న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ఇచ్చిన తీర్పుపై లోక్‌సభలో సోమవారం సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ తీర్పు వల్ల దేశ జనాభాలో దాదాపు 80 శాతం మేర ఉన్న ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని సభ్యులు అభ్యంతరం తెలిపారు. అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో బోధనా సిబ్బంది పదోన్నతుల్లో రిజర్వేషన్లను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పార్లమెంటు సార్వభౌమత్వానికి గండి పడుతున్న కోణంలో చూడాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు అమలుగాకుండా అత్యవసరంగా రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ అంశాన్ని తొలుత జేడీ(యూ) పార్టీ అధినేత శరద్ యాదవ్ జీరో అవర్‌లో చర్చకు లేవనెత్తారు. బలహీన వర్గాల ప్రయోజనాల నిమిత్తం రూపొందించిన చట్టాలను కొట్టివేయడం తరచుగా చోటుచేసుకుంటోందని ఆరోపించారు. అవినీతిని నిరోధించడంలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ రిజర్వేషన్లు వంటి సామాజిక అంశాల్లో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన చట్టాలనూ కొట్టివేస్తున్నాయని ప్రస్తావించారు. కాంగ్రెస్ ఎంపీ పీఎల్ పునియా మాట్లాడుతూ, రిజర్వేషన్ల ద్వారా బలహీనవర్గాలకు న్యాయం చేసేందుకు పార్లమెంటు తీసుకున్న పలు ముఖ్యమైన నిర్ణయాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది కేవలం ఐదుగురు వ్యక్తులా (సుప్రీంకోర్టు ధర్మాసనం) లేదా పార్లమెంటులో కూర్చున్న ప్రజాప్రతినిధులా అని ఆయన ప్రశ్నించారు. తరువాత సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో 54 శాతం జనాభా ఉన్న వెనుకబడిన వర్గాల్లో కేవలం 2 శాతం మంది మాత్రమే ఉన్నత పోస్టుల్లో ఉన్నారని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల రద్దుకు ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెడితే బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్దతు ఇస్తారని ఆ పార్టీ ఎంపీ దారాసింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.
లోక్‌సభ చైర్‌పర్సన్ కమిటీలో జగదాంబిక
కాంగ్రెస్ సీనియర్ నేత జగదాంబిక పాల్ లోక్‌సభ చైర్‌పర్సన్ కమిటీలో సభ్యురాలుగా నియమితులయ్యారు. సోమవారం ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. గిరిజావ్యాస్ స్థానంలో ఆమెను నియమిస్తున్నట్లు చెప్పారు. జనతాదళ్(ఎస్) సభ్యులు హెచ్‌డీ కుమారస్వామి, ఎన్. చెలువరయ్య రాజీనామాలను కూడా ఆమోదిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.
ఎంపీలంతా సభకు వచ్చేలా చూడండి: సోనియా
ఆహార భద్రత సహా పలు కీలక బిల్లులు ఆమోదం పొందాల్సిన నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు గరిష్ట సంఖ్యలో కాంగ్రెస్ ఎంపీలు హాజరయ్యేలా చూడాలని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ లోక్‌సభలో పార్టీ విప్‌లను ఆదేశించారు. లోక్‌సభలో చీఫ్ విప్‌గా నియమితులైన సందీప్ దీక్షిత్.. సోమవారం సహచరులతో వెళ్లి సోనియాను కలిసినప్పుడు ఆమె ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సభకు పార్టీ ఎంపీలంతా హాజరయ్యే చూడాలని పేర్కొన్నారు.
రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టిన ఎంపీలు
Published Tue, Aug 6 2013 1:36 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement