బళ్లారి జిల్లాకు రూ.850 కోట్ల ప్రత్యేక నిధులు
సీఎం సిద్ధరామయ్య
సాక్షి, బళ్లారి : బళ్లారి జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.850 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఆయన సోమవారం బళ్లారి జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలను, జిల్లా ప్రగతి పరిశీలన సమావేశంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. బళ్లారి గ్రామీణ ఉప ఎన్నికల సందర్భంగా బళ్లారిలో అనేక సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ బళ్లారి తాలూకాలో రెండు రోజుల పాటు ఉండి తన శాఖ పరిధిలో బళ్లారి జిల్లాకు రూ.204 కోట్ల నిధులు కావాలని కోరారన్నారు.
ఆయన కోరిన విధంగా బళ్లారి జిల్లాకు నిధుల మంజూరుకు ఆమోద ముద్ర వేశానన్నారు. ప్రస్తుతం బళ్లారి జిల్లాకు రూ.850 కోట్ల ప్రత్యేక నిధులు విడుదల చేశామని, ఇందులో రోడ్లు, మంచినీటి సమస్య తీర్చేందుకు, విద్యుత్, ఇళ్ల నిర్మాణాలకు ఖర్చు చేస్తారన్నారు. మంచినీటి సమస్య ఏర్పడకుండా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. బళ్లారి జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉందన్నారు.
బళ్లారి తాలూకాలోని సిరివార, చాగనూరు వద్ద విమానాశ్రయ నిర్మాణం గురించి తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వ్యతిరేకించానని, అయితే అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని భూమిని కొనుగోలు చేసిందన్నారు. ప్రస్తుతం విమానాశ్రయ నిర్మాణ మా లేక మరేదైనా నిర్మాణం చేపట్టాలా? అనే విషయంపై ఆలోచిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డీకే శివకుమార్, అంబరీష్, పరమేశ్వరనాయక్, ఉమాశ్రీ పాల్గొన్నారు.