మగవాళ్లే సీరియల్ కిల్లర్లు ఎందుకవుతారు?
న్యూయార్క్: అటు సినిమాల్లో, ఇటు నిజ జీవితంలో సీరియల్ లేదా సైకో కిల్లర్ల గురించి కథలు, కథలుగా వింటుంటాం, చూస్తుంటాం. సమాజంలో ఎందుకు కొంత మంది సీరియల్ కిల్లర్స్‌గా మారుతున్నారు? భౌతికంగా వారి మెదళ్లలో వచ్చే మార్పులా, మానిసిక ఒత్తిళ్లా, ఏవీ కారణం? సీరియల్ కిల్లర్లకు ఇతర కిల్లర్లకు భౌతికంగా, మానసికంగా తేడాలు ఉంటాయా? సీరియల్ కిల్లర్ల అందరిలోనూ భౌతిక, మానసిక సమస్యలు ఒకేలాగా ఉంటాయా? ఆ సమస్యలు ఏమిటీ? మగవాళ్లే ఎందుకు ఎక్కువగా సీరియల్ కిల్లర్లుగా మారుతున్నారు?
ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాబట్టేందుకు కాలిఫోర్నియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ జిమ్ ఫాలన్ 35 ఏళ్లపాటు పరిశోధనలు జరిపారు. దాదాపు 70 సీరియల్ కిల్లర్ల మెదళ్లపై పరిశోధనలు సాగించడంతోపాటు మానసికంగా వారిపై పరిసరాలు, సామాజిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా విశ్లేషించారు. ఆయనకు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికిపోయింది. ప్రధానంగా మెదడు దెబ్బతినడం వల్లనే సీరియల్ కిల్లర్లు తయారవుతారని, అందుకు మెదడులో ఏర్పడిన పలు లోపాలతోపాటు ఓ సామాజిక అంశం కూడా వారిని సీరియల్ కిల్లర్లుగా మారుస్తోందని ఆయన కనుగొన్నారు.
మెదడులో లోపం లేదా దెబ్బతినడం
అందరు సీరియల్ కిల్లర్ల మెదడులో ముందుభాగాన, కనుబొమ్మకు ఎగువ భాగాన ఉండే ‘ఆర్బిటోఫ్రంటల్ కార్టెక్స్’ దెబ్బతిన్నట్లు తేలింది. సముచిత నిర్ణయాలు తీసుకునేందుకు ఈ భాగం ఉపయోగపడుతుందనే విషయం తెల్సిందే. అలాగే మనుషుల ఆలోచనల్లో ఆడిటింగ్ విధులను నిర్వహించే టెంపోరల్ కార్టెక్స్లో కూడా లోపం కనిపించింది. ఇది మెదడుకు వెనకభాగంలో దిగువన ఉంటుంది.
సెరొటోనిన్ ఎక్కువగా ఉండడం
శరీరంలో సెరొటోనిన్ అనే రసాయనం ఎక్కువగా ఉండడమే కాకుండా దానికి ఎంఏఓఏ అనే జన్యువు ఎక్కువగా ఎక్స్పోజ్ అవడం వల్ల సీరియల్ కిల్లర్లు హింసాత్మకంగా మారుతారు. కోపం, ఉద్రేకాలను నియంత్రించే ఈ జన్యువులో కలిగే మార్పుల వల్ల మనిషి ఉన్నట్లుండి కోపోద్రిక్తుడవుతారు. అందుకే ఈ జన్యువును హింసాత్మక జన్యువు అని కూడా అంటారు. పుట్టుకతో తల్లి నుంచి సంక్రమించే ఈ జన్యువు మగవాళ్లలోనే ఎక్కువగా ఉంటుంది. అందుకనే మగవాళ్లే ఎక్కువగా సీరియల్ లేదా సైకో కిల్లర్లుగా మారుతారు. ఆడవాళ్లకు ఇటు తల్లితోపాటు అటు తండ్రిలోని ఈ జన్యువు నుంచి మిశ్రమ జన్యువు సంక్రమిస్తుంది. అందుకనే వారు సీరియల్ కిల్లర్లుగా మారే అవకాశాలు ఎక్కువగా లేవు.
సామాజిక కోణం
పైన పేర్కొన్న సమస్యలున్న వారి ప్రవర్తన హింసాత్మకంగా ఉంటుందిగానీ హత్య చేయాలనే తలంపు ఉండదు. చిన్నతనంలో హింసాత్మక సంఘటనలను చూసినా, అలాంటి వాతావరణంలో పెరిగినా వారు సీరియల్ కిల్లర్లుగా మారుతారు. అందుకే యుద్ధాలు లేదా అంతర్యుద్ధాల మధ్య పెరిగే పిల్లలు ఎక్కువ మంది సీరియల్ కిల్లర్లుగా మారుతున్నారు.