కంటి ముందు నుంచి మాయం కాని దృశ్యం... పాలినోప్సియా!
మెడి క్షనరీ
ఏదైనా దృశ్యం మన కళ్ల ముందు కనిపించిందనుకోండి. అది మన దృష్టి నుంచి తప్పుకుపోయిన తర్వాత కూడా అదే దృశ్యం కంటి ముందే కొనసాగుతుందనుకోండి. ఆ కండిషన్ను పాలినోస్పియా అంటారు. గ్రీకు భాషలో పాలిన్ అంటే మళ్లీ మళ్లీ లేదా పదే పదే అని అర్థం. ఇక ఓప్సియా అంటే చూడటం. ఉదాహరణకు ఒక పులిని అకస్మాత్తుగా చూశామనుకోండి. అది మన దృష్టిపటలం నుంచి తప్పుకుపోయినా మన ఎదురుగా అదే ఉన్నట్లు భ్రాంతి పొందే భావనను ‘పాలినోప్సియా’ అంటారు. కొందరిలో ఈ తరహా భావన మామూలుగానే ఉంటుంది.
ఉదాహరణకు మన కంటి ముందు కెమెరాఫ్లాష్ వెలిగి ఆరిన తర్వాత కూడా అదే వెలుగు కంటి ముందు కొనసాగుతుంది. అయితే ఈ భ్రాంతి దీర్ఘకాలం కొనసాగితే అప్పుడు వాళ్లకు వైద్యసహాయం అవసరమవుతుంది. కొందరిలో ఇది తలకు దెబ్బతగలడం వల్ల, ఏవైనా మందులు వాడటం వల్ల, ఏ కారణం లేకుండా (ఇడియోపథిక్గా) కూడా జరుగుతుంది.