ కల్యాణ్ ఏమి మాట్లాడారు. తాము తెలుగుదేశంను మోయడానికి లేమని అన్నారు. టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి రావాలని అన్నారు. ఓహో టీడీపీకి ఆయన దూరం అవుతున్నారేమోలే అనుకున్నవారూ ఉన్నారు. మరి అంతలోనే ఏమైందో, మరుసటి రోజు విజయవాడలో మాట మారిపోయింది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని, ఆ నినాదంతో పనిచేస్తామని అంటూ మళ్లీ మూడు ఆప్షన్లను ప్రస్తావించారు. అందులో మొదటి ఆప్షన్‌గా టీడీపీ, జనసేన కలిసే అవకాశం ఉందని చెప్పారనిపిస్తుంది. బీజేపీ నేతల ప్రమేయం లేకుండానే ఆ పార్టీ కూడా టీడీపీ, జనసేనలతో కలిసే అవకాశం ఉందని మరో ఆప్షన్ లో చెబుతారు. ఈ రెండు కాకపోతే బీజేపీ, జనసేనలు ఎటూ కూటమిగా ఉన్నాయన్నది ఆయన చివరి ఆప్షన్. దీనిని బట్టి ఏమి అర్థం అవుతుంది. ఎలాగైనా టీడీపీతో జతకట్టి కొన్ని సీట్లు అయినా గెలవాలన్న తహతహ స్పష్టంగా తెలుస్తూనే ఉంది. మరి ఇందుకోసం గతంలో ఆయన ఏమన్నారు. తాను ఎవరి పల్లకి మోయడానికి లేనని, ఈసారి తమ పొత్తు కోరుకునేవారు త్యాగాలకు సిద్ధపడాలని చెప్పారు. అధికారం వస్తే సీఎం సీటు తమకే ఇస్తామని హామీ ఇవ్వాలన్న కండిషన్‌ను టీడీపీకి పరోక్షంగా పెట్టారు. కాని ఇప్పుడు ఆ షరతును తుంగలో తొక్కినట్లుగా ఉన్నారు. పవన్ కల్యాణ్ తాను సీఎం పదవికి సరిపోనన్న అభిప్రాయానికి వచ్చారా? లేక అది ఎలాగూ దక్కదులే అన్న భావనలో ఉన్నారా? ఒకవేళ నిజంగానే ఆయన సీఎం పదవిపై పట్టుదల ఉంటే తన కండిషన్‌కు కట్టుబడి రాజకీయం చేయాలి కదా? ఏదో ఒక ప్రకటన చేయడం.. ఆ తర్వాత జారిపోవడం ఆయనకు మామూలు అయిపోయింది. వైసీపీపైన అనేక ఆరోపణలు అనండి.. అభాండాలనండి.. వేయడానికి ఏ మాత్రం జంకడం లేదు. ఆయన కోపం అంతా, ద్వేషం అంతా ముఖ్యమంత్రి జగన్ మీదే. జగన్ ను సీఎం సీటులో చూసి ఓర్చుకోలేకపోతున్నారు. తనకు కూడా అధికారం చేయాలన్న కోర్కె ఉంటే అది తప్పు కాదు. కాని ఎంతసేపూ ఎవరో ఒకరిపై ఆధారపడకుండా, జనంలో నిత్యం తిరిగి, తన ఎజెండా ఏమిటో చెప్పి ప్రజల ఆదరణ పొందాలి తప్ప, ఉట్టి శాపాలు పెడితే అధికారం వస్తుందా? లేదూ టీడీపీ అధినేత చంద్రబాబునో, లేక ఆయన కుమారుడు లోకేష్‌నో ముఖ్యమంత్రి చేయాలని ఉంటే అదే తన లక్ష్యమని నేరుగా చెబితే పెయిర్‌గా ఉంటుంది. ఇంతవరకు వైసీపీ నేతలు చేసే ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పలేకపోతున్నారు. చంద్రబాబును గతంలో ఎన్నో రకాలుగా విమర్శించారు. వాటన్నిటిని మర్చిపోతే పోవచ్చు. దానికి కేసీఆర్ గతంలో కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ను విలీనం చేస్తానని చెప్పి, ఆ తర్వాత ఒంటరిగా పోటీచేయలేదా అని అడుగుతునారు. మోదీ, చంద్రబాబులు కలవలేదా అని అంటున్నారు. పవన్ కల్యాణ్ ఏమన్నా అర్ధవంతంగా మాట్లాడుతున్నారా? సోనియాగాంధీ తెలివి తక్కువతనంగా టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేసుకోలేదు. ఇందులో కేసీఆర్ తప్పు లేదన్న సంగతి పవన్‌కు తెలియకపోవచ్చు. ఇక మోదీ, చంద్రబాబు ఎదురుపడినప్పుడు నిలబడి కొద్ది నిమిషాలు మాట్లాడితే అదేదో పెద్ద భేటీలా పవన్ ఫీల్ అవుతున్నారు తప్ప, చంద్రబాబుకు అది అవమానం అన్న సంగతిని ఆయన విస్మరిస్తున్నారు కులం గురించి ఆయన ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాట్లాడారో రాయాలంటే విసుగు వస్తుంది. ఏపీలో కనీసం కులభావన అన్నా ఉండాలి.. కాపులు కూడా తనకు ఓటేయరా అని ప్రశ్నించారు. ఇప్పుడే ఏపీలో కులరాజకీయం పెరిగిపోయిందని అంటారు. జనసేన కులాలకు అతీతం అని సుద్దులు చెబుతారు.. మరో విషయం. తన దిక్కుమాలిన రాజకీయం కోసం తన సోదరుడైన మెగాస్టార్ చిరంజీవిని అవమానించడానికి కూడా పవన్ కల్యాణ్ వెనుకాడకపోవడం దురదృష్టకరం. తనను జగన్ చాలా