పీ-నోట్లను నియంత్రించం..
- పెట్టుబడులకు ప్రతికూలమైన చర్యలేవీ ఉండవు...
- ఇన్వెస్టర్లకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ
న్యూఢిల్లీ: పీ-నోట్ల రూపంలో దేశీ మార్కెట్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులను నియంత్రించే ఆలోచనేదీ లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. నల్లధనం కట్టడికి పార్టిసిపేటరీ-నోట్లపై కఠిన నియంత్రణలు అమలు చేయాల్సిందేనంటూ జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తాజా నివేదికలో సిఫార్సు చేయటం తెలిసిందే. ఈ నివేదికతో పీ-నోట్లపై ఇన్వెస్టర్లలో భయాందోళనలు చెలరేగి... సోమవారం భారత్ స్టాక్ మార్కెట్ కుప్పకూలిన నేపథ్యంలో జైట్లీ ఈ విధంగా స్పందించారు.
దేశంలో పెట్టుబడుల వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపే ఎలాంటి చర్యలనూ ప్రభుత్వం తీసుకోబోదని స్పష్టంచేశారు. ‘పీ-నోట్లపై షా కమిటీ సూచనలను నిశితంగా పరిశీలిస్తాం. అయితే, దీనిపై మా అభిప్రాయం ఏంటనేది ఇప్పుడే చెప్పలేం. ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ దుందుడుకుగా వ్యవహరించదు. ముఖ్యంగా పెట్టుబడులకు ప్రతికూలంగా ఎటువంటి చర్యలూ ఉండవు’ అని చెప్పారు. మరోపక్క, సిట్ సిఫార్సులపై సెబీ, ఆర్బీఐ తదితర నియంత్రణ సంస్థలతో సంప్రదింపుల తర్వాతే ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంటుందని.. ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత దాస్ కూడా భరోసా ఇచ్చారు.
2009 నుంచి తగ్గుముఖం...: దేశీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా పీ-నోట్లను ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐలు), హెడ్జ్ ఫండ్లు, ఇతర విదేశీ సంస్థలు వీటిద్వారానే పెట్టుబడులు పెడతాయి. సెబీ వద్ద రిజిస్టర్ అయిన్ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ/ఎఫ్‌పీఐ) ద్వారా ఈ లావాదేవీలు జరుగుతాయి. సెబీకి తమ వివరాలేవీ తెలియకుండా ఉండేందుకే విదేశీ ఇన్వెస్టర్లు ఈ రూట్‌ను ఎంచుకుంటారు. అయితే, నల్లధనాన్ని చెలామణీలోకి తెచ్చేందుకు కొందరు ఈ విధానాన్ని ఉపయోగించుకుంటున్నారన్న వాదనలున్నాయి. పీ-నోట్లను నియంత్రించాలన్న సూచనలు 2007లో కూడా తెరపైకి వచ్చాయి.
మార్కెట్ భారీగా పడిపోవడంతో అటువంటి చర్యలేవీ ఉండబోవని అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కాగా, స్టాక్ మార్కెట్‌ను ఉపయోగించుకొని పన్నుల ఎగవేతలకు పాల్పడేవారికి అడ్డుకట్టవేయడం, నల్లధనానికి చెక్ చెప్పాలంటే పీ-నోట్ పెట్టుబడులకు కళ్లెం వేయడం కూడా కీలకమేనని తాజాగా సిట్ నివేదిక కుండబద్దలు కొట్టింది. భారత్ స్టాక్ మార్కెట్లోకి కొన్నేళ్ల క్రితం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ/ఎఫ్‌పీఐ) మొత్తం పెట్టుబడుల్లో 50 శాతం వరకూ పీ-నోట్ల ద్వారానే వచ్చేవి.
అయితే, నిబంధనలను సెబీ కొంత కఠినతరం చేయడంతో 2009 తర్వాత ఈ వాటా 15-20 శాతానికి తగ్గిపోయింది. ఈ ఏడాది మే నాటికి పీ-నోట్ పెట్టుబడులు ఏడేళ్ల గరిష్టస్థాయిలో రూ.2.85 లక్షల కోట్లకు చేరాయి. జూన్ చివరికి ఇవి రూ.2.75 లక్షల కోట్లుగా ఉన్నాయి.
సంప్రదింపుల తర్వాతే ఐఎఫ్సీపై నిర్ణయం
ఇండియన్ ఫైనాన్షియల్ కోడ్(ఐఎఫ్‌సీ)పై రిజర్వ్ బ్యాంక్ సహా అన్ని పక్షాలతో పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరిపాకే తుది నిర్ణయం తీసుకుంటామని జైట్లీ చెప్పారు. వడ్డీరేట్లపై ఆర్బీఐ గవర్నర్ అధికారాలకు కళ్లెం వేసేలా రూపొందించిన ఎఫ్ఎస్ఎల్ఆర్సీ నివేదికను కమిటీ ప్రభుత్వానికి ఇటీవలే సమర్పించింది.