opposition rally
-
కేసీఆర్ సభకు హాజరు కాకపోవడంపై స్పందించిన నితీష్ కుమార్
పాట్నా: ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు పలువురు జాతీయ నాయకులు హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఎం జాతీయ కార్యదర్శి డి రాజా తదితరులు పాల్గొన్నారు. అయితే 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌యేతర ప్రతిపక్షాల ఐక్యత భేటీగా భావిస్తున్న ఈ భారీ సభకు పలువురు సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. వారిలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ఒకరు. గతేడాది ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన నితీష్ కుమార్, కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టేందుకు సిద్ధపడుతున్నారు. అంతేగాక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసేందుకు సాయం కోరుతూ గతంలో కేసీఆర్ సైతం పాట్నా వెళ్లి నితీష్‌ను కలిసిన విషయం విదితమే. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభకు నితీష్ తప్పకుండా హాజరవుతారని అంతా భావించినప్పటికీ ఆయన హాజరు కాలేదు. దీంతో బిహార్ సీఎం రాకపోవడానికి గల కారణాలపై చర్చ జరుగుతోంది. నితీష్‌ను కేసీఆర్ ఆహ్వానించలేదని, లేదా ఆయన కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని, అందుకే కేసీఆర్ ఆయన్ను పక్కకు పెట్టారని ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: పేదలకు ప్రతి నెలా రూ.2,000.. కర్ణాటక మంత్రి కీలక ప్రకటన తాజాగా కేసీఆర్ నేతృత్వంలోని ప్రతిపక్షాల నేతల భేటీకి గైర్హాజరు కావడంపై నితీష్ కుమార్ స్పందించారు. కేసీఆర్ చేస్తున్న ర్యాలీ గురించి తనకు తెలియదని అన్నారు. తాను వేరే పనుల్లో బిజీగా ఉన్నానని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆహ్వానం అందిన వారే తప్పక అక్కడికి వెళ్లి ఉంటారని పేర్కొన్నారు. అంతేగాక తనకు ఒకే ఒక్క కోరిక ఉందని.. తనకోసం తనేమి కోరుకోవడం లేదని అన్నారు. ‘నాకోసం ఏది అవసరం లేదని ఎప్పటి నుంచో చెబుతున్నాం. నాకు ఒకే ఒక కల ఉంది. ప్రతిపక్ష నాయకులు ఏకమై ముందుకు సాగడం. అది దేశానికి మేలు చేస్తుంది’ అని నితీష్ కుమార్ గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. సీఎం కేసీఆర్ ఆహ్వానంపై బీఆర్ఎస్ బహిరంగ సమావేశానికి ప్రముఖ ప్రతిపక్ష నాయకులు హాజరై ప్రసంగించిన మరుసటి రోజే బీహార్ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి జాతీయ స్థాయిలో నిర్వహించిన తొలి భారీ బహిరంగ సభ ఇదే. దీనిని 2024 జాతీయ ఎన్నికలకు ముందు కాంగ్రెసేతర ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు తొలి ప్రధాన అడుగుగా భావిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై కేంద్రంలోని ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయనున్నాయి. -
ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ముగిసినా ఢిల్లీలో రాజకీయ వేడి తగ్గలేదు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కిందంటూ, రాజ్యసభలో భౌతికంగా దాడులకు దిగిందంటూ నిరసన వ్యక్తం చేస్తూ గురువారం విపక్షాలు ర్యాలీగా వచ్చి విజయ్‌చౌక్‌లో ధర్నా నిర్వహించాయి. ముందుగా గురువారం ఉదయం పార్లమెంట్లో రాజ్యసభలో ప్రతిపక్షనేత ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, సమాజ్‌వాదీ, సీపీఎం, సీపీఐ, డీఎంకే తదితర పార్టీల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పార్లమెంట్ నుంచి విజయ్‌చౌక్‌కు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్ష ఎంపీలంతా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రజల గొంతుకను నొక్కేశారని నినదిస్తూ విజయ్ చౌక్‌కు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. మార్షల్స్‌లా బయటి వ్యక్తులొచ్చారు: శివసేన శివసేన పక్షనేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ ‘ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలను పార్లమెంటులో వెల్లడించేందుకు అవకాశం రాలేదు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల జరిగిన సంఘటన ప్రజాస్వామ్యానికి చేటు. పాకిస్తాన్ సరిహద్దు వద్ద నిలబడినట్లు అనిపించింది..’ అని విమర్శిచారు. బయటి వ్యక్తులు మార్షల్స్ యూనిఫారమ్ ధరించి మహిళలను కొట్టడానికి వచ్చారని ఆరోపించారు. అధికార పార్టీయే కారణం: డీఎంకే డీఎంకే రాజ్యసభ పక్ష నేత శివ మాట్లాడుతూ ‘ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తెచ్చిన ఇన్సూరెన్స్ బిల్లును లక్షలాది మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీనిని సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ బిల్లును బలవంతంగా ఆమోదించుకుంది. దీనిపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ఇద్దరు మహిళా ఎంపీలు దాడికి గురయ్యారు. ఈ నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్షాలు ఐక్యంగా ఉద్యమిస్తున్నాయి. పార్లమెంట్ సజావుగా జరగకపోవడానికి అధికార పార్టీనే కారణం‘ అని విమర్శించారు. ఉపరాష్ట్రపతితో భేటీ.. విజయ్ చౌక్‌లో నిరసన అనంతరం విపక్షాలు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుతో సమావేశమయ్యాయి. ఆగస్టు 11న రాజ్యసభలో భారీ సంఖ్యలో మార్షల్స్ కాని వారిని మోహరించారని ఫిర్యాదు చేశారు. సమావేశాలు సజావుగా సాగేలా, విపక్షాలు ప్రజా సమస్యలపై తమ వాణి వినిపించేలా చూడాలని కోరారు. జనరల్ ఇన్సూరెన్స్ బిల్లును కేంద్రం తెచ్చిన తీరును నివేదించారు. ఈ సమావేశం అనంతరం 15 పార్టీల ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. ‘పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టాలు తప్పించింది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అగౌరవ పరుస్తుంది. ప్రారంభంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో సంయుక్తంగా ప్రతిపక్షాలు ముఖ్యమైన అంశాలపై చర్చించాలని ప్రతిపాదించాయి. పెగసస్ గూఢచార్యం, రైతుల ఆందోళనలు, ధరలు పెరుగుదల, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై చర్చించాలని కోరాం.. చర్చ కోసం పట్టుపట్టిన ప్రతిపక్షాల డిమాండ్లను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రస్తుత ప్రభుత్వానికి పార్లమెంటరీ జవాబుదారీతనంపై నమ్మకం లేదు. పెగసస్‌పై చర్చ నుంచి పారిపోతోంది. ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రతిపక్ష పార్టీలతో చర్చించాల్సింది. కానీ ప్రభుత్వం అహంకారపూరితంగా నిర్లక్ష్యంగా ఉంది. ప్రతిష్టంభనకు పూర్తిగా బాధ్యత ప్రభుత్వమే వహించాలి’ అని పేర్కొన్నాయి. ‘ప్రభుత్వ నిరంకుశ వైఖరిని, అప్రజాస్వామిక చర్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడికి వ్యతిరేకంగా మా పోరాటాన్ని కొనసాగించడానికి, జాతీయ ప్రాముఖ్యత అంశాలు, ప్రజా సమస్యలపై ఆందోళన చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం..’ అని పేర్కొన్నాయి. -
ఢిల్లీ లో రాహుల్ గాంధీ నేతృత్వం లో విపక్ష ర్యాలీ
-
భూ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గళం విప్పనున్నారు. ఈ నెల 22న ఇక్కడి జంతర్‌మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్వహించే సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఆయన ప్రసంగించనున్నారు. అంతేగాకుండా పార్లమెంట్ వరకూ నిర్వహించే నిరసన ప్రదర్శనకు ఆయన నేతృత్వం వహించే అవకాశం కూడా ఉంది. అయితే తుది కార్యక్రమానికి సంబంధించి మరింత కసరత్తు జరుగుతోందని సభకు సంబంధించిన వివరాలు వెల్లడించిన ఆప్ ప్రతినిధి ఒకరు శుక్రవారం ఇక్కడ తెలిపారు. ఆ బిల్లుకు వ్యతిరేకంగా మార్చ్ నిర్వహించాలని గత నెలజరిగిన ఆ పార్టీ జాతీయ మండలి భేటీలో నిర్ణయించడం తెలిసిందే.