గౌరవించారని చిరంజీవి చెబుతుంటే, జగన్ అవమానించారని పదేపదే ప్రచారం చేస్తూ పరువు తీస్తున్నారు. ఆ మాటకు వస్తే సోషల్ మీడియాలో చంద్రబాబు ఎదుట, కేసీఆర్ ఎదుట పవన్ కల్యాణ్ చేతులు కట్టుకుని నిలుచుని ఉన్న ఫోటోలు సర్కులేట్ అవుతున్నాయి. వ్యక్తిగతంగానే కాకుండా, విధానపరంగా కూడా పవన్ కల్యాణ్ చేసినన్ని విన్యాసాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో మరెవరూ చేసి ఉండరు. అమరావతి రాజధాని అంశంపై ఒకసారి ఇది కొందరి కోసం, ముఖ్యంగా తెలుగుదేశం వారి కోసం ఏర్పడిన రాజధాని అంటారు. విశాఖ వెళ్లి ఇదే రాజధాని నగరం అయితే బాగుండు అంటారు. కర్నూలు వెళ్లి తన మనసుకు ఇదే రాజధాని అని చెబుతారు. చివరిగా మళ్లీ చంద్రబాబుతో స్నేహం కుదిరాక అమరావతే రాజధాని అని చెబుతారు. ఇలా స్థిరత్వం లేని వ్యక్తిని చపలచిత్తుడని పిలవడంలో తప్పు ఉంటుందా? ఇలా పలు ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే పవన్ కల్యాణ్ అవకాశవాద రాజకీయాలు నగ్నంగా కనిపిస్తుంటాయి. 2014కి ముందు తాను చెగువేరా అభిమానిని అని చెప్పుకున్నారు. ఆ తర్వాత బీజేపీతో, నరేంద్ర మోదీతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. చంద్రబాబుకు వెన్నుపోటు రాజకీయాలు తప్ప ఏమి తెలుసు అని అంటారు. మళ్లీ ఆయనతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు. చంద్రబాబు, లోకేష్లంత అవినీతి పరులు ఎవరు ఉన్నారని పవన్ కల్యాణే ఒక పెద్ద సభ పెట్టి విమర్శిస్తారు. ఎన్నికల సమయానికి పరోక్షంగా ఆయన సాయం పొందుతారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి వద్దకు వెళ్లి నమస్కారం పెట్టి వచ్చారు. వామపక్షాలు, బీఎస్పీతో కలిసి 2019లో కలిసి పోటీచేశారు. ఘోర పరాజయం తర్వాత వీరెవ్వరితో చెప్పాపెట్టకుండా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను బతిమలాడుకుని మరీ ఆ పార్టీతో జట్టు కట్టినట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆ పార్టీతో అంతంతమాత్రంగానే సంబంధాలు నడుపుతున్నారు. అదే సమయంలో చంద్రబాబుతో కలవడానికి పాట్లు పడుతున్నారు. దీనినంతా ఏమని అంటారో ఆయనే చెప్పాలి.రాజకీయాలలో కొన్నిసార్లు అవకాశవాద రాజకీయాలు కూడా కలిసిరావచ్చు. చంద్రబాబు ఇంతకాలం అలాంటివాటి ద్వారా నిలబడగలిగారు. కాని ఆ అవకాశం అందరికి ఉండదని పవన్ కల్యాణ్ అనుభవం చెబుతోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలకే పరిమితం అవుతారా?లేక విధానపరమైన ,సిద్దాంతరపరమైన రాజకీయాలు చేయగలుగుతారా? అని ఎవరైనా ప్రశ్నిస్తే, అసలు విధానాలు, సిద్దాంతాలు అంటే ఏమిటో తెలియాలి కదా అన్న ప్రశ్న వస్తుంది. ఇన్నేళ్ల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఇలా పిల్ల రాజకీయాలనే చేసే పరిస్థితిలో ఉండడం ఆయన స్వయంకృతాపరాధమే. లేదా ఆయన హిపోక్రసీ రాజకీయం అయినా అయి ఉండాలి. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
‘లోహియా’ పేరిట రాజకీయాలు
న్యూఢిల్లీ/లక్నో: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రామ్మనోహర్ లోహియా అనుచరులమని చెప్పుకునే పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. లోహియా సిద్ధాంతాలను పాటిస్తామని చెప్పే పార్టీలు ఆయన పోరాడిన కాంగ్రెస్ పార్టీతోనే పొత్తుకు ప్రయత్నాలు సాగించడం గర్హనీయమన్నారు. ఈ పార్టీలన్నీ కలిసి ‘అవకాశవాద కల్తీ కూటమి’గా ఏర్పడుతున్నాయని దుయ్యబట్టారు. దేశంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తే లోహియా ఆత్మ నిజంగా క్షోభిస్తుందని వ్యాఖ్యానించారు. తలాక్ బిల్లును వ్యతిరేకించారు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తన సిద్ధాంతాలను ఆచరిస్తున్నట్లు తెలిస్తే