తెరేష్‌బాబుకు అశ్రు నివాళి
హైదరాబాద్: ప్రముఖ దళిత కవి పైడి తెరేష్‌బాబు అంత్యక్రియలు మంగళవారం పంజగుట్ట శ్మశానవాటికలో జరిగాయి. అంతిమయాత్రలో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఓ మంచి కవిని కోల్పోయామంటూ పలువురు కంటతడి పెట్టారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు ఆయన భౌతికకాయాన్ని మంగళవారం ఆస్పత్రి నుంచి అశోక్‌నగర్‌లోని నివాసానికి తరలించారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి రాజయ్యతోపాటు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు శామ్యూల్, ముఠా గోపాల్, ఏపీసీసీ అధికార ప్రతినిధి గౌతం, సినీ ప్రముఖులు ఆర్.నారాయణమూర్తి, ప్రముఖ పాత్రికేయులు కె.శ్రీనివాస్, సతీష్‌చందర్, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్, తెలకపల్లి రవి, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్, వివిధ సంఘాల నాయకులు ఆవుల బాలదానం, కృపాకర్ మాదిగ, బత్తుల రాంప్రసాద్, గుర్రం సీతారాం, అరుణ్ సాగర్, కొమ్ముల సురేందర్, రమేశ్, యశ్పాల్, డాక్టర్ రత్నాకర్, నీలం నాగేంద్ర.. తెరేష్‌బాబు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
తెరేష్‌బాబు కుటుంబానికి రూ. 10లక్షలు ప్రభుత్వసాయం
ప్రముఖ దళిత, బహుజన క వి, రచయిత పైడి తెరేష్‌బాబు కుటుంబానికి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. తెరేష్‌బాబు కాలేయవ్యాధితో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పందించి తెరేష్‌బాబు కుటుంబానికి సాయం ప్రకటించారు.దళిత బహుజన కవి కుటుంబానికి సాయమందించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున మల్లేపల్లి లక్ష్మయ్య కృతజ్ఞతలు తెలిపారు.