నాలుగు రెట్లు పెరిగిన హిందాల్కో నికర లాభం
న్యూఢిల్లీ: అల్యూమినియం ఉత్పత్తి సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆకర్షణీయ ఫలితాలను వెల్లడించింది. స్వతంత్ర నికర లాభాల్లో నాలుగు రెట్లకు పైగా ఎగబాకింది. జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో మంచి కార్యనిర్వాహక పనితీరుతో మెరుగైన ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ 294 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఏడాది ఇది 61 కోట్లు. అయితే నికర లాభం నాలుగు రెట్లు పెరిగినా ఆదాయం మాత్రం క్షీణించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మొత్తం ఆదాయం 11 శాతం పడిపోయి రూ 7,716,53 కోట్లు ఆర్జించినట్టు బిఎస్ఇకి తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో రూ 8,667 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీ మొత్తం ఖర్చులు రూ 7,993.05 కోట్ల నుంచి రూ 6,703.82 కోట్లకు తగ్గాయి. అల్యూమినియం ఆదాయంలో తరుగుదల ఉన్నప్పటికీ, ఇయర్ ఆన్ ఇయర్ అల్యూమినియం ఆదాయం 8 శాతం వాల్యూమ్ గ్రోత్ ను సాధించింది. అయితే కాపర్ రెవెన్యూ 28 శాతం క్షీణించింది. ఈ ఫలితాలతో మార్కెట్లో షేరు బాగా పుంజుకుంది. దాదాపు 3 శాతం ఎగిసింది.
కంపెనీ ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితుల్లో ఒక బలమైన కార్యాచరణ ప్రదర్శించిందనీ, ద్రవ్యోల్బణం, ఎనర్జీ ధరలు మద్దతిచ్చాయని హిందాల్కో ఒక ప్రకనటలో తెలిపింది. స్థానిక మార్కెట్ లో అల్యూమినియం డిమాండ్ తగ్గడం ప్రభావితం చేసిందని పేర్కొంది. అలాగే భారీ దిగుమతులు కూడా ఫలితాలను దెబ్బతీసిందని తెలిపింది. అయితే రూపాయి బలపడడం, తగ్గిన ముడిసరుకు ధరలు, ప్రధానంగా ఎనర్జీ ఇన్ పుట్స్ భారీ ఊరటనిచ్చాయని చెప్పింది.