కాగజ్ కా ఆర్ట్!
కాగితంతో పడవ, విమానం, కెమెరా... మొదలైనవి చేసిన బాల్యజ్ఞాపకాలు మనలో సజీవంగా ఉంటాయి. వర్షం పడినప్పుడు, ఆ వర్షపు నీటిలో పిల్లల కాగితపు పడవలు రై..అంటూ దూసుకెళుతున్నప్పుడు ఆ జ్ఞాపకాలు మళ్లీ తడితడిగా వచ్చి మన దగ్గర నిలుచుంటాయి.
మాథ్యూ జార్జ్‌కు మాత్రం ‘కాగితపు పడవలు’ సజీవ జ్ఞాపకం మాత్రమే కాదు... ఇప్పటికీ తనకు తోడై నిలిచే కళ.
అద్భుతమైన కాగితపు విగ్రహాలను సృష్టిస్తున్న జార్జ్‌కు ‘మాస్టర్ ఆఫ్ పేపర్ ఫోల్డింగ్’ అని పేరు. చిన్న చిన్న కీటకాలు మొదలు పెద్ద పెద్ద జంతువుల వరకు ఆయన ఎన్నో కాగితపు బొమ్మలకు ప్రాణం పోశాడు. ఈ కళలో ఇతర కళకారులను స్ఫూర్తిగా తీసుకున్నప్పటికీ తనదైన సొంత ముద్ర అందులో ఉండేలా ప్రయత్నిస్తున్నాడు.
ఇటీవల పారిస్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌కు మంచి స్పందన వచ్చింది. రకరకాల రంగుల టిష్యూ పేపర్లను తన కళాత్మక నైపుణ్యంతో అబ్బురంగా తీర్చిదిద్దుతున్నాడు జార్జ్.
పేపర్‌తో కళాకృతులు తయారుచేసే జపాన్ కళ ‘ఒరిగమి’ ప్రాచీనకళ. తరతరాలుగా ఈ కళ ఒక తరం నుంచి మరో తరానికి అందుతోంది. 1797లోనే ‘ఒరిగమి’కి సంబంధించిన తొలి పుస్తకం ప్రచురితమైంది. దీనిలో ఆ కళకు సంబంధించి రకరకాల సూచనలు ఉన్నాయి. జపాన్ భాషలో ‘ఒరి’ అంటే మలచడం, ‘కమి’ అంటే పేపర్ అని అర్థం. జపాన్‌కు అవతల కూడా ఈ కళ ప్రాచుర్యాన్ని పొంది, కాలంతోపాటు ఆధునికతను తనలో జత చేసుకుంది.
‘‘పేపర్‌ను కట్ చేయడం, జిగురు పూయడం... ఇది మాత్రమే ఒరిగమి కాదు. కాస్త ఆలోచన కావాలి. దానికి సృజన తోడవ్వాలి’’ అంటున్నాడు జార్జ్.
ఆ రకంగా చూస్తే...జార్జ్ చేతుల్లో బోలెడు సృజన ఉన్నట్లే!