దక్షిణాదికి పాస్పాస్ పల్స్ క్యాండీ
ఈ ఏడాది రూ.100 కోట్ల వ్యాపారం
డీఎస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ శశాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న ధరంపాల్ సత్యపాల్ (డీఎస్) గ్రూప్ దక్షిణాది మార్కెట్లోకి పాస్పాస్ పల్స్ క్యాండీలను ప్రవేశపెట్టింది. మామిడికాయ రుచిలో రూపొందిన ఈ హార్డ్ బాయిల్డ్ క్యాండీ లోపల మసాలా పొడి ఉండడం విశేషం. భారతీయులు అమితంగా ఇష్టపడే రుచిలో వీటిని తయారు చేసినట్టు కంపెనీ న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ శశాంక్ సురానా తెలిపారు. పల్స్ క్యాండీలను ప్రవేశపెట్టిన సందర్భంగా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భావనా సూద్తో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఏడాది ఏప్రిల్లో గుజరాత్, రాజస్తాన్లో పల్స్ను ఆవిష్కరించి విజయవంతం అయ్యాం. ఇప్పుడు దక్షిణాది మార్కెట్లోకి ప్రవేశించాం. డిసెంబరుకల్లా దేశవ్యాప్తంగా విస్తరిస్తాం’ అని చెప్పారు.
రెండో స్థానంలో హైదరాబాద్..
డెయిరీ, పొగాకు, ఆహారోత్పత్తులు, మసాలా తదితర ఉత్పత్తుల తయారీలో ఉన్న డీఎస్ గ్రూప్ 2012లో కన్ఫెక్షనరీ రంగంలోకి ప్రవేశించింది. పాస్పాస్ మౌత్ ఫ్రెషనర్, చింగిల్స్ మినీ చూయింగ్ గమ్ దేశీయ మార్కెట్లో ప్రాచుర్యంలోకి వచ్చిన ఉత్పత్తులు. పల్స్ క్యాండీల అమ్మకం ద్వారా ఇప్పటికే కంపెనీ రూ.50 కోట్లు ఆర్జించింది. 2015-16లో రూ.100 కోట్లకుపైగా ఆశిస్తున్నట్టు శశాంక్ తెలిపారు. దేశంలో అత్యధికంగా క్యాండీలను ఆరగిస్తున్న నగరాల్లో ముంబై తర్వాతి స్థానాన్ని హైదరాబాద్ చేజిక్కించుకుందని చెప్పారు. రూ.6,500 కోట్ల టర్నోవర్ కలిగిన డీఎస్ గ్రూప్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కన్ఫెక్షనరీ విభాగం నుంచి రూ.220 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తోంది.