లోహియా గర్వపడేవారని మోదీ తెలిపారు. ‘ లోహియా ఆలోచనలకు అనుగుణంగా ఎన్డీయే ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, కృషి సించాయ్ యోజన, ఈ–నామ్, భూసార పరీక్ష కార్డులు(ఎస్‌హెచ్‌సీ) జారీచేస్తున్నాం’ అని వెల్లడించారు. కులతత్వం, లింగ వివక్ష లోహియాను చాలా బాధించేవన్నారు. ‘కానీ ఓటు బ్యాంకు రాజకీయాల్లో పీకల్లోతు మునిగిపోయిన రాజకీయ పార్టీలు దీన్ని పట్టించుకోలేదు. వీరంతా లోహియా సిద్ధాంతాలను ఆచరిస్తున్నామని అబద్ధాలు చెప్పారు’ అని అన్నారు. దేశానికీ ద్రోహం చేస్తారు లోహియా ఎప్పుడూ మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ భయంతో వణికిపోయేదని మోదీ విమర్శించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో రైతులను వేధించింది. పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలను నిరుత్సాహపరిచింది. కానీ కాంగ్రెస్ నేతల స్నేహితులు, బంధువులకు దీన్నుంచి మినహాయింపునిచ్చింది. దేశభద్రతను విస్మరించారు. లోహియా కరుడుకట్టిన కాంగ్రెస్ వ్యతిరేకి. ఈరోజు లోహియా తమకు స్ఫూర్తి అని చెప్పుకునే పార్టీలు ఆయన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తున్నాయి. ఆయన్ను అవమానించే ఏ అవకాశాన్నీ విపక్ష నేతలు వదులుకోవడం లేదు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితిని ఆయన చూసుంటే భయపడిపోయేవారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ విమర్శలను ఎస్పీ చీఫ్ అఖిలేశ్ తిప్పికొట్టారు. బీజేపీ ప్రస్తుతం మనోవైకల్యంతో బాధపడుతోందన్నారు. ‘ఓవైపు మహాత్మాగాంధీ, డా.బీఆర్ అంబేద్కర్, రామ్మనోహర్ లోహియా, భగత్‌సింగ్, సర్దార్ పటేల్ ఆదర్శాలను పాటిస్తున్నట్లు బీజేపీ చెబుతుంది. అంతలోనే ఈ నేతలంతా తీవ్రంగా వ్యతిరేకించే, అసహ్యించుకునే వ్యక్తులను అనుసరిస్తోంది. వాళ్లు ఏ సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నారో నాకైతే అర్థంకావట్లేదు’ అని వ్యాఖ్యానించారు. -
'వాళ్లంతా అవకాశవాదులు.. అందుకే వెళ్లారు'
గతంలో కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన కె.కేశవరరావు, డి.శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ తదితరులు అవకాశవాదులని, అందుకే వాళ్లు పార్టీని వీడారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లాలో పాదయాత్ర ముగిసిన అనంతరం పుట్టపర్తిలో మీడియాతో మాట్లాడారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ మనుగడ సాగిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని సూచించారు. ఆ రెండూ సాధిస్తే రాష్ట్రం ముందంజలో ఉంటుందని అన్నారు. అన్ని పార్టీలూ ఆమోదం తెలిపిన తర్వాతే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు వసుంధరా రాజె, సుష్మా స్వరాజ్, శివరాజ్ సింగ్ చౌహాన్ దేశాన్నే దోచేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతల అవినీతి పాలనను కాంగ్రెస్ బయటపెడుతుందనే ప్రధాని యోగా, అంతరిక్షం, విదేశీ పర్యటనలంటూ తప్పించుకుని తిరుగుతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఎప్పుడు తీసుకుంటారని విలేకరులు ప్రశ్నించినప్పుడు మాత్రం రాహుల్ సమాధానాన్ని దాటవేశారు. మీడియా సమావేశం ముగిసిన తర్వాత ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. నిన్నటి గురించి మర్చిపోవాలని, రేపటి గురించి ఆలోచించాలని ఉద్బోధించారు. విలువలతో కూడిన సిద్ధాంతాలు గల పార్టీ కాంగ్రెస్ అని చెబుతూ సీనియర్లకు దిశా నిర్దేశం చేశారు. ఈ భేటీలో కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. భేటీ అనంతరం రాహుల్ గాంధీ పుట్టపర్తి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు.