Patna- Indore Express
-
రైలు ప్రమాదం: 100 మందికి పైగా మృతి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 100 మందికి పైగా మృతిచెందినట్లు ఆ రాష్ట్ర అదనపు డీజీ దల్జీత్ సింగ్ చౌదరి వెల్లడించారు. ఈ ఘటనలో 200 మందికి పైగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఇండోర్-పాట్నా ఎక్స్ప్రెస్ 14 బోగీలు కాన్పూర్ సమీపంలోని పుక్రాయ వద్ద పట్టాలు తప్పడంతో ఈ దుర్ఘటన జరిగింది. తెల్లవారు జామున ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, సైన్యం సహాయక చర్యలు చేపట్టాయి. రైలు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో మాట్లాడారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని మోదీ తెలిపారు. బాధితులకు రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతిచెందిన వారి కుటుంబానికి రూ.3.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.25వేలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 వేలు పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్ సంతాపం ఉత్తరప్రదేశ్ రైలు ప్రమాద ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
కాన్పూర్: పట్నా-ఇండోర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం కారణంగా ఝాన్సీ-లక్నో-కాన్పూర్ సహా పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆరు రైలు సర్వీసులను రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు. కాన్పూర్ కు సమీపంలో పట్నా-ఇండోర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 91 మంది మృతి చెందగా,100 మందిపైగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతుండడంతో ఘటనా మార్గం గుండా వెళ్లాల్సిన రైళ్లను రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లించారు. తుండగా-కాన్పూర్ మార్గంలో మూడు... కాన్పూర్-బండా-ఝాన్సీ మార్గంలో నాలుగు... ఝాన్సీ-బండా, మాణిక్ పూర్-అలహాబాద్ మార్గంలో ఐదు రైళ్లను దారి మళ్లించారు. లక్నో-ముంబై పుష్పక్ ఎక్స్ ప్రెస్ ను కూడా మరో మార్గం గుండా నడుపుతున్నారు. రద్దు చేసిన రైలు సర్వీసులు 11109 ఝాన్సీ-లక్నో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ 11110 లక్నో-ఝాన్సీ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ 51803 ఝాన్సీ-కాన్పూర్ పాసింజర్ 51804 కాన్పూర్- ఝాన్సీ పాసింజర్ 51813 ఝాన్సీ-లక్నో పాసింజర్ 51814 లక్నో-ఝాన్సీ పాసింజర్ -
వారంతా ఏమయ్యారో?
కాన్పూర్: ‘గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా పెద్ద కుదుపు. మేలుకుని చూసేసరికి బోగీలు పక్కకు పడిపోయివున్నాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. నేను 5వ నంబర్ బోగీలో ఉన్నాను. నాతో పాటు వచ్చిన నలుగురైదుగురు కనిపించకుండా పోయారు. వారంతా ఏమయ్యారోనని ఆందోళనగా ఉంది. మహాకాళి దయతోనే నేను బతికి బయటపడ్డాన’ని పట్నా-ఇండోర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడొకరు తెలిపారు. ‘మేము లక్నోలో దిగ్సాలివుంది. హఠాత్తుగా పెద్ద కుదుపు వచ్చి, పక్కకు పడిపోయాం. మాతో పాటు వచ్చిన ఐదుగురు జాడ తెలియడం లేద’ని ఓ యువతి వాపోయింది. కాన్పూర్ సమీపంలో పట్నా-ఇండోర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 63 మంది మృతి చెందారు. 150 మందిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను కాన్పూర్ లోని ఆస్పత్రులకు తరలించారు. నిలిచిపోయిన ప్రయాణికులను ప్రత్యేక రైలులో మలాసా రైల్వే స్టేషన్ కు తరలించారు. -
మాటలు రావడం లేదు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పట్నా-ఇండోర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడడం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. తన బాధను వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకొవాలని ఆకాంక్షించారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి సురేశ్ ప్రభుతో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రమాదం జరగటానికి గల కారణాల గురించి అడిగారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఉత్తరప్రదేశ్ లోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలోని పక్హరయన్ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో 63 మందిపైగా మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. -
రైలు ప్రమాదంపై స్పందించిన సురేశ్ ప్రభు
న్యూఢిల్లీ: పట్నా-ఇండోర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంపై రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు స్పందించారు. సీనియర్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు సహాయ చర్యల్లో పాల్గొనాలని కోరారు. రైల్వే సహాయ మంత్రి ఘటనా స్థలానికి బయలుదేరారని వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించాలని యూపీ డీజీపీని ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ లోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలోని పక్హరయన్ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో 63 మందిపైగా మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు.