Parlamentary Board
-
పెగసస్‌పై ప్యానెల్ చర్చకు బీజేపీ మోకాలడ్డు
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్ అంశంపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ప్రశ్నించేందుకు సిద్ధమైన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశానికి బీజేపీ ఎంపీలు ఆదిలోనే అడ్డుతగిలారు. పెగసస్ ఫోన్ల హ్యాకింగ్ ఉదంతం నేపథ్యంలో పౌరుల భద్రత, పరిరక్షణ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్థాయీ కమిటీ’ బుధవారం పార్లమెంట్లో సమావేశమైంది. 32 సభ్యులున్న ఈ స్టాండింగ్ కమిటీలో ఎక్కువమంది బీజేపీ ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. పెగసస్ అంశంపై చర్చకు నిరాకరించిన ఈ బీజేపీ ఎంపీలు సమావేశగదిలోకి వచ్చినా అక్కడి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయలేదు. నిబంధనల ప్రకారం రిజిస్టర్లో సంతకాల సంఖ్యను లెక్కించే కనీస సభ్యుల సంఖ్య(కోరమ్) ఉందో లేదో లెక్కగడతారు. కోరమ్ ఉంటేనే ప్యానెల్ చర్చను మొదలుపెట్టాలి. కమిటీలో కోరమ్ లేని కారణంగా స్టాండింగ్ కమిటీ పెగసస్‌పై చర్చ సాధ్యంకాలేదు. -
ఆ బిల్లును పార్లమెంట్లో అడ్డుకుంటాం
మార్కాపురం, న్యూస్‌లైన్ : బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల వాటాను 26 నుంచి 49 శాతానికి పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ, పార్లమెంట్ సభ్యుల సహకారంతో ఆ బిల్లును అడ్డుకుంటామని రాజ్యసభ మాజీ సభ్యుడు పి.మధు స్పష్టం చేశారు. ఎల్ఐసీ నెల్లూరు డివిజన్లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఉద్యోగుల 19వ మహాసభలు స్థానిక బొగ్గరపువారిసత్రంలోని ఎంకే పాండే హాల్లో శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభలకు చైర్మన్‌గా ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం వ్యవహరిస్తుండగా మొదటిరోజు ముఖ్య అతిథిగా మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడుల బిల్లును పార్లమెంట్ బయట, లోపల అడ్డుకుంటామని తెలిపారు. ఎల్ఐసీ ప్రారంభంలో కేవలం 5 వేల కోట్ల రూపాయల ఆస్తులు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 13.17 లక్షల కోట్ల రూపాయలకు ఆస్తులు చేరుకున్నాయన్నారు. గత ఏడాది డివిడెండ్ రూపంలో 1,138 కోట్ల రూపాయలను కేంద్రానికి ఎల్ఐసీ చెల్లించిందన్నారు. కేంద్రం తీసుకుంటున్న అప్పుల్లో 25 శాతం ఎల్ఐసీ ఇస్తుందన్నారు. ప్రజల దగ్గర నుంచి చిన్నచిన్న మొత్తాలు సేకరించి పాలసీ గడువు తీరిన తర్వాత సకాలంలో చెల్లిస్తుందన్నారు. దేశంలోని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు 84 శాతం మాత్రమే క్లెయిమ్‌లు పరిష్కరిస్తుండగా, ఎల్ఐసీ 99 శాతం పరిష్కరిస్తుందని తెలిపారు. ఇలాంటి బలమైన రంగాన్ని ప్రైవేట్‌పరం చేసేందుకు, విదేశీయుల చేతిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అవినీతికి తావులేకుండా సామాజిక బాధ్యతతో ఎల్ఐసీలోని ఉద్యోగులు పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రం నిట్టనిలువునా చీలిపోయే పరిస్థితి ఉందని, ఉద్యోగ, కార్మికవర్గాల మధ్య పాలకులు చిచ్చుపెట్టారని విమర్శించారు. రూపాయి పతనంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ఆర్థిక సంక్షోభం ముంచుకోస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సామ్రాజ్యవాద రాజ్యాల కనుసన్నల్లో మన పాలకులు తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రపంచ బ్యాంక్ విధానాలను అమలుచేసేందుకు పాలకులు పోటీపడటం శోచనీయమన్నారు. ఎల్ఐసీ ఉద్యోగులు సంఘటితంగా ఉండి ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాలన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని, త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాలే ఈ ప్రభుత్వానికి చివరివి కావచ్చని పేర్కొన్నారు. యూనియన్ నెల్లూరు డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్, నగేష్ మాట్లాడుతూ 33 కోట్ల పాలసీలతో దేశంలోనే ఎల్ఐసీ అగ్రగామిగా ఉందన్నారు. సంస్థ ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఐక్యంగా ఉండి ఎదుర్కొందామన్నారు. యూనియన్ జాతీయ కోశాధికారి వి.రవి, రాజేంద్రకుమార్, ఫయాజుద్దీన్, స్థానిక శాఖ మేనేజర్ గురుప్యారా, జేవీవీ జిల్లా కార్యదర్శి వెంకట్రావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ శ్రీనివాసరావు, ఏజెంట్ల సంఘ అధ్యక్షుడు కోటిలింగం, ఎన్జీఓ సంఘ అధ్యక్షుడు డాక్టర్ బీవీ శ్రీనివాసశాస్త్రి, డెవలప్మెంట్ ఆఫీసర్ల సంఘ అధ్యక్షుడు జవహర్, ఎల్ఐసీ ఉద్యోగుల సాంస్కృతిక విభాగం కార్యదర్శి జంకె శ్రీనివాసరెడ్డి, స్థానిక బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు డి.శ్రీనివాసరెడ్డి, కేశవరావు, సీఐటీయూ కార్యదర్శి డీకేఎం రఫి, బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు పిన్నిక లక్ష్మీప్రసాదయాదవ్, సీపీఎం పట్టణ నాయకులు సోమయ్య, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఒద్దుల వీరారెడ్డి, అధిక సంఖ్యలో ఎల్ఐసీ ఉద్యోగులు పాల్గొన్నారు. పట్టణంలో భారీ ర్యాలీ... ఎల్ఐసీ 19వ వార్షికోత్సవ మహాసభల సందర్భంగా శనివారం సాయంత్రం స్థానిక కంభం రోడ్డులోని ఎల్ఐసీ కార్యాలయం నుంచి నెహ్రూబజార్, పాతబస్టాండ్, నాయుడువీధి, మెయిన్‌బజార్ మీదుగా బొగ్గరపువారిసత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎల్ఐసీ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. -
గత 2 రోజులుగా పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నాం: ఎంపీ హర్షకుమార్
న్యూఢిల్లీ: రాష్ట్రవిభజనపై నిరసనగా సీమాంధ్రలో పెద్దఎత్తునా ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యమానికి మద్దతుగా సీమాంధ్ర మంత్రులు కూడా పార్లమెంటును విభజన సెగతో కాకపుట్టించారు. గత రెండు రోజులుగా పార్లమెంట్లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర మంత్రులు సమైక్యా నినాదాలతో పార్లమెంట్లో హొరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై తాము రెండు రోజులుగా పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చించామన్నారు. దీనిపై ఇంకా ఏకాభిప్రాయం రాలేదని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయమై రేపు కూడా సమావేశమవుతామని హర్షకుమార్ తెలిపారు. సీమాంధ్రలో ఉద్యమం ఉధృతంగా ఉన్న విషయాన్ని అధిష్టానం గుర్తించిందన్నారు. కేంద్రమంత్రులు, ఎంపీలు కలిసి ఆందోళన చేస్తున్నారని ఆయన తెలిపారు. అవసరమైనప్పుడు మంత్రులు కూడా సీమాంధ్ర ఉద్యమంలో పాల్గొంటారని హర్షకుమార్ చెప్పారు. -
రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టిన ఎంపీలు
న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ఇచ్చిన తీర్పుపై లోక్‌సభలో సోమవారం సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ తీర్పు వల్ల దేశ జనాభాలో దాదాపు 80 శాతం మేర ఉన్న ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని సభ్యులు అభ్యంతరం తెలిపారు. అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో బోధనా సిబ్బంది పదోన్నతుల్లో రిజర్వేషన్లను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పార్లమెంటు సార్వభౌమత్వానికి గండి పడుతున్న కోణంలో చూడాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు అమలుగాకుండా అత్యవసరంగా రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని తొలుత జేడీ(యూ) పార్టీ అధినేత శరద్ యాదవ్ జీరో అవర్‌లో చర్చకు లేవనెత్తారు. బలహీన వర్గాల ప్రయోజనాల నిమిత్తం రూపొందించిన చట్టాలను కొట్టివేయడం తరచుగా చోటుచేసుకుంటోందని ఆరోపించారు. అవినీతిని నిరోధించడంలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ రిజర్వేషన్లు వంటి సామాజిక అంశాల్లో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన చట్టాలనూ కొట్టివేస్తున్నాయని ప్రస్తావించారు. కాంగ్రెస్ ఎంపీ పీఎల్ పునియా మాట్లాడుతూ, రిజర్వేషన్ల ద్వారా బలహీనవర్గాలకు న్యాయం చేసేందుకు పార్లమెంటు తీసుకున్న పలు ముఖ్యమైన నిర్ణయాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది కేవలం ఐదుగురు వ్యక్తులా (సుప్రీంకోర్టు ధర్మాసనం) లేదా పార్లమెంటులో కూర్చున్న ప్రజాప్రతినిధులా అని ఆయన ప్రశ్నించారు. తరువాత సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో 54 శాతం జనాభా ఉన్న వెనుకబడిన వర్గాల్లో కేవలం 2 శాతం మంది మాత్రమే ఉన్నత పోస్టుల్లో ఉన్నారని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల రద్దుకు ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెడితే బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్దతు ఇస్తారని ఆ పార్టీ ఎంపీ దారాసింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. లోక్‌సభ చైర్పర్సన్ కమిటీలో జగదాంబిక కాంగ్రెస్ సీనియర్ నేత జగదాంబిక పాల్ లోక్‌సభ చైర్పర్సన్ కమిటీలో సభ్యురాలుగా నియమితులయ్యారు. సోమవారం ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. గిరిజావ్యాస్ స్థానంలో ఆమెను నియమిస్తున్నట్లు చెప్పారు. జనతాదళ్(ఎస్) సభ్యులు హెచ్డీ కుమారస్వామి, ఎన్. చెలువరయ్య రాజీనామాలను కూడా ఆమోదిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఎంపీలంతా సభకు వచ్చేలా చూడండి: సోనియా ఆహార భద్రత సహా పలు కీలక బిల్లులు ఆమోదం పొందాల్సిన నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు గరిష్ట సంఖ్యలో కాంగ్రెస్ ఎంపీలు హాజరయ్యేలా చూడాలని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ లోక్‌సభలో పార్టీ విప్‌లను ఆదేశించారు. లోక్‌సభలో చీఫ్ విప్‌గా నియమితులైన సందీప్ దీక్షిత్.. సోమవారం సహచరులతో వెళ్లి సోనియాను కలిసినప్పుడు ఆమె ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సభకు పార్టీ ఎంపీలంతా హాజరయ్యే చూడాలని పేర్కొన్నారు.