పస్క జాతరలో పల్లెజనం
చెట్లకిందే వంటా-వార్పు
వరుణుడు కరుణించాలని ప్రత్యేక పూజలు
మెదక్ రూరల్: పల్లెలు పస్కజాతరకు పయనమయ్యాయి.యేటా శ్రావణ మాసంలో గ్రామీణ ప్రాంత ప్రజలు గ్రామ శివార్లలోని పొలాల్లోకి కుటుంబమంతా కలిసి వెళ్లి అక్కడే వంటలు చేసుకొని గ్రామదేవతలకు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా వరుణుడు కరుణించి వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధి పండాలని, అనారోగ్యాలు దరిచేరకుండా చూడాలని గ్రామదేవతలను కోరుకుంటారు.
ఈ యేడాది కూడా మెదక్ మండలంలోని హవేళి ఘణాపూర్, చౌట్లపల్లితోపాటు పలు గ్రామాల ప్రజలు ఆదివారం పస్క జాతర పండగ జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ప్రజలు ఈ పండగను జరుపుకుంటారు. వరుణ దేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురియాలని, పంటలు బాగా పండాలంటూ గ్రామశివార్లలోని చెట్ల కింద వంటా-వార్పు చేసుకుంటారు. ఈ సందర్భంగా చిలకమ్మ అనే దేవతకు పరమాన్నం నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకుంటారు.
అలాగే గ్రామశివారులోని గ్రామదేతలకు నైవేద్యం పెట్టి పూజలు నిర్వహిస్తారు. ఇంటిల్లిపాది కలిసి వన భోజనం చేసి సరదాగా గడుపుతారు. అలాగే అనారోగ్యాలు దరిచేరకూడదని, పిల్లా పాపలతో చల్లంగా ఉండేలా దీవించాలని గ్రామదేవతలను కోరుకుంటారు. కొన్ని గ్రామాల్లో శ్రావణమాసంలో మూడుసార్లు పస్కజాతర జరుపుకుంటారు.
పంటకు పట్టిన పురుగును సాగదోలేందుకు
చెన్లలో గల పంటకు పట్టిన పురుగును సాగదోలేందుకు, రోగాలు దరిదాపుల్లోకి రాకుండా ఉండేందుకు ఊరు ఊరంతా చెట్ల కిందికి వెళ్లి దేవునికి మొక్కి పరమాన్నం నైవేద్యంగా పెట్టి కుటుంబ సమేతంగా ఉల్లాసంగా పస్క పండగను చేసుకుంటాం. - బరంచ భూమయ్య, హవేళిఘణాపూర్
పంటలు బాగా పండేందుకే పస్క పండగ
వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని పస్క పండగ చేసుకుంటాం. పంటకు పట్టిన పురుగును తరిమేందుకు శ్రావణంలో సంక్రమించే వ్యాధులను తరిమేందుకు దేవుణ్ని కోరుకుంటూ నైవేద్యం పెట్టి, వంటలు చేసుకొని కుటుంబంతో చెట్లకింద సంతోషంగా గడుపుతాం. - మూగ వెంకటి, హవేళిఘణాపూర్