కళ్యాణమండపం బాత్రూమ్లో స్పై కెమెరాలు
అనంతపురం జిల్లాలో 'దృశ్యం' సీన్ మళ్లీ రిపీట్ అయ్యింది. కళ్యాణ మండపంలోని బాత్రూమ్లో రహస్య కెమరాలు ఉంచి... మహిళలు స్నానం చేసిన దృశ్యాలు చిత్రీకరించిన సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్‌లో జరిగింది. నెలన్నర క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామకృష్ణ అనే యువకుడు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.
స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఒక యువతి వివాహం గత నెలలో గుంతకల్‌లో జరిగింది. ఆ శుభకార్యానికి హాజరైన పలువురు మహిళలు స్నానాలు చేసేటప్పుడు కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలున్నాయంటూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నెలన్నర క్రితం ఆర్టీసీ బస్టాండుకు సమీపంలోని పరిటాల శ్రీరాములు కళ్యాణ మండపంలో ఓ వివాహం జరిగింది. పాత గుంతకల్లులోని రెడ్డివీధికి చెందిన రామకృష్ణ ఆ ముందు రోజే కళ్యాణమండపంలోని మహిళల బాత్రూమ్లో స్పై కెమెరాలను అమర్చాడు.
ఆ గదిలో పలువురు మహిళలు స్నానాలు చేసిన దృశ్యాలను సీడీ రూపంలో రికార్డు చేశారు. శుభలేఖపై ముద్రించిన నంబర్లకు కాయిన్ బాక్సు నుంచి ఫోన్ చేసి తనకు రూ.5 లక్షలు డబ్బు ఇవ్వాలని లేకుంటే ఆ దృశ్యాలను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితులు ఈ విషయాన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
వారి ఆదేశాల మేరకు గుంతకల్లు పోలీసులు గురువారం రాత్రి రామకృష్ణను అదుపులోకి తీసుకుని, స్పై కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణమండపం యజమానులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రామకృష్ణను రహస్య ప్రదేశంